పిల్లల ఎదుగుదలలో...
సుజాత పిల్లల ఉత్సాహం, చురుకుదనం చూస్తే రజనీకి ఆశ్చర్యం. తన కూతురు మాత్రం తరచూ అనారోగ్యంగా, పీలగా కనిపిస్తుంది. పిల్లలకు ఆహారంలో పోషక విలువలు తగ్గితే, అది వారి ఎదుగుదలను ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. ఎలాంటి ఆహారాన్ని అందించాలో సూచిస్తున్నారు.
సుజాత పిల్లల ఉత్సాహం, చురుకుదనం చూస్తే రజనీకి ఆశ్చర్యం. తన కూతురు మాత్రం తరచూ అనారోగ్యంగా, పీలగా కనిపిస్తుంది. పిల్లలకు ఆహారంలో పోషక విలువలు తగ్గితే, అది వారి ఎదుగుదలను ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. ఎలాంటి ఆహారాన్ని అందించాలో సూచిస్తున్నారు.
ప్రొటీన్లు.. పిల్లల్లో ఎదుగుదల, జీవ క్రియలు సక్రమంగా జరగడంలో ప్రొటీన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. కణ విభజన, కొత్త కణాలు తయారీ, కండరాల్లో బలం, వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఇవి ఆహారంలో ఉండాలి. చర్మం, ఎముకలు, గోళ్ల ఆరోగ్యంలో ప్రొటీన్లదే ప్రాముఖ్యం. చిక్కుడు, శనగలు, ఆకుకూరలు, గింజధాన్యాలు, విత్తనాలు, గోధుమ, బ్రౌన్‌రైస్, మొలకెత్తిన గింజలు, కూరగాయలు, మొక్కజొన్న, బంగాళాదుంప, బ్రకోలీ, గుడ్డు మంచిది. వీటితోపాటు పాల ఉత్పత్తులూ తప్పనిసరి.
కార్బొహైడ్రేట్లు... ఎక్కువశాతం పీచు ఉండే కూరగాయలు, పండ్ల ద్వారా అందుతాయి. ఓట్స్, బ్రౌన్ రైస్, బంగాళాదుంపలు, తాజా పండ్లు, చిలగడదుంప, గుమ్మడికాయ వంటివి ఆహారంలో ఉండాలి. ఎదిగే చిన్నారులకు కొవ్వు అత్యవసరం. ఆలివ్, అవకాడో, కొబ్బరి నూనెలతోపాటు పచ్చి కొబ్బరి, కొబ్బరిపాలు వంటివి పిల్లలకు ఇస్తే మంచిది.
పీచు... జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. క్యారెట్, బీట్‌రూట్, బ్రకోలీ, చిలకడదుంప, ఆకుకూరలతోపాటు రాజ్మా, చిక్కుడు, శనగ గింజలు, ఓట్స్, విత్తనాలు, మొలకల్లో పీచు ఉంటుంది. అరటి, స్ట్రాబెర్రీ, అవకాడో, యాపిల్ వంటి పండ్లు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడమే కాదు, తిరిగి ఆకలి వేసేలా చేస్తాయి.
విటమిన్లు, ఖనిజలవణాలు.. ఎముకల ఎదుగుదలకు కాల్షియం తప్పనిసరి. ఆకుకూరలు, బాదం, చియా విత్తనాలు, నువ్వులు వంటివి ఇవ్వాలి. అలాగే ఐరన్ రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచి, ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను అవయవాలన్నింటికీ సక్రమంగా చేరేలా చేస్తుంది. గుమ్మడి, బాదం, జీడిపప్పు, ఆకుకూరలు, ఓట్స్, ఎండుద్రాక్ష వంటివి మంచివి. ఏ,సీ,డీ, ఈ,కే విటమిన్లుండే ఆహారం వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. సీజన్లవారీ వచ్చే పండ్లను తినిపిస్తే ఆరోగ్యం మీ చిన్నారుల సొంతమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.