చర్మసమస్యలకు పరిష్కారం.. రూ.60 కోట్ల వ్యాపారం!

చదువు తర్వాత ఉద్యోగం.. ఎవరైనా స్థిరపడటానికి చేస్తారు. మాలినీ ఆదపురెడ్డి మాత్రం.. వివిధ విభాగాలపై పట్టు తెచ్చుకోవడానికి చేశారు. మొదట్నుంచీ ఆమె లక్ష్యం వ్యాపారవేత్త అవడమే మరి! దీనికోసం ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొన్న తను..

Updated : 25 Jul 2023 05:47 IST

చదువు తర్వాత ఉద్యోగం.. ఎవరైనా స్థిరపడటానికి చేస్తారు. మాలినీ ఆదపురెడ్డి మాత్రం.. వివిధ విభాగాలపై పట్టు తెచ్చుకోవడానికి చేశారు. మొదట్నుంచీ ఆమె లక్ష్యం వ్యాపారవేత్త అవడమే మరి! దీనికోసం ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొన్న తను.. రెండున్నరేళ్లలో దాదాపు రూ.60కోట్ల వ్యాపారంగా ఎలా మలచగలిగారు? వసుంధరతో ఆ ప్రయాణాన్ని పంచుకున్నారిలా..

దేశవిదేశాల్లో పని చేసిన అనుభవం. మంచి హోదాతో కూడిన ఉద్యోగం. మానేసి వ్యాపారం ప్రయత్నిస్తానంటే ఎవరైనా వద్దంటారు. మా ఇంట్లో మాత్రం ‘నీ ఇష్ట’మని ప్రోత్సహించారు. అమ్మానాన్న శ్రీదేవి, సూర్యనారాయణ.. ఇద్దరూ వైద్యులే. మాది వైజాగ్‌. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌ చేసి ఫ్లిప్‌కార్ట్‌, పీఎన్‌జీ.. లాంటి పలు సంస్థల్లో భారత్‌, దక్షిణాసియా రీజియన్‌లకు పనిచేశా. ఫ్రాన్స్‌లో ఎంబీఏ చేసి తిరిగొచ్చాక వ్యాపారాలోచనలో పడ్డా. బాగా పరిశోధించాక.. బ్యూటీ రంగాన్ని ఎంచుకున్నా. అయితే ఈ సమస్యకివి పనిచేస్తాయని మాటల్లో చెప్పడం కాదు.. రుజువునివ్వాలనుకున్నా. ఫ్రాన్స్‌లో ఇలా శాస్త్రీయంగా రుజువైన వాటినే ఉపయోగిస్తారు. ఫంక్షనల్‌ బ్రాండ్స్‌గా పిలిచే ఈ తరహావి మన దగ్గర కనిపించలేదు. అందుకే వాటిపైనే దృష్టిపెట్టా. ఇందుకోసం చాలామందితో మాట్లాడాక.. 2020లో ‘డీకన్‌స్ట్రక్ట్‌’ ప్రారంభించా.

వాళ్లే తొలి కస్టమర్లు

స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక చిన్న సమస్యలకు నిపుణుల వద్దకు వెళ్లేవారు తగ్గారు. వినియోగదారులే రిసెర్చ్‌ చేసుకొని తమకేది నప్పుతుందో ఎంచుకుంటున్నారు. ‘ఆ అవకాశమేదో మేమే ఇస్తే’నన్న ఆలోచన వచ్చింది. ఇన్‌స్టాలో వీడియోలు, వ్లాగ్స్‌ ద్వారా చర్మ సమస్యలు.. ఎవరికేవి నప్పుతాయి వంటి సమాచారం ఇవ్వడం మొదలుపెట్టాం. వీటిని చాలామంది అనుసరించారు. తర్వాత మా ప్రొడక్ట్స్‌ను పరిచయం చేశాం. ఆ ఫాలోయర్లే తొలి కస్టమర్లయ్యారు. తర్వాత వెబ్‌సైట్‌ని ప్రారంభించాం. అక్కడా బ్లాగుతోపాటు పరిశోధించుకునే వీలు కల్పించాం. సమస్య చెబితే పరిష్కారాలనూ సూచిస్తుంటాం. ‘డీకన్‌స్ట్రక్ట్‌’ పేరు ఉద్దేశం కూడా అదే.. ‘వినియోగదారుడి ముందు సమాచారం ఉంచడ’మనే. 2021లో క్రీములు, సీరమ్‌, షాంపూ వగైరా మార్కెట్‌లోకి విడుదల చేస్తే నెలలోనే రూ.10లక్షల వ్యాపారం జరిగింది. ప్రస్తుతం వెబ్‌సైట్‌తోపాటు ఇతర ఈకామర్స్‌ వేదికల్లోనూ అమ్ముతున్నాం. ఆఫ్‌లైన్‌ స్టోర్లనీ తెరుస్తున్నాం. బెంగళూరులో డిపార్ట్‌మెంట్‌ స్టోర్లు, మాల్స్‌లో ప్రారంభించాం.

అమ్మ చలవే

ఇప్పుడు మా వ్యాపారం దాదాపు రూ.60కోట్లు. దేశీయంగానే కాదు.. దుబాయ్‌కీ ఉత్పత్తులు వెళుతున్నాయి. కానీ ఆలోచనకీ ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావడానికీ ఏడాదిపైగానే పట్టింది. పెట్టుబడి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ‘అమ్మాయివి.. చేయగలవా? అబ్బాయి కోఫౌండర్‌ లేరా?’లాంటి ప్రశ్నలొచ్చేవి. ఉద్యోగులను ఎంచుకోవాలన్నా సమస్యే. అసలు నిలదొక్కుకోగలదా? మహిళా బాసా అన్న అనుమానాలెన్నో దాటుకుంటూ వచ్చా. వ్యాపార ప్రయాణం అంత సులువు కాదు, తిరస్కరణలుంటాయని నాకు ముందే తెలుసు. నా ఆలోచన నచ్చాల్సింది ఒక్కరికి.. మిగతావన్నీ ప్రయత్నాలు అనుకుంటూ ముందుకుసాగా. చివరికి రూ.3.5 కోట్ల వెంచర్‌ క్యాపిటల్‌ అందింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మా ఇంటి గ్యారేజీలో ప్రారంభమైన సంస్థ. ఇప్పుడు 5 ఫ్యాక్టరీల నుంచి మాన్యుఫాక్చరింగ్‌ చేయించుకుంటున్నాం. 3 వేర్‌హౌజ్‌లు, 50 మంది ఉద్యోగులున్నారు. గతఏడాది కలరి క్యాపిటల్‌ నుంచి రూ.20 కోట్ల పెట్టుబడీ వచ్చింది. విదేశాలకీ విస్తరించే ఆలోచనలో ఉన్నా. తిరస్కరణ ఎవరినైనా బాధిస్తుంది. నాకు ఏకంగా 50 వచ్చాయి. అయినా తట్టుకున్నానంటే అమ్మే కారణం. నన్ను వ్యాపారవేత్తగా చూడాలన్నది తన కల. చిన్నప్పట్నుంచీ మేగజీన్లలో వచ్చే మహిళా ఆంత్రప్రెన్యూర్ల స్ఫూర్తికథనాలను చదివించేది. ‘నచ్చిన కోర్సు చదువు.. ఉద్యోగమూ చెయ్యి. అయితే అక్కడే ఆగిపోవద్దు. సొంతంగా నిలబడి, మరికొందరికి ఉపాధి ఇవ్వా’లనేది. మావారు ప్రతీక్‌ జైన్‌ తోడ్పాటూ ఎక్కువే. ఇంకేం ధైర్యంగా ముందుకుసాగా. ఎవరైనా అంతే.. నేను చేయగలను. నా మీద నాకు నమ్మకం ఉంది అనుకుంటూ ధైర్యంగా సాగండి. అప్పుడే నిలదొక్కుకోగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్