నెల సరి చేసింది

నెలసరి సమయంలో తాను ఎదుర్కొన్న బాధలు వేరొకరికి రాకూడదనుకుంది. రుతుక్రమం గురించి చర్చించడాన్నే తప్పుగా భావించే గ్రామంలో, ఆడవాళ్లు ధైర్యంగా శానిటరీ ప్యాడ్‌లు కొని తెచ్చుకొనే చైతన్యాన్ని తీసుకొచ్చింది.

Updated : 15 Jul 2023 05:11 IST

నెలసరి సమయంలో తాను ఎదుర్కొన్న బాధలు వేరొకరికి రాకూడదనుకుంది. రుతుక్రమం గురించి చర్చించడాన్నే తప్పుగా భావించే గ్రామంలో, ఆడవాళ్లు ధైర్యంగా శానిటరీ ప్యాడ్‌లు కొని తెచ్చుకొనే చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఈ సమస్యల గురించి తల్లీ పిల్లలూ, తోటి మహిళలతో నిర్భయంగా చర్చించే కొత్త ఒరవడి తీసుకొచ్చింది. ఆమే కల్పనా వర్మ.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్తాలా కల్పనది. ఆడపిల్లలపై బోలెడు ఆంక్షలున్న మారుమూల గ్రామమది. చిన్నతనం నుంచీ దేన్నైనా చురుగ్గా నేర్చుకునే తత్వం ఈమెది. అయితే, ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ నెలసరి తప్పదనీ, ఆ రోజులను ఆరోగ్యంగా గడపాలనీ తెలుసుకోవడానికి మాత్రం తనకీ కొంత సమయం పట్టింది. కల్పన రజస్వల అయ్యే సమయంలో పదోతరగతి చదువుతోంది. ‘ఆ రోజు ఇప్పటికీ నాకెంతో గుర్తు. మర్నాడు పరీక్షకు హాజరవ్వాలి. ముందురోజు రాత్రి నాకు ఒకటే కడుపు నొప్పి. కాసేపటికి రక్తస్రావం... అది చూసి హడలిపోయి అమ్మ దగ్గరికి పరుగెత్తాను. విషయం చెబితే ఓ పాత వస్త్రం ఇచ్చి వాడమంది. కొన్ని జాగ్రత్తలూ చెప్పింది. నిజానికి ఇంట్లో పిల్లలందరిలోనూ నేనే పెద్ద. అప్పటివరకూ నాకు ఈ విషయం గురించే తెలియకపోవడమేంటి అనిపించింది. ఈ ఆందోళనకు తోడు ఉదయం వరకూ కడుపు నొప్పి తగ్గనేలేదు. దీంతో మర్నాడు ఎగ్జామ్‌ సరిగా రాయలేకపోయా’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుందామె.

కాదని వ్యతిరేకించినా...

‘కొన్నాళ్లకు ఇది నా ఒక్కదాని సమస్యే కాదు.. ప్రతి మహిళకూ ఎదురయ్యే అనుభవమేనని తెలుసుకున్నా. పెళ్లైనవారూ దీని గురించి సరిగా మాట్లాడలేకపోతుండటం, కనీసం వారి పిల్లలకు అర్థమయ్యేలా మంచీ, చెడూ చెప్పలేకపోవడం చూసి బాధేసింది. దీనికితోడు మురికి వస్త్రాలు, కాగితాలూ, ఆకులూ వంటివి వాడటం వారిని అనారోగ్యాలకు గురిచేసేవి. మా ఊళ్లో శానిటరీ ప్యాడ్‌లు దొరికేవి కావు. అప్పుడే ఓ స్వచ్ఛంద సంస్థ నెలసరి గురించి మా పాఠశాలలో అవగాహనా తరగతులు నిర్వహించింది. వారి సాయంతో...నేను, మా చెల్లితో కలిసి శుభ్రమైన కాటన్‌ ప్యాడ్లను తయారు చేయడం ప్రారంభించా’మంటోంది కల్పన. వీటిని ఒక డబ్బాలో పెట్టి కావల్సిన వాళ్లు తీసుకునేలా అందుబాటులో ఉంచారు. పీరియడ్‌ వచ్చిన వాళ్లు రాత్రి వేళల్లో వచ్చి డబ్బాలో ఉంచిన పుస్తకంలో పేరు రాసి ప్యాడ్లు తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం రెండు శానిటరీ ప్యాడ్లు, ఒక సబ్బు, నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలూ, సూచనలు తెలిపే ఓ కాగితాన్ని బాక్సులో పెడతారు. మొదట్లో వీటిని ఉచితంగానే ఇచ్చినా ప్రసుత్తం నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నారు. అయితే ఈ పని వాళ్ల నాన్నకు నచ్చలేదు. వ్యతిరేకించేవారు. పరువు తీస్తున్నావనేేవారు. అయినా సరే, తను ఈ పని మానాలనుకోలేదు. క్రమంగా వాళ్లమ్మ కల్పన చేస్తోన్న మంచి పని గురించి ఆయనకు అర్థమయ్యేలా చెప్పేసరికి ఊరుకున్నారు. అంతేకాదు తర్వాత్తర్వాత వీళ్లెవరూ లేనప్పుడు ఇతర స్త్రీలెవరైనా ఇంటికి వస్తే ఆయనే స్వయంగా ఆ పెట్టెని తెచ్చి ఇవ్వడమూ మొదలుపెట్టారట. క్రమంగా ఊళ్లోని ఇతర మహిళలు... వారి పిల్లలతో, తోటివారితో కూడా ఈ సమస్యలను చర్చించడం, శుభ్రమైన, ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించడం చేస్తున్నారు. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని పక్కన ఉన్న ఊళ్లలోనూ చైతన్యం కనిపిస్తోంది. మార్పు కోరుకుంటే సరిపోదు... మొదటి అడుగు తనదే కావాలనుకున్న కల్పన సంకల్పం అభినందనీయమేగా మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్