కుంగిపోవద్దు... అణిచేయొద్దు...

భార్య.. భర్త.. ఇద్దరూ ఇద్దరే! ఇంటికి మూలస్తంభాలు. వాళ్లెంత అన్యోన్యంగా ఉంటే ఆ కుటుంబం అంత సుఖశాంతులతో ఉంటుంది. కానీ ఇద్దరి మధ్యా ఒక్కోసారి అపార్థాలు తలెత్తుతుంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించేయమంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు...

Published : 20 Mar 2022 00:33 IST

భార్య.. భర్త.. ఇద్దరూ ఇద్దరే! ఇంటికి మూలస్తంభాలు. వాళ్లెంత అన్యోన్యంగా ఉంటే ఆ కుటుంబం అంత సుఖశాంతులతో ఉంటుంది. కానీ ఇద్దరి మధ్యా ఒక్కోసారి అపార్థాలు తలెత్తుతుంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించేయమంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు...

* భాగస్వామి తనకు అన్నివిధాలా సాయంగా ఉండాలని ఆశించడం సాధారణమే. అలాగని మితిమీరిన కోరికలు కోరుతుంటే మాత్రం ఆ అనుబంధం దెబ్బతింటుంది.

ఎవరి బాధ్యతలతో వాళ్లు తీరిక లేకుండా ఉంటే బంధం యాంత్రికంగా మారుతుంది. రోజులో కాసేపైనా కబుర్లు చెప్పుకోవడానికి సమయం కేటాయించండి. ఒకరు మాట్లాడుతుంటే రెండోవారు వినడం కాదు.. ఇద్దరూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా ముచ్చటించుకోవాలి. ఇంటా బయటా అన్నిటి గురించీ అభిప్రాయాలు పంచుకోవాలి. కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం లేనంతలో వైరం ఉన్నట్లు కాదు, అది వైరుధ్యం మాత్రమే!

ఏ ఇద్దరూ ఒకలా ఉండరు. ఆలుమగలూ మినహాయింపేమీ కాదు. అనేక విషయాల్లో భిన్న ధోరణులు ఉండొచ్చు. వాటిని అర్థం చేసుకోవాలే తప్ప ప్రతిసారీ తన ప్రకారమే నడచుకోవాలనే పంతం సరికాదు. అలాగే తన మనసు ఎంతమాత్రం అంగీకరించని విషయాలు, అలా చేయడం వల్ల సత్ఫలితం ఉండదని అర్థమయ్యే సందర్భాల్లో రాజీపడనవసరం లేదు. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అవగాహన, నమ్మకం, గౌరవం ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురవ్వదు. ఇద్దరి సంబంధం మధురానుబంధంగా మారాలంటే లొంగిపోయి కుంగిపోవడం లేదా అణిచేయడం.. రెండూ సరి కాదు.

మీకేమైనా కొత్త ఆలోచనలూ ప్రణాళికలూ ఉంటే చెప్పి, వాటిని అమలుచేయండి. భాగస్వామికీ కొన్ని బాధ్యతలు అప్పగించండి. లేదంటే ఆధిపత్యం వహిస్తున్నారన్న భ్రమ కలగడమే కాదు, అందులో ఎదురయ్యే కష్ట నష్టాలు అర్థంకావు కూడా.  

ఉద్వేగంగా ఉన్నప్పుడు శూలాల్లా ఉండే మాటలు వచ్చేసి అవతలి వ్యక్తిని గాయపరుస్తాయి. కనుక అలాంటప్పుడు మౌనంగా ఉండండి. కోపం చల్లారాక మీకెందుకు కోపం వచ్చిందో, ఎంత ఆందోళన కలిగిందో వివరించండి, అర్థం చేసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్