ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!

విదేశీ విద్య లక్షల మంది విద్యార్థుల కల. ఏదో ఒక మంచి కాలేజీలో సీటు రావడమే మహాభాగ్యంగా భావిస్తారు! ఇక అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీటంటే ఎంత పోటీ? అలాంటిది కేంబ్రిడ్జ్‌ సహా ఆరు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించింది చిట్టూరి నయన చౌదరి. ప్రతి దశలోనూ ముందస్తు ప్రణాళిక, అధ్యయనం, తగిన వ్యూహం ఉంటే ఎవరైనా ఇలా సాధించవచ్చంటోందీ చదువుల తల్లి...

Updated : 06 Jul 2022 06:54 IST

విదేశీ విద్య లక్షల మంది విద్యార్థుల కల. ఏదో ఒక మంచి కాలేజీలో సీటు రావడమే మహాభాగ్యంగా భావిస్తారు! ఇక అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సీటంటే ఎంత పోటీ? అలాంటిది కేంబ్రిడ్జ్‌ సహా ఆరు అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో సీటు సాధించింది చిట్టూరి నయన చౌదరి. ప్రతి దశలోనూ ముందస్తు ప్రణాళిక, అధ్యయనం, తగిన వ్యూహం ఉంటే ఎవరైనా ఇలా సాధించవచ్చంటోందీ చదువుల తల్లి...

మాది నిజామాబాద్‌లోని వర్ని. నాన్న శ్రీహరి పాలిటెక్నిక్‌ మధ్యలోనే ఆపేసి వ్యవసాయంపై దృష్టిపెట్టారు. అమ్మ మాధవి. చదువు లేని లోటు వాళ్లకు తెలుసు కాబట్టే నన్ను బాగా ప్రోత్సహించేవారు. నాకు పదో తరగతిలో 10 జీపీఏ వచ్చింది. ఉపాధ్యాయులు, బంధువులు సైన్స్‌ కోర్సుల్లో చేర్పించమని సలహా ఇచ్చారు. నాకేమో సోషల్‌ స్టడీస్‌ ఇష్టం. అదీకాక చిన్నతనం నుంచీ ప్రభుత్వ కొలువు చేయాలన్న కోరిక. ఏం చేయాలన్న దానిపై బాగా పరిశోధించా. సైన్స్‌ కోర్సులు చేసీ సివిల్స్‌ రాయొచ్చు. కానీ మొదట్నుంచీ ఈ సబ్జెక్టులపైనే దృష్టిపెడితే ఇంకా మంచిది కదా! దీంతో ఆర్ట్స్‌ తీసుకుంటానన్నా. అమ్మానాన్నలూ ప్రోత్సహించారు. దేశంలో బాగా బోధించే కళాశాలల కోసం వెతికితే రాజస్థాన్‌లోని బిర్లా బాలికా విద్యాపీఠ్‌ కనిపించింది. పోటీ తీవ్రంగా ఉంటుంది. అయినా ప్రవేశపరీక్షలో నెగ్గి సీటు సాధించా. ఆర్ట్స్‌లో డిగ్రీకి దిల్లీ యూనివర్సిటీ బాగుంటుందని తెలిసింది. దానిలో ప్రవేశానికి కావాల్సిన అంశాల గురించీ మొదటి ఏడాది నుంచే కనుక్కున్నా, సిద్ధమయ్యా. అక్కడా కోరుకున్నట్టుగా సీటొచ్చింది. బీఏ (ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌) 97.5 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచా.

ఆరింట్లోనూ అవకాశం..

లక్ష్యం.. ప్రభుత్వ కొలువే అయినా.. డిగ్రీతో ఆపేయాలనుకోలేదు. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలి. ఈ విద్యా సంస్థలు కేవలం బాగా చదివే వారి కోసమే చూడవు. తమ పరిజ్ఞానంతో సమాజానికి ఎంతవరకూ ఉపయోగపడతారో చూస్తాయి. వీటిపైనా డిగ్రీ నుంచే పరిశోధన చేశా. యూకేలో మంచి విద్యావకాశాలు ఉన్నాయని తెలిసింది. పైగా ఓసారి విజ్ఞానయాత్రలో భాగంగా అక్కడికి వెళ్లొచ్చా. నేను ఇంటర్‌ చేసిన సంస్థ.. విద్యార్థులను ఏటా ఒక్కసారైనా విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్లేది. అలా లండన్‌ వెళ్లొచ్చా. అక్కడి కళాశాలలు, కరిక్యులమ్‌ నాకు బాగా నచ్చాయి. నా లక్ష్యం భారత ప్రభుత్వ విభాగంలో పాలసీ మేకింగ్‌, స్ట్రాటజీస్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ వైపు పనిచేయాలని. దానికి అర్బన్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ సరైంది. దీనిలో పీజీకి ఆరు విశ్వవిద్యాలయాలు- కేంబ్రిడ్జ్‌ (ప్రపంచ ర్యాంకు2), ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ (4వ ర్యాంకు), యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ (8వ ర్యాంకు), మాంచెస్టర్‌ వర్సిటీ (28వ ర్యాంకు), కింగ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ (37వ ర్యాంకు), లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (56వ ర్యాంకు) ఉత్తమమైనవి. వాటికి దరఖాస్తు చేసుకుంటే అన్నింటి నుంచీ పిలుపొచ్చింది.

సేవ కూడా..

వీటిలో ఒకటి ఎంచుకోవడం కష్టమే. కానీ.. నా లక్ష్యం పట్ల స్పష్టత ఉంది. ప్రతిదాని బోధన విధానాల్ని నిశితంగా పరిశీలించా. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. పైగా ఈ విద్యాలయానిది అర్బన్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ బోధనలో ప్రపంచంలోనే రెండో స్థానం. అందుకే దీన్ని ఎంచుకున్నా. మొదట్నుంచీ చదువుతోపాటు ఇతర అంశాలకీ ప్రాధాన్యమిచ్చా. డిగ్రీ మొదటి ఏడాది నుంచే సామాజిక కార్యక్రమాలు నిర్వహించే ‘ఎనాకస్ట్‌’లో చేరా. రెండో ఏడాది దానికి అధ్యక్షురాలినీ, మూడో ఏడాది కళాశాల సొసైటీ ఉపాధ్యక్షురాలినయ్యా. యమునా నదిలో గుర్రపు డెక్కను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించా. ఇందుకు నదీ తీరంలో నివసించే పేద కుటుంబాలను భాగస్వాముల్ని చేశా. ఆ వ్యర్థాలను ఎరువుగా మార్చి, నర్సరీలకు అమ్మి ఆ డబ్బును వారికే ఇచ్చా. మురికివాడల పిల్లలకు చదువూ చెప్పేదాన్ని. హార్వర్డ్‌ యూనివర్సిటీ ఏటా ఆ ఏడాది పరిస్థితుల ఆధారంగా ఒక కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పాల్గొంటారందులో. దరఖాస్తు తర్వాత ఇంటర్వ్యూలో ఏదైనా పరిస్థితినిచ్చి మీరైతే ఎలా ఎదుర్కొంటారు అని పలు కోణాల్లో ప్రశ్నలడుగుతారు. సరిగా సమాధానమిచ్చిన వారిని అనుమతినిస్తారు. 5 రోజులపాటు సాగిన వర్చువల్‌ కార్యక్రమంలో గత ఏడాది నేనూ పాల్గొన్నా.


ఏ సబ్జెక్టు తీసుకున్నా బాగా కష్టపడితే ఫలితముంటుంది. కానీ ఇష్టపడితే ఇంకా బాగా రాణిస్తాం. ఇంటర్‌లో ఆర్ట్స్‌ తీసుకున్నపుడు చాలామంది నిరాశ చెందారు. అయినా నేను నచ్చిన దానిలో అవకాశాలు తెలుసుకుంటూ ముందుకే సాగా. సైన్స్‌ కూడా బాగా చదివినా నచ్చినదేం కాదు. కాబట్టి, అది ఎంచుకుంటే అంతగా రాణించేదాన్ని కాదేమో! అందుకే ఎవర్నైనా నచ్చిందే ఎంచుకోమంటా. నాకు ఇంట్లో వాళ్ల అండా తోడైంది. దీంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నా.

- రేవళ్ల వెంకటేశ్వర్లు, నిజామాబాద్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్