నాసా 99 సార్లు తిరస్కరించినా..

మిస్‌ ఒరెగాన్‌ యూఎస్‌ఏ అందాల పోటీల ఫలితాలు ప్రకటిస్తున్నారు! అందరూ అనుకున్నట్టు ఇంగ్లిష్‌ పేరు కాకుండా మంజు అనే భారతీయ పేరు వినిపించే సరికి అంతటా ఆశ్చర్యం. అంతకంటే ఆసక్తికరం.. ఆమె అంతరిక్ష శాస్త్రవేత్త కావడం.  

Updated : 21 Jul 2023 00:25 IST

మిస్‌ ఒరెగాన్‌ యూఎస్‌ఏ అందాల పోటీల ఫలితాలు ప్రకటిస్తున్నారు! అందరూ అనుకున్నట్టు ఇంగ్లిష్‌ పేరు కాకుండా మంజు అనే భారతీయ పేరు వినిపించే సరికి అంతటా ఆశ్చర్యం. అంతకంటే ఆసక్తికరం.. ఆమె అంతరిక్ష శాస్త్రవేత్త కావడం.  సామాజిక కార్యకర్తగానూ ఎన్నో సేవలందిస్తోందీమె.. 

మంజుకి నాలుగేళ్లప్పుడు బెంగళూరు నుంచి అమెరికాలోని ఒరెగాన్‌కు వచ్చి స్థిరపడింది ఆమె కుటుంబం. అమ్మ గీత, నాన్న ఫణి. వీళ్లు విత్తన పరిశోధన ల్యాబ్‌ని నిర్వహించేవారక్కడ. చిన్నతనంలో తండ్రితో కలిసి అంతరిక్ష ప్రదర్శనశాల కెళ్లినప్పుడు.. కల్పనా చావ్లా కథ వింది. అప్పట్నుంచీ మంజు కలలన్నీ నింగిలోని నక్షత్రాల చుట్టే తిరిగేవి. అంతరిక్షంపై ప్రేమతో ఒరెగాన్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేసింది. ‘చేస్తే నాసాలోనే ఇంటర్న్‌షిప్‌ చేయాలన్నది నా కల. కానీ నాసా నుంచి అనుమతి దొరకలేదు. ఒకటి కాదు వంద సార్లు దరఖాస్తు చేశాక.. సరిగ్గా వందోసారి ఒప్పుకొంది. అలబామాలోని మార్షల్‌ స్పేస్‌ ప్లైట్‌ సెంటర్‌లో పనిచేసే అవకాశం వచ్చింది. అది విజయవంతం కావడంతో నాసాకే చెందిన జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో మరో నాలుగు అంతరిక్ష పరిశోధనల్లో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అనుభవంతో వైట్‌హౌస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ విభాగంలో పనిచేశా’ అనే మంజు బయో ఆస్ట్రోనాటిక్స్‌లో పీజీ పూర్తి చేసింది. గతేడాది చంద్రుడిపైకి నాసా పంపిన ఆర్టెమిస్‌-1కు క్యాప్సుల్‌ డిజైన్‌ చేయడంలోనూ కాక్‌పిట్‌ రూపకల్పనలోనూ కీలకంగా పనిచేసింది. అంతరిక్షంలోకి అడుగుపెట్టడానికి కావాల్సిన శిక్షణా తీసుకుంది.

మిస్‌ అమెరికా పోటీలకు..

మంజు ఆసక్తి పరిశోధనల వరకే అనుకుంటే పొరపాటు. టీనేజీ వయసు నుంచే అందాల పోటీల్లోనూ పాల్గొనేది. చాలాసార్లు ఓటమి ఎదురైంది. కానీ ఆ వైఫల్యాలకు భయపడలేదామె. ఆ పోరాటతత్వం ఫలితమే 2017లో ‘మిస్‌ బెంటన్‌ కౌంట్‌ యూఎస్‌ఏ’, ‘మిస్‌ వరల్డ్‌ కాలిఫోర్నియా-2019’ పోటీల్లో విజేతని చేశాయి. తాజాగా ‘మిస్‌ ఒరెగాన్‌ యుఎస్‌ఏ- 2023’ కిరీటాన్ని అందించాయి. ‘ఈ ఏడాది చివర్లో జరిగే ‘మిస్‌ అమెరికా-2023’ పోటీలకు నుంచి పోటీ చేయడానికి అర్హతను సాధించా. ఆత్మవిశ్వాసం ఉంటే గెలుపు మనదే అవుతుందనే నమ్మకం నాది’ అనే మంజూ మరో వైపు సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది.   

ఆపరేషన్‌ పీరియడ్‌...

‘కొన్ని దేశాల్లోని జైళ్లలో.. మహిళలకు నెలకు రెండు ప్యాడ్స్‌ మాత్రమే అందిస్తారట. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పేదపిల్లలు నెలసరి సమయంలో సరైన సదుపాయాల్లేక, ప్యాడ్స్‌ కొనే స్తోమతలేక చదువుకు దూరమవుతున్నారు. అందరికీ సమానవిద్య ఎలా చేరడం లేదో, నెలసరిలో అందాల్సిన మౌలిక సదుపాయాలు కూడా మహిళలందరికీ సమానంగా చేరడంలేదు. దీనిపై అందరికీ అవగాహన కలిగించాలనిపించింది. అలా 2015లో ‘ఆపరేషన్‌ పీరియడ్‌’ ప్రారంభించా. దాతల సాయంతో ప్రపంచవ్యాప్తంగా మూడులక్షల నెలసరి ఉత్పత్తులని అందించా. ఇదింకా విస్తృతం చేయాలన్నది నా కల. నాన్న పార్కిన్‌సన్‌ వ్యాధికి గురై, స్పర్శ కూడా కోల్పోయారు. పరిష్కారం కోసం వెతికితే ఆర్ట్‌ థెరపీ గురించి తెలిసింది. చిత్రలేఖనంతో దీని తీవ్రతను తగ్గించొచ్చని తెలిసింది. నాన్న ఈ కళతో కోలుకున్నారు. ఆ స్ఫూర్తితో 2020లో ‘పెయింటింగ్‌ విత్‌ పార్కిన్‌సన్స్‌’ ఎన్జీవో స్థాపించా. ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఏడాదిపాటు 12 కాన్వాస్‌లున్న పెయింటింగ్‌ కిట్‌ ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఆన్‌లైన్‌లో మా వాలంటీర్లు సలహాలు, సూచనలిచ్చి పెయింటింగ్స్‌ వేయడంలో శిక్షణనిస్తారు. దీంతో ఏకాగ్రత పెరిగి క్రమేపీ నరాల పనితీరు మెరుగుపడుతుంది’ అనే మంజు.. సిటిజన్‌ స్కల్‌ ప్రొడక్షన్స్‌ సిరీస్‌లో నాలుగేళ్లుగా నటిస్తోంది. ‘యు కెన్‌ బీ ఆల్‌ ది థింగ్స్‌.. యు వాంట్‌ టు బీ’ అనే పుస్తకం రాసింది. విద్యార్థులకు స్టెమ్‌, అంతరిక్ష పరిశోధనలపై వర్క్‌షాపుల ద్వారా అవగాహన కలిగిస్తోంది. సమయపాలన, క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించొచ్చు అంటోంది మంజు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్