అంతరిస్తున్న కళ.. కోట్ల వ్యాపారమైంది!

ఓటమికి భయపడితే... ఆటైనా, జీవితమైనా అక్కడే ఆగిపోతుంది...  విజయం కావాలంటే గమనం మార్చుకోవాల్సిందే... అంటారు యోషా. నోట్ల రద్దుతో వ్యాపారం మూసేయాల్సి వస్తే... ఆదరణ కోల్పోతున్న కళలకు పునరుజ్జీవం కల్పించడానికి మరోదాన్ని ఎంచుకుని సాగిపోతున్నారు.

Updated : 18 Jul 2023 09:34 IST

ఓటమికి భయపడితే... ఆటైనా, జీవితమైనా అక్కడే ఆగిపోతుంది...  విజయం కావాలంటే గమనం మార్చుకోవాల్సిందే... అంటారు యోషా. నోట్ల రద్దుతో వ్యాపారం మూసేయాల్సి వస్తే... ఆదరణ కోల్పోతున్న కళలకు పునరుజ్జీవం కల్పించడానికి మరోదాన్ని ఎంచుకుని సాగిపోతున్నారు. తాను ఉపాధి పొందడమేకాదు... వందల మందికి స్థిర ఆదాయం కల్పిస్తున్నారు.

‘కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు... పడినా లేస్తున్నందుకు’.

-యోషా

‘అవసాన దశలో ఉన్న జానపద కళలకు పూర్వవైభవం కల్పించడానికీ, అంతరించిపోతున్న చేతి వృత్తి కళాకారులకు ఊతం ఇవ్వడానికీ మిమెరాకీ సంస్థను ప్రారంభించా’నంటారు యోషా. ఆమెది అలీగఢ్‌కి దగ్గర్లోని ఓ చిన్న పల్లెటూరు. తండ్రి విద్యావేత్త. తల్లి చిత్ర కళాకారిణి. జయపురలో డిజైనింగ్‌లో మాస్టర్స్‌, ఎకనామిక్స్‌లో బ్యాచిలర్స్‌, గుడ్‌గావ్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. చదువయ్యాక యోషా ఆర్థిక రంగంలో పదిహేనేళ్ల్లు  పనిచేశారు. ప్రపంచ బ్యాంక్‌, గేట్స్‌ ఫౌండేషన్‌, ఐడియో వంటి సంస్థలతో కలసి ఆసియా అంతటా పని చేశారు. అరవై ఏళ్ల వయసులో వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్న తండ్రి తపన, అమ్మ తన ప్రతిభతో ఇంటినే...కాన్వాస్‌గా మార్చడం చూసిన యోషా తానూ ఏదైనా సొంతంగా చేయాలనుకున్నారు. ఈలోగా పెళ్లి అయ్యి భర్తతో కలిసి హాంకాంగ్‌లో స్థిరపడాల్సి వచ్చింది. అక్కడికెళ్లాక గుడ్‌గావ్‌తో పాటు హాంకాంగ్‌ కేంద్రంగా క్యాష్‌బ్యాక్‌లూ, డిస్కౌంట్‌ కూపన్స్‌ అందించే ‘లఫాలఫా.కామ్‌’ని ప్రారంభించారు.

లక్షల్లో డౌన్‌లోడ్‌లు...

ఇది ప్రారంభించిన తక్కువ కాలంలోనే సిలికాన్‌ వ్యాలీ ‘యాక్సిలేటర్‌ ప్రోగ్రామ్‌-500 స్టార్టప్స్‌’లో ఒకటిగా ఎంపికైంది. ఫేస్‌బుక్‌ ‘ఎఫ్‌బి స్టార్ట్స్‌’ ప్రోగ్రామ్‌లోనూ మెరిసింది. అంతేకాదు... ప్రారంభదశలోనే ఈ యాప్‌ మిలియన్ల డౌన్‌లోడ్‌లను నమోదు చేసుకుంది. అంతా అద్భుతంగానే జరుగుతోంది అనుకుంటున్న సమయంలో మన దేశంలోని నోట్ల రద్దు....ఈ సంస్థపై పెద్ద ప్రభావాన్నే చూపించింది. కలల ప్రాజెక్టు కళ్లముందే కుప్పకూలిపోతే ఎవరైనా మరో ఆలోచన చేయడానికి సాహసించరు. కానీ యోషా మాత్రం మరో ప్రయత్నం చేయాలనుకున్నారు.  

వాటిపై ఇష్టంతో...

యోషా... ఓ సారి హాంకాంగ్‌లో జరిగిన భారతీయ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పుడు ఆమె వేసుకున్న ‘గూచీ’ హ్యాండ్‌ బ్యాగుపై చిత్రించిన మధుబనీ పెయింటింగ్‌ అందరినీ ఆకట్టుకుంది. దాన్ని చూసిన వాళ్లంతా ‘ఆ బ్రాండ్‌ లిమిటెడ్‌ ఎడిషనా’ అని అడగడం,  విషయం చెబితే... తమకూ అలాంటిది కావాలని కోరడంతో అలాంటివి ఓ నలభై బ్యాగులు తయారు చేయించారు యోషా. అవి హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇలా మొదటి ఆరునెలల్లో 33 లక్షల రూపాయల ఆదాయం అందుకోవడంతో అది ఆర్ట్‌టెక్‌ కంపెనీ ‘మిమెరాకీ’ ఆవిర్భావానికి దారితీసిందని గుర్తు చేసుకుంటుందామె. 

చరిత్ర చెప్పాలనుకున్నారు...

జానపద కళలను పునరుజ్జీవింప చేయడంతో పాటు ఆర్టిస్టులకూ, ఔత్సాహికులకు మధ్య దూరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ స్టార్టప్‌ ప్రారంభమైంది. ప్రాచీన సంప్రదాయ పనితనంతో అందమైన, అరుదైన భారతదేశ వారసత్వపు కళల చరిత్రను చెప్పాలనుకున్నారు. ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించారు. అంతేకాదు, ఇందులో సభ్యత్వం తీసుకుంటే దేశంలోని బాందినీ, అయిపన్‌, ఆప్లిక్‌, బనీ, పట్టచిత్ర, భిల్‌, బికనీర్‌, బ్లూపాటరీ...వంటి అన్ని కళారూపాలనూ నేర్చుకోవచ్చు. జానపద కళాకారులకు లైవ్‌ వర్క్‌షాపుల నిర్వహణ, ప్రీ-రికార్డ్‌ మాస్టర్‌క్లాస్‌ల ద్వారా కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నారు. అంతేకాదు, అరుదైన కళలనూ, కళారూపాలను తర్వాతి తరాలకు అందించేందుకు డాక్యుమెంటేషన్‌ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ మూడు వేలకు పైగా కళారూపాలని నిక్షిప్తం చేశారట. 200 మంది కళాకారులకు ఉపాధి కల్పించారు. ప్రస్తుతం ఈ సంస్థలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, సింగపూర్‌, దుబాయి వంటి చోట్ల నుంచి ఇరవైవేల మందికిపైగా సభ్యులు ఉన్నారు. ఏటా కోట్ల రూపాయల వార్షికాదాయాన్ని అందుకుంటున్నారు. ప్రపంచ వారసత్వ కళల మార్కెట్టులో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని చెబుతున్నారావిడ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్