ఉపాధి చూపుతూ కోట్లు ఆర్జిస్తోంది..
పెళ్లై, పిల్లలు పుట్టగానే ఇంకేముంది జీవితం అనుకుంటారు కొందరు మహిళలు. ఆమె అలా అనుకోలేదు. తనకంటూ ఒక గుర్తింపు కోరుకుంది. తనలాంటి మహిళల కోసం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. అదే ఇప్పుడు కోట్ల వ్యాపారంగా విస్తరించింది.
పెళ్లై, పిల్లలు పుట్టగానే ఇంకేముంది జీవితం అనుకుంటారు కొందరు మహిళలు. ఆమె అలా అనుకోలేదు. తనకంటూ ఒక గుర్తింపు కోరుకుంది. తనలాంటి మహిళల కోసం ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. అదే ఇప్పుడు కోట్ల వ్యాపారంగా విస్తరించింది. హర్‌కీ ఫౌండర్, సీఈఓ నేహా బగారియా స్ఫూర్తి ప్రయాణం ఆమె మాటల్లోనే..
ముంబైలో పుట్టి పెరిగా. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో సైకాలజీలో పీజీ చేశాను. ఇండియా తిరిగొచ్చి నాన్న వ్యాపారంలో చేరాను. పెళ్లయ్యాక బెంగళూరు వెళ్లి మావారి కెంవెల్ బయోఫార్మాలో పాలుపంచుకున్నా. పిల్లల్ని చూసుకోవడంలో ఎంత ఆనందమున్నా, కెరియరూ ముఖ్యమే అనిపించింది. కానీ మెటర్నిటీ సెలవయ్యాక తిరిగి వ్యాపారం చూసుకోవడం కష్టమనిపించింది. ఆ అనుభవంతోనే మహిళలకు ఉద్యోగ ప్రయాణంలో సాయం చేయడానికి ఒక వేదిక ఉండాలనిపించింది.
ఐదుగురు మహిళలతో 2015లో ‘జాబ్స్ ఫర్ హర్’ పేరుతో వెబ్‌సైట్ ఆరంభించా. ఇప్పుడదే వందమందికి పైగా ఉద్యోగులతో హర్‌కీగా పరిణమించి 8.87 కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది. పెళ్లి, మాతృత్వ కారణాలతో అమ్మాయిలకి కెరియర్‌లో అటంకాలు వస్తుంటాయి. అలాంటి వారికి వృత్తి నైపుణ్యాల్లో తర్ఫీదిచ్చి తిరిగి ఉద్యోగం సంపాదించేందుకు తోడ్పడటమే హర్‌కీ లక్ష్యం. ఉద్యోగం కోసం చూస్తున్నవారు వెబ్‌సైట్‌లో జాబ్స్ సెక్షన్‌లోకి వెళ్లి అనుకూలమైన వాటికి దరఖాస్తు చేసుకుంటే ఆ కంపెనీల నుంచి పిలుపొస్తుంది. అందుకు పైసా చెల్లించనవసరంలేదు. అభ్యర్థులను అందించినందుకు ఆయా కంపెనీలే మాకు డబ్బు చెల్లిస్తాయి. ఇది నౌకరీ డాట్‌కామ్, లింక్‌డిన్‌ల కంటే భిన్నమైంది. ఇక్కడ ఉద్యోగాన్వేషణతో బాటు కోరుకున్న కొలువులకు అవసరమయ్యే నైపుణ్యాలు, శిక్షణ, మార్గదర్శకత్వం కూడా ఉంటాయి.
ఇదంత సులువైన పనేమీ కాదు. మూస పద్ధతులు, పక్షపాత ధోరణులు వద్దని కంపెనీలు చెబుతుంటాయి. ఓ కంపెనీ యజమాని అయితే ‘ఇలాంటి కిట్టీ పార్టీ మహిళలు అవసరం లేదు’ అనేశారు. మరో సీఈఓ ‘అప్పుడే చదువు ముగిసిన అమ్మాయిలైతే బాగుంటుంది. పెళ్లయిన వారికి పిల్లల ధ్యాసే ఉంటుంది’ అన్నారు. నేనిది మొదలు పెట్టిందే గ్యాప్ తీసుకున్న వారికి తిరిగి అవకాశం కల్పించాలని. ఆడవాళ్లకి తాను ఇల్లూ పిల్లల్ని సరిగ్గా చూసుకోవడంలేదేమో అనే దిగులుంటుంది. నా మట్టుకు నాకు ఆ భయం, అపరాధ భావనల నుంచి బయటపడటానికి ఎన్నో ఏళ్లు పట్టింది. కానీ కూడదీసుకున్నా. వాటికి తోడు వృత్తిపరమైన సవాళ్లనూ ఎదుర్కోవాలి. కనుక నా ముఖ్య ఉద్దేశం కెరియర్‌లో బ్రేక్ వచ్చిన వారికి తోడ్పడటం.
ఉద్యోగుల సంఖ్య, హోదాలను బట్టి కంపెనీలకు రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకూ ప్యాకేజీలు అందిస్తుంది హర్‌కీ. అందులో మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది.. చొప్పున కాల వ్యవధిని ఎంచుకునే వీలుంటుంది. మాకు పదివేల కంపెనీలతో భాగస్వామ్యం ఉంది. ఒక జాబ్ పోర్టల్‌గా మొదలై శిక్షణ ఇచ్చి ప్లేస్‌మెంట్స్ చూపే వేదికగా రూపుదిద్దుకుంది. హర్‌కీలో ఎక్కువశాతం మహిళలే. అమెజాన్, యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, టీవీఎస్ మోటార్స్, మింత్రా, డెల్, పీడబ్ల్యూసీ లాంటి విభిన్న సంస్థలకు ఉద్యోగుల నియామకాల్లో హర్‌కీ తోడ్పడుతుంది. నాకు పర్యటనలు, మంచు పర్వతాల్లో విన్యాసాలు, స్కూబా డైవింగ్, ఎడ్వంచర్ స్పోర్ట్స్ అంటే ప్రాణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.