నామీద నేనే జాలిపడ్డా..
అంతవరకూ హాయిగా ఉన్న జీవితం తల్లకిందులైతే? చేస్తున్న ఉద్యోగం ఉన్నట్టుండి కోల్పోతే? ఇలాంటప్పుడు చిరుద్యోగులకే కష్టం అనుకుంటాం కానీ ఉన్నతోద్యోగులకీ ఇబ్బందే. అలాంటి పరిస్థితినే ధైర్యంగా ఎదుర్కొని బోయింగ్ సేల్స్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు కీర్తి గుప్తా.
అంతవరకూ హాయిగా ఉన్న జీవితం తల్లకిందులైతే? చేస్తున్న ఉద్యోగం ఉన్నట్టుండి కోల్పోతే? ఇలాంటప్పుడు చిరుద్యోగులకే కష్టం అనుకుంటాం కానీ ఉన్నతోద్యోగులకీ ఇబ్బందే. అలాంటి పరిస్థితినే ధైర్యంగా ఎదుర్కొని బోయింగ్ సేల్స్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు కీర్తి గుప్తా. ఈ క్రమంలో తాను సమస్యల్ని ఎలా ఎదుర్కొన్నారో చెబుతూ ఉద్యోగుల్లో స్ఫూర్తినింపారామె...
కొవిడ్, ఆర్థిక మాంద్యం వంటి కారణాలతో గత మూడేళ్లుగా పెద్దపెద్ద బహుళ జాతి కంపెనీలు సైతం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇందులో ప్రతిభావంతులైన మహిళా ఉద్యోగుల సంఖ్య కాస్త ఎక్కువేనంటున్నాయి అధ్యయనాలు. అలాంటి అనుభవమే కీర్తిగుప్తాకి ఎదురైంది. గత మార్చిలో ఆమె పనిచేస్తున్న జీఈ(జనరల్ ఎలక్ట్రిక్) సంస్థ తనని తొలగిస్తున్నట్టు చెప్పినప్పుడు మొదట నిజమా కాదా అనుకున్నారామె. తిరిగి బోయింగ్ ఆసియా వ్యవహారాలకు సేల్స్ డైరెక్టర్‌గా ఎంపికయ్యే వరకూ ఎన్నో ఉద్వేగాలను అణచుకున్నారు. అయితే, ఇదంత సులువుగా సాధ్యం కాలేదంటారు కీర్తి.
ఎంతో బాధపడ్డా!
‘విషయం తెలిసి మొదట షాక్ అయ్యా. మనసు విరిగిపోయింది. బాధపడ్డాను అనే కంటే నా మీద నేనే జాలిపడ్డా’ అంటే కరెక్టేమో! ‘కార్పొరేట్ ప్రొఫెషనల్’గా నా కెరియర్ ముగిసిపోయిందా? నేను ముందుగానే రిటైర్ అవుతున్నానా అనుకున్నా. ఈ భావోద్వేగాల నుంచి బయటపడటానికి రెండు నెలలు పట్టింది. కానీ, ఇందులో నా తప్పేం లేదుగా... అయినా ఎందుకు బాధపడుతున్నానో అర్థమయ్యేది కాదు. తిరిగి ఉద్యోగం కోసం వెతుకులాట మొదలుపెట్టా. లింక్డిన్‌లో పోస్ట్ పెట్టాలనుకున్నప్పుడు.. నా ఉద్యోగ తొలగింపు గురించి చెప్పాలనిపించింది. కానీ ధైర్యం సరిపోలేదు. చదివినవారంతా నవ్వుతారేమో, నన్ను ట్రోల్ చేస్తారేమో అని భయం ఉండేది. అయినా సరే, శక్తినంతా కూడదీసుకుని రాసి నాలోని భావాలు అప్‌లోడ్ చేశా. అది వైరలైంది. ఏకంగా 15 లక్షల మందికిపైగా చూశారు. 100కు పైగా అవకాశాలు నా తలుపు తట్టాయి. కానీ.. చాలా సంస్థలు అప్పటి నా పరిస్థితిని అవకాశంగా తీసుకుని, నేను చివర డ్రా చేసిన జీతంలో మూడోవంతు మాత్రమే ఇచ్చి ప్రయోజనం పొందాలనుకున్నాయి. నాకూ వేరే దారిలేదు. రాజీపడి వచ్చిన అవకాశాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలనిపించినా... మనసొప్పలేదు. ‘సవాళ్లు ఎదురైనప్పుడు కుంగిపోతే ఓటమిని ఒప్పుకొన్నట్లే కదా. నేను అందుకు సిద్ధంగా లేను. దాదాపు ఏడాదిన్నర ప్రయత్నించా. చివరికి ప్రతిష్ఠాత్మక బోయింగ్ సంస్థలో సేల్స్ డైరెక్టర్‌గా చేరా. ఇది నాకు సంతోషాన్నిచ్చింది’ అంటూ తన భావాలను పంచుకున్నారామె. అంతేకాదు, నాలాంటి పరిస్థితుల్లో కొలువుల్ని కోల్పోయిన నిరుద్యోగులు చాలామందే ఉండి ఉంటారు. వారికి నా అనుభవాల్ని పాఠాలుగా చెప్పాలనుకుంటున్నా అని కొన్ని సూత్రాల్నీ చెప్పారామె.
లఖ్‌నవూకి చెందిన కీర్తి బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీలో ఎంబీఏ చేశారు. సీఎంసీ, విప్రో, ఎయిర్‌టెల్ డిజిటల్, హెచ్‌సీఎల్, జీఈల్లో పీపుల్స్ మేనేజ్‌మెంట్, బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
కీర్తి చెప్పిన పాఠాలు...
- నిరుద్యోగం.. మీ ఆత్మవిశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అయినాసరే ప్రయత్నిస్తూనే ఉండండి...అదే మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది. అన్నింటికంటే ముందు మీ సామర్థ్యాలపై మీరు నమ్మకం ఉంచండి.
- మీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోండి. కాలేజీ అలుమ్ని గ్రూప్, పాత సహోద్యోగులు, స్నేహితులతో మాట్లాడండి. ఉద్యోగాలూ, అవకాశాల గురించి చర్చించండి. నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లకు హాజరవ్వండి. పరిశ్రమ నిపుణులతో కనెక్ట్ అవ్వండి. కొత్త ఉద్యోగాన్ని కనుగొనడంలో ఇవి కచ్చితంగా సాయం చేస్తాయి.
- కొత్త నైపుణ్యాల అవసరాన్ని గుర్తించండి. వాటిని నేర్చుకోండి. ఇందుకోసం ఆన్‌లైన్ కోర్సులు, వర్క్‌షాప్‌లకు హాజరు కావచ్చు. ఒత్తిడిని అదుపు చేసుకునేందుకు కొత్త అభిరుచుల్ని వెతుక్కుని మిమ్మల్ని మీరు తీరిక లేకుండా ఉంచుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.