పిల్లలతో ఈ విషయాలు మాట్లాడాల్సిందే..

లైంగిక పరమైన అంశాలు, నెలసరి వంటి వాటి గురించి యుక్త వయసు ఆడపిల్లలతో తల్లి మాట్లాడాల్సిన అవసరమెంతైనా ఉందంటున్నారు నిపుణులు. అదేదో రహస్యమైన సంభాషణ అనుకుంటే వాటి గురించి అవాస్తవాలు, అర్ధసత్యాలు తెలుసుకుని, అపోహలతో తప్పటడుగు వేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

Updated : 15 May 2022 04:07 IST

లైంగిక పరమైన అంశాలు, నెలసరి వంటి వాటి గురించి యుక్త వయసు ఆడపిల్లలతో తల్లి మాట్లాడాల్సిన అవసరమెంతైనా ఉందంటున్నారు నిపుణులు. అదేదో రహస్యమైన సంభాషణ అనుకుంటే వాటి గురించి అవాస్తవాలు, అర్ధసత్యాలు తెలుసుకుని, అపోహలతో తప్పటడుగు వేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

కోప్పడకూడదు.. యుక్త వయసుకొచ్చేసరికి పిల్లలకు ఎన్నో సందేహాలు తలెత్తుతాయి. వాటిని అడిగినప్పుడు కోప్పడటం లేదా విసుక్కోవడం చేయకూడదు. ఇప్పుడే ఇవన్నీ నీకెందుకు అంటూ ఆ ప్రశ్నలను దాటవేయకూడదు. దీంతో తాము అడిగిన దాంట్లో ఏదో తప్పు ఉన్నట్లు భావిస్తారు. ఆ తర్వాత అడగడానికి సంశయిస్తారు. కానీ వీటికి సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి వీరిని మరో మార్గం వైపు అడుగులేసేలా చేస్తుంది. హార్మోన్లలో కలిగే మార్పుల నుంచి నెలసరి మొదలైన తర్వాత శరీరంలో వచ్చే తేడాల వరకు వారికి వివరంగా చెప్పగలగాలి. లైంగికపరమైన అవగాహన కలిగించాలి. అవయవాల గురించి వారి సందేహాలను, వాటి పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ వివరించడం మంచిది. యుక్తవయసులో అతి సాధారణమైన ఈ అంశాలపై అవగాహన రాకపోతే, చదువు నుంచి వారి దృష్టి వేరే వాటిపైకి మరలుతుంది.

హద్దులు.. ఈ వయసులో పాటించాల్సిన సరిహద్దులను తప్పనిసరిగా వివరించాలి. మంచి, చెడు స్పర్శలకు తేడా చెప్పాలి. బడిలో, బయటా, లేదా ఇంట్లో వారికి ఇబ్బందికరమైన సందర్భాలెదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలిగేలా పిల్లలను తయారు చేయాలి. యుక్తవయసులో దేనికి ప్రాముఖ్యతనివ్వాలి, కెరియర్‌ను మలచుకునే సమయాన్ని వృథా చేస్తే అది భవిష్యత్తుపై ఎంత ప్రభావం చూపిస్తుంది వంటివి వివరించాలి. ఈ వయసు పిల్లలతో అమ్మానాన్నలు వీలైనంత స్నేహంగా వ్యవహరించాలి. అప్పుడే వారి సందేహాలు లేదా అనుభవాలను స్వేచ్ఛగా పంచుకుంటారు. వాటిలోని తప్పొప్పులను విడమర్చి పెద్దవాళ్లు చెబితే చాలు. అవగాహన పెంచుకుంటారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్