స్పా ఉత్పత్తులతో వ్యాపారం!

అనుకోకుండా వ్యాపారవేత్త.. ఇది ‘కుసుమ స్పందన’కు సరిగ్గా సరిపోతుంది. సరదాగా క్యాండిల్స్‌ తయారీ మొదలుపెట్టి.. 18ఏళ్లకే వ్యాపారవేత్త అయ్యింది. స్పా రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ దక్షిణ భారతదేశమంతా పంపిణీ చేస్తోంది.

Updated : 26 Aug 2023 05:12 IST

అనుకోకుండా వ్యాపారవేత్త.. ఇది ‘కుసుమ స్పందన’కు సరిగ్గా సరిపోతుంది. సరదాగా క్యాండిల్స్‌ తయారీ మొదలుపెట్టి.. 18ఏళ్లకే వ్యాపారవేత్త అయ్యింది. స్పా రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ దక్షిణ భారతదేశమంతా పంపిణీ చేస్తోంది. ఆ ప్రయాణం.. తన మాటల్లోనే..

నా కాళ్లమీద నేను నిలబడాలి, సొంతంగా వ్యాపారం చేయాలని చిన్నప్పుడే నిశ్చయించుకున్నా. అందుకు లాక్‌డౌన్‌ వేదికైంది. మాది విశాఖపట్నం. అమ్మానాన్న శైలజ, శ్రీనివాస రెడ్డి. సీఏ చదువుతున్నా. యూట్యూబ్‌ చూసి లిప్‌బామ్‌, సబ్బులు, వివిధ రూపాల్లో క్యాండిల్స్‌ వంటివి ప్రయత్నించేదాన్ని. కొవిడ్‌ సమయంలో సరదాగా సెంటెడ్‌ క్యాండిల్స్‌ తయారీ ప్రారంభించా. వాటి ఫొటోలను 2021లో ‘ద ఆర్గానిక్‌ బ్లాసమ్స్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే ఆర్డర్లు మొదలయ్యాయి. నేను దాచుకున్న రూ.2వేలే పెట్టుబడి. ఓరోజు ‘మా స్పా కోసం మసాజ్‌ క్యాండిల్స్‌ చేస్తారా’ని మెసేజ్‌ వచ్చింది. నాకు వాటిపై అవగాహనే లేదు. కొంత సమయం అడిగి పరిశోధన మొదలుపెట్టా. క్యాండిల్స్‌ని వ్యాక్స్‌తో చేస్తాం కదా! మసాజ్‌ క్యాండిల్స్‌ని థెరపిస్టులు ఒంటికి మర్దనా కోసం వాడతారు. కానీ దానిలోనూ వ్యాక్స్‌, మినరల్‌ ఆయిల్స్‌, ప్రిజర్వేటివ్స్‌ వాడటం గమనించా. వాటితో శరీరానికి హాని అని సహజ పదార్థాలైన షియా, మ్యాంగో బటర్‌ వంటివి వాడి ఓ మూడురకాలు తయారు చేశా. దీనికోసం డెర్మటాలజిస్ట్‌, కాస్మెటాలజిస్ట్‌ల సాయం తీసుకున్నా. ఉత్పత్తి పూర్తయ్యాక ల్యాబ్‌లో టెస్టింగ్‌ చేశాక స్పావాళ్లకు అందించా. అవి వాళ్లకు బాగా నచ్చి ఒకేసారి 250 చేసిమ్మన్నారు.

మొదటి ఆర్డర్‌ సరే! మరి ఆతర్వాత? నేనే వైజాగ్‌లో పేరున్న స్పాల వివరాలన్నీ సేకరించి, ఫోన్‌ చేయడం మొదలుపెట్టా. మా ఉత్పత్తుల గురించి చెబితే ‘స్పా ఉత్పత్తులు అమ్మాయి చేస్తుందా? చిన్నపిల్లవి నువ్వేం చేయగలవు’ అనేవారు. చాలా ప్రయత్నాల తర్వాత రెండు నెలలకు ఇద్దరు అవకాశమిచ్చారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు వైజాగ్‌ అంతటానే కాదు.. దక్షిణ భారతదేశంలోని 252 స్పాలకు మా ఉత్పత్తులు వెళుతున్నాయి. హోటళ్లు అదనం. గతఏడాది దాదాపు రూ.30 లక్షల వ్యాపారం చేశా. సెంటెడ్‌, మసాజ్‌ క్యాండిల్స్‌ మాత్రమే కాదు.. ఫేస్‌వాష్‌, బాడీ జెల్‌, స్క్రబ్‌లు, సబ్బులు, డిస్పోజబుల్‌ బెడ్‌షీట్లు వంటివీ చేస్తున్నా. ప్రొడక్షన్‌ యూనిట్‌నీ ఏర్పాటు చేసుకున్నా. అమ్మాయిలు ఏదైనా చేయాలనుకుంటే ముందు ‘చేయగలరా.. ఎందుకీ శ్రమ’ అన్న సందేహాలు, సలహాలే వచ్చేస్తాయి. నేనూ ఇంట్లో ముందు చెప్పినప్పుడు ‘చదువు నిర్లక్ష్యం చేస్తావా? ఇవన్నీ ఎందుకు పెళ్లి సంబంధాలప్పుడు సమస్య అవుతుంది’ అన్నారు. ఒక నెల సమయం ఇవ్వండి.. నన్ను నేను నిరూపించుకుంటానన్నా. ఒక్కనెలలోనే రూ.40వేల వ్యాపారం చేశా. ఇప్పుడు వాళ్లూ నాకు భాగస్వాములయ్యారు. మనమీద మనకు నమ్మకం ఉండి, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అవకాశాలు వస్తాయనడానికి నేనే ఉదాహరణ. ఆస్ట్రేలియాలో ఫైనాన్స్‌ అండ్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ చేయాలి. వ్యాపారాన్ని విస్తరించాలన్నది కల.

- కేతిరెడ్డి రాజ్యలక్ష్మి, విశాఖపట్నం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని