అత్తింటి వేధింపులే.. ఐఏఎస్‌ని చేశాయి!

ఒక్క క్షణం గడిస్తే.. ఆమె మెడకు ఉరిపడేదే! కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్‌ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. ఐఏఎస్‌ సాధించి.. ‘హిమ్మత్‌వాలీ లడ్కియా’ పేరుతో నేటితరం ఆడపిల్లల్లో ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ నూరిపోస్తోందిలా.. తెలివైన ఐఏఎస్‌ అధికారిణిగా గుర్తింపు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, చంబల్‌కు అర్బన్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ హోదా.

Updated : 30 Jun 2023 03:13 IST
ఒక్క క్షణం గడిస్తే.. ఆమె మెడకు ఉరిపడేదే! కానీ ఆ ఒక్క క్షణంలోనే తన జీవితం మలుపు తిరిగింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్‌ ఇద్దరు పిల్లలతో ఒంటరి పోరాటం చేసింది. ఐఏఎస్‌ సాధించి.. ‘హిమ్మత్‌వాలీ లడ్కియా’ పేరుతో నేటితరం ఆడపిల్లల్లో ధైర్యాన్నీ, స్థైర్యాన్నీ నూరిపోస్తోందిలా..
తెలివైన ఐఏఎస్‌ అధికారిణిగా గుర్తింపు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, చంబల్‌కు అర్బన్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ హోదా. ఇది ప్రస్తుతం.. ఆకలికి తట్టుకోలేక లోదుస్తుల్లో రొట్టెలు దాచుకుని బాత్‌రూమ్‌లో గుట్టుగా తిన్న చేదు గతం మరోవైపు. మధ్యప్రదేశ్‌లోని మండీ గ్రామం మాది. ఆదివాసి కుటుంబం. అమ్మానాన్నలకు మేం ఏడుగురం. నేను మూడో సంతానం. బీడీ ఆకులు ఏరుతూ, కూలీ చేసుకుంటూ పొట్ట పోషించుకునేవాళ్లం. చదివించాలని లేకపోయినా నాకొచ్చే రూ.75 స్కాలర్‌షిప్‌ డబ్బులు, ఒక పూట జావ, జత యూనిఫాం కోసం పాఠశాలలో చేర్చారు. ఉద్దేశం ఏదైనా కష్టపడి చదివి పది పాసయ్యా. మా ఊళ్లో పది పూర్తి చేసిన మొదటి అమ్మాయినని చాలా సంతోషించా. ఇంతలోనే పెళ్లన్నారు. నాకన్నా పదకొండేళ్లు పెద్దవాడు. పెళ్లిచూపుల్లోనే అతని దురుసుతనం బయటపడింది. నాకీ పెళ్లివద్దని చెబితే.. పెద్దింటి సంబంధమని నోరు నొక్కేశారు. అత్తింట్లో పరిస్థితి మరీ దారుణం. వాళ్లకి కావాల్సింది కోడలు కాదు, పనమ్మాయి. అందరూ తిన్న తర్వాతే నేను తినాలి. ఒక వేళ ఏమీ మిగలకపోతే మళ్లీ వండకూడదు. నలుగురిలోకి రాకూడదు. తలమీద చెంగు తీయకూడదు. నవ్వకూడదు. టీవీ చూడకూడదు. ఎదురు తిరిగితే రక్తం కారేలా కొట్టేవాడు నా భర్త. నవ్వడం ఎప్పుడో మరిచిపోయా. ఆత్మహత్య చేసుకుందామనుకొనే సమయానికి.. గర్భవతిని అని తెలిసింది. అలాంటి సమయంలో కూడా సరిగా తిండి పెట్టేవారు కాదు. దాంతో ఆకలికి తట్టుకోలేక నాలుగు రొట్టెలు దొంగిలించి లోదుస్తుల్లో దాచుకుని రహస్యంగా స్నానాలగదిలో తినేదాన్ని. ఇవన్నీ అమ్మకు చెబితే ఒక బిడ్డపుడితే అంతా సర్దుకుంటుందిలే అంది. ఇద్దరు పుట్టారు. యజుష్‌, అథర్వ్‌. పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు.

ఆఖరి క్షణంలో...

ఈ కష్టాలతో విసిగిపోయి ఉరిపోసుకోవడానికి సిద్ధమయ్యా. చీర ఫ్యాన్‌కి బిగించా. మెడకు చుట్టుకునేటప్పుడు అనుకోకుండా నా చూపు కిటికీ వైపు పడింది. అక్కడ మా అత్తగారు నేను చేసేదంతా కన్నార్పకుండా చూస్తుందే తప్ప ఆపలేదు. కనీసం ఎందుకిలా చేస్తున్నావ్‌ అని అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. ‘ఛీ ఇలాంటి వాళ్ల కోసమా నేను చావాలనుకుంటుంది. అయినా నేను పోయాక పిల్లల పరిస్థితి ఏంటి?’ అన్న ఆలోచన వచ్చింది. పిల్లల కోసమైనా బతకాలి. బయటకెళ్లి.. పాచిపని చేసుకునైనా నా బిడ్డల్ని సాకుతా తప్ప ఇక అక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదని నిశ్చయించుకున్నా.

నాలుగంకెల జీతం...

రెండువేల రూపాయలతో ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఓ బ్యూటీపార్లర్‌లో సహాయకురాలిగా చేరా. చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పడం, ఇంట్లో వంటపనులు చేయడం.. ఇలా దొరికిన పనల్లా చేశా. ఇవన్నీ చేస్తూనే బీఏ పరీక్షలు రాశా. ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేశా. యూనివర్సిటీ ఫస్ట్‌. కొన్ని రోజులకి అమ్మ సాయం కూడా తోడైంది. చిన్న ఉద్యోగం వస్తే చాలనుకుని దినపత్రికలు తిరగేస్తోంటే.. యూపీఎస్సీ నోటిఫికేషన్‌ కనిపించింది. అందులో నాకు మొదట కనిపించింది.. మంచి జీతమే. ఎంతకష్టమైనా సాధించాలని గట్టిగా అనుకున్నా. రేయింబవళ్లు చదివి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించా. 24 ఏళ్లకే చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌నయ్యా.

నా జీవితమే పాఠంగా...

ఇల్లొదిలి వచ్చినా.. నా కాళ్లపై నేను నిలబడినా నా భర్త వేధింపులు తగ్గలేదు. ఎక్కడుంటే అక్కడకు వచ్చి కొట్టేవాడు. ఆఖరికి పోలీసులకు ఫిర్యాదు చేసి అతన్నుంచి విడాకులు తీసుకున్నా. నాకు నచ్చిన హర్షని రెండో వివాహం చేసుకున్నా. నాలా మౌనంగా బాధలు భరించే ఆడపిల్లల కోసం హిమ్మత్‌ వాలీ లడ్కియా (బ్రేవ్‌ గర్ల్స్‌)పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ను మొదలుపెట్టా. నా జీవితాన్నే వాళ్లకి పాఠాలుగా చెబుతూ.. అమ్మాయిలకు ధైర్యం, తెగువ నూరి పోస్తున్నా.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని