పోటీ.. నైపుణ్యాలను నేర్పుతుంది

అమల తన ఇద్దరు పిల్లలకు ఇతరులతో పోటీ పడటం నేర్పించదు. అది వారిపై ఒత్తిడి పెంచుతుంది అనుకుంటుంది. కానీ ప్రాథమిక స్థాయి నుంచే పోటీ ప్రపంచంలో అడుగుపెట్టే చిన్నారులకు అందులో

Published : 29 Mar 2022 01:32 IST

అమల తన ఇద్దరు పిల్లలకు ఇతరులతో పోటీ పడటం నేర్పించదు. అది వారిపై ఒత్తిడి పెంచుతుంది అనుకుంటుంది. కానీ ప్రాథమిక స్థాయి నుంచే పోటీ ప్రపంచంలో అడుగుపెట్టే చిన్నారులకు అందులో నైపుణ్యాలను నేర్పాల్సిన బాధ్యత అమ్మానాన్నలదే అంటున్నారు నిపుణులు. లేకపోతే వారు చదువు, కెరియర్‌లో పోటీలనెలా ఎదుర్కొనగలరు అని ప్రశ్నిస్తున్నారు...

తోటి విద్యార్థులు లేదా స్నేహితులతో పోటీ పిల్లలకు కొత్త నైపుణ్యాలను నేర్పుతుంది. భవిష్యత్తులో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పోటీ మంచిది కాదని పెద్దవాళ్లు భావించకూడదు. ఎందుకంటే గెలుపోటముల మాట అటుంచి, ఓడిపోయినప్పుడు పిల్లలు నిరుత్సాహ పడకుండా మరోసారి ప్రయత్నించేలా చేయాలి. దానికి అమ్మా నాన్నల ప్రోత్సాహం ఉంటే చాలు. పోటీనెప్పుడూ ఆరోగ్యంగా భావించేలా చిన్నారులకు అలవాటు చేయాలి. అప్పుడే దీనివల్ల ప్రయోజనాలుంటాయి. అలా అని పోటీ పేరుతో అన్నింటిలోనూ ఇతర పిల్లలతో పోల్చకూడదు. ఇది తీవ్ర ఒత్తిడిగా మారి వారి భవిష్యత్తునే చీకటి చేస్తుంది. తానూ సాధించాలనే పోటీ తత్వాన్ని నేర్పగలిగితే చాలు. ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోగలిగేలా వారు తయారవుతారు.

పట్టుదల... పోటీలోకి దిగినప్పుడు ఎదుటి వారి సామర్థ్యాన్ని పిల్లలు అంచనా వేయలేకపోతే ఎటువంటి నష్టం కలుగుతుందో తెలియడంతోపాటు, ముందుకు ఎలా సాగాలో ఆ అనుభవమే నేర్పుతుంది. తోటివారితో ఎలా మెలగాలి, ఎంత కష్టపడితే అనుకున్నది సాధించగలం అన్నవి పోటీయే అర్థమయ్యేలా చేస్తుంది. ఇవన్నీ పిల్లల్లో పట్టుదలను పెంచుతాయి. అనుకున్నది సాధిస్తే దక్కే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, స్వీయ సమర్థత వంటివి అవగాహనకు వస్తాయి. ఇవన్నీ వారి స్వీయ అనుభవం నుంచే నేర్చుకోగలగాలి. అందుకే ఆరోగ్యకరమైన పోటీ తప్పనిసరి.

బృందంతో.. ఒంటరిగా పోటీ పడటమే కాదు, బృందంతో కలిసి గెలుపును సాధించడం కూడా పిల్లల్లో నైపుణ్యాలను పెంచుతుంది. జట్టుతో కలిసి ప్రత్యర్థితో పోరాడటం నేర్చుకుంటారు. తోటివారికి సమస్య ఎదురైతే పరిష్కారం ఆలోచిస్తారు. అందరి గెలుపూ తన గెలుపు అనుకొని కృషి చేస్తారు. ఇవి పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంచుతాయి. వారి ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. ఓడినా, గెలిచినా స్థిరంగా నిలబడేలా పోటీ వారిని తీర్చిదిద్దుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని