ఫిర్యాదులను ప్రోత్సహించొద్దు...

శోభ కూతురెప్పుడూ తోటి పిల్లలపై చాడీలు చెబుతుంది. ఇంట్లో వాళ్లపైనా ఫిర్యాదులే. ఈ అలవాటును చిన్నప్పుడే దూరం చేయాలంటున్నారు మానసిక నిపుణులు. దీన్ని ఖండించకపోతే అందరినీ విమర్శించడమే అలవరుచుకుంటారు. 

Published : 07 May 2022 00:48 IST

శోభ కూతురెప్పుడూ తోటి పిల్లలపై చాడీలు చెబుతుంది. ఇంట్లో వాళ్లపైనా ఫిర్యాదులే. ఈ అలవాటును చిన్నప్పుడే దూరం చేయాలంటున్నారు మానసిక నిపుణులు. దీన్ని ఖండించకపోతే అందరినీ విమర్శించడమే అలవరుచుకుంటారు.  

అక్క కొడుతోందంటూ..: తోబుట్టువులు తాము కోరిన బొమ్మలు ఇవ్వకపోతే తల్లికి ఫిర్యాదు చేస్తారు. మరికొందరు ఏకంగా అక్క కొడుతోందంటూ అబద్ధం చెబుతారు. అప్పుడే తల్లి తమను సమర్దిస్తుందని నమ్ముతారు. చిన్నవాడుకదా అంటూ... చాడీలు చెబుతున్న వారికి పెద్దవాళ్లు మద్దతిస్తే దాన్నే పిల్లలు కొనసాగిస్తారు. ఈ అలవాటును ప్రోత్సహించకుండా విషయాన్ని గుర్తించి, అబద్ధం చెప్పిన చిన్నారులకు అది తప్పు అని వివరించాలి. ఇద్దరూ కలిసి ఆడుకోవాలని చెప్పాలి. క్రమేపీ పిల్లలు తోబుట్టువులను ప్రేమిస్తారు.

సమస్య ఉంటే...: పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చిన్నచిన్న గొడవలొస్తుంటాయి. గోరంతది కొండంతగా మార్చి వాళ్లు పెద్ద వాళ్లకు చెబుతుంటారు. దాన్ని పూర్తిగా ఆలకించాలి. లేదంటే తాము చెప్పింది వినడం లేదనే ఒత్తిడికి గురవుతారు. ముందుగా సమస్యను గుర్తించాలి. దాన్ని పరిష్కరించుకోవడం ఎలాగో నేర్పాలి. ఇది ఫిర్యాదులను తగ్గించుకోవడమే కాకుండా, పరిష్కరించుకోవడం కూడా నేర్పుతుంది.  

విమర్శ..: అమ్మానాన్నలు, చుట్టుపక్కల వారి నుంచి పిల్లలు ఫిర్యాదులు చెప్పడం నేర్చుకుంటారు. ఇంట్లో ప్రతి చిన్న విషయానికీ ఫిర్యాదులు చేసుకోవడం, లేదా బయటి వారిని నిత్యం విమర్శిస్తూ మాట్లాడుకోవడం వింటే, తామూ అలానే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. అందుకే పిల్లలెదుట పెద్దవాళ్ల ప్రవర్తన హుందాగా ఉండాలి. అప్పుడే చిన్నారులూ.. మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. ఎదుటి వారిని విమర్శనాత్మక దృష్టితో చూడకుండా సానుకూలంగా ఆలోచించడం నేర్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని