ప్రపంచాన్ని చుట్టేద్దామా...!

కాలేజ్‌, పరీక్షలు... ఇల్లు, ఉద్యోగం... వంట, పిల్లలు, ఇంటి శుభ్రత... మనలో చాలామంది దినచర్యే ఇది! ఇలా ప్రతిరోజూ ఒకేలా సాగుతోంటే జీవితం నిస్సారంగా తోయదూ? ఒత్తిడీ పెరుగుతుందని అధ్యయనాలూ చెబుతున్నాయి. అందుకే వాటికి కాస్త ‘బ్రేక్‌’ వేయండి.

Updated : 16 Mar 2024 14:24 IST

కాలేజ్‌, పరీక్షలు... ఇల్లు, ఉద్యోగం... వంట, పిల్లలు, ఇంటి శుభ్రత... మనలో చాలామంది దినచర్యే ఇది! ఇలా ప్రతిరోజూ ఒకేలా సాగుతోంటే జీవితం నిస్సారంగా తోయదూ? ఒత్తిడీ పెరుగుతుందని అధ్యయనాలూ చెబుతున్నాయి. అందుకే వాటికి కాస్త ‘బ్రేక్‌’ వేయండి. ఆ విరామాన్ని విహారంగా మార్చుకుంటే శరీరం, మనసు తేలికపడతాయి. అందుకు సాయపడే మహిళా ప్రత్యేక పర్యటనలెన్నో...!

అలా సరదాగా వెళదామని ఉన్నా... ఏవో బాధ్యతలు అడ్డుపడుతూనే ఉంటాయి. తీరా అవి పూర్తయ్యేసరికి ముప్పావు వంతు జీవితం గడిచిపోతుంది. అందుకే విద్యార్థినిగానే ఆస్వాదిద్దామంటే ‘చదువుకునే వయసులో తిరుగుడెందుకు’, ‘నీతోపాటు రావడానికి ఎవరూ తీరికగా లేరు’, ‘ఒంటరిగానా... వద్దు’... అన్నమాటలు ఎదురవుతాయి! ‘తోడులేనిదే పర్యటనలకు వెళ్లలేమా? స్వేచ్ఛగా తిరిగి రాలేమా’... అని ఆలోచిస్తుంటారు కూడా. కొత్తవారితో కలిసి వెళ్లాలనీ మరికొందరికి ఉంటుంది. ఇలాంటి వారికోసం కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వాటిల్లో ‘ఎఫ్‌5ఎస్కేప్స్‌’ ట్రావెల్‌ గ్రూపు ఒకటి. ‘నలుగురితో కలిస్తేనే సందడి. అలా చేసే ప్రయాణాలు మనలో ధైర్యాన్నీ పెంచుతా’యంటారు నిర్వాహకురాలు మాలినీ గౌరీశంకర్‌. స్వదేశీ, విదేశీ టూర్‌ ప్యాకేజీలను అందిస్తోందీ సంస్థ. వివరాలకు f5escapes.com చూస్తే సరి.

మన కోసం మనం...

మహిళల కోసం మహిళలే నిర్వహిస్తున్న ట్రావెల్‌ సంస్థలున్నాయి. ‘అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్కూబా డైవింగ్‌, ట్రెక్కింగ్‌లను కొందరు మెచ్చితే, మరికొందరు బీచ్‌ అందాలను ఆస్వాదిస్తారు. ఇంకొందరు స్థానిక పరిశ్రమలపై ఆసక్తి చూపుతారు. పర్యటకుల అభిరుచికి తగ్గ ఏర్పాట్లు చేయడానికీ, సౌకర్యాలను అందించడానికీ మా స్థానిక సిబ్బంది సిద్ధంగా ఉంటా’రంటారు ‘వావ్‌ (విమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌)’ క్లబ్‌ నిర్వాహకురాలు సుమిత్రా సేనాపతి. ఈ ఆల్‌ విమెన్‌ ట్రావెల్‌ క్లబ్‌ ప్రపంచవ్యాప్తంగా 50కిపైగా ప్రాంతాలకు ఏటా వందల మంది పర్యటకులను తీసుకెళ్తోంది. సోలో ట్రావెలర్లకీ ఏర్పాట్లు చేస్తోంది. వివరాలకు wowclub.inలో సంప్రదించొచ్చు. ఆ కోవకు చెందిందే... ‘గర్ల్స్‌ఆన్‌దగోక్లబ్‌’ కూడా. పియా బోస్‌ నిర్వహిస్తున్న ఈ క్లబ్‌ సమాచారాన్ని girlsonthegoclub.comలో చూడొచ్చు.

సంప్రదాయాలు తెలియాలంటే...

స్థానికులను కలిస్తేనే అక్కడి సంప్రదాయాలు తెలిసేది... చాలామంది ఆలోచనే ఇది. అలాంటివారి కోసం ‘హోమ్‌ స్టే’ అవకాశాలు కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు. లద్ధాఖ్‌, సిక్కిం, కశ్మీర్‌, తమిళనాడు... ఇలా దేశవ్యాప్తంగా పర్యటించే మహిళా బృందాలకు, సోలో ట్రావెలర్లకు ఈ సేవలు అందిస్తున్నాయి. సుందర ప్రాంతాలను చుడుతూ, స్థానికులతో కలిసుంటూ సంప్రదాయ రుచులు ఆస్వాదించొచ్చు. ఇంకా వారి పండుగల్లోనూ భాగమవొచ్చన్నమాట. కమ్యూనిటీ టూరిజం పేరుతో ‘గ్రీనర్‌ పాస్‌చజ్‌’ వంటి సంస్థలు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించే వీలు కల్పిస్తున్నాయి. దేశీయంగానే కాదు, విదేశాల్లోనూ పండగలు, వేడుకలను చూడటానికి ప్రత్యేక ప్యాకేజీలిస్తున్నాయి. ‘క్రిస్మస్‌కు యూరప్‌ పర్యటన, కశ్మీర్‌లో పూల సొగసు, హిమాచల్‌ప్రదేశ్‌లో స్కేటింగ్‌... ఇలా వాళ్ల మనసెరిగి ప్లాన్‌ చేస్తుంటాం. మహిళలంతా కలిసి ప్రయాణించేటప్పుడు తమ జీవితానుభవాలను ఒకరికొకరు పంచుకుంటుంటా’రని చెబుతారు ‘ఎఫ్‌5ఎస్కేప్స్‌’ నిర్వాహకులు.

కమ్యూనిటీ గ్రూపులుగా...

సామాజిక మాధ్యమాల్లోనూ ట్రావెల్‌ కమ్యూనిటీ గ్రూపులున్నాయి. వీరికి టూర్స్‌ క్యాలెండర్‌ ఉంటుంది. వీలునుబట్టి, నచ్చిన ప్రాంతాలను చుట్టేసి రావొచ్చు. 80వేల మందికి పైగా సభ్యులున్న ‘ట్రావెల్‌బీఎఫ్‌ఎఫ్‌’ కమ్యూనిటీ ఆ తరహాదే. సభ్యులంతా కలిసి ఏటా దేశవిదేశాల్లో పర్యటిస్తుంటారు. సమాచారానికి TravelBff.Travelను సందర్శిస్తే సరి. అవకాశాలు బోలెడు. అందుకొని... ప్రపంచాన్ని చుట్టేద్దాం రండి.

రాయితీలున్నాయ్‌...  ‘టూర్‌ అంటే మాటలా... చాలా డబ్బులు కావాలి’... ఈ కారణంగా వెనకడుగు వేసేవారే ఎక్కువ. కానీ మనసేమో నచ్చిన ప్రదేశాలకేసి లాగుతుంది. అందుకే ‘మహిళల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలున్నాయి. వారికి నచ్చిన ప్రాంతాన్ని తక్కువ ఖర్చులో చూసేలా రాయితీలనూ ఇస్తున్నామ’ంటోంది హైదరాబాద్‌ లేడీస్‌ ట్రావెల్‌ క్లబ్‌. ‘విమెన్‌ ఆన్‌ క్లౌడ్స్‌ క్లబ్‌’ కూడా ఈ సేవలందిస్తోంది. ఆసక్తి ఉంటే hyderabadladiestravelclub.com, womenonclouds.com చూడండి.


ఆహ్వానం

హలో అమ్మాయిలూ... విహారయాత్రలంటే మీకూ ప్రాణమా? సమయం చూసుకుని మరీ అరుదైన ప్రదేశాలకు చెక్కేస్తుంటారా... మరి వాటిని పంచుకుంటేనే కదా అసలు సరదా. ఆ అనుభవాలను vasundhara@eenadu.in కి మెయిల్‌ చేయండి. మన పాఠకులందరితోనూ పంచుకుందాం.


తొలి మహిళ...

దేశ ఆర్థిక ప్రగతిలో బడ్జెట్‌ పాత్ర చాలా కీలకం. దానికి మహిళలు నాయకత్వం వహించడం ఇంకా గర్వకారణం. నిర్మలా సీతారామన్‌... తాజా మధ్యంతర బడ్జెట్‌తో పార్లమెంటులో ఆరుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి మహిళా మంత్రిగా రికార్డు సాధించారు. అప్పట్లో ఇందిరాగాంధీ మొదటి మహిళగా చరిత్రకెక్కినా ఆమె ఆర్థిక మంత్రిగా తాత్కాలికంగానే పనిచేశారు. పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్‌్ ప్రవేశపెట్టిన తొలి మహిళ ఘనత నిర్మలమ్మకే దక్కింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్