భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!

ఏడాదికి ఒకటో, రెండో టూర్లు... తారలంతా చేసే పనే! కానీ హన్సిక మోత్వానీ మాత్రం ప్రత్యేకం. ఒక విహారం ముగించి వచ్చిన మరుక్షణం ‘ఈసారి దేనికి వెళ్లాలబ్బా’ అని ఆలోచిస్తుందట. అందుకే నటిగా, మంచి మనసున్న వ్యక్తిగానే కాదు... ‘ట్రావెల్‌ బీ’గానూ గుర్తింపు తెచ్చుకుంది.

Published : 17 Mar 2024 02:02 IST

ఏడాదికి ఒకటో, రెండో టూర్లు... తారలంతా చేసే పనే! కానీ హన్సిక మోత్వానీ మాత్రం ప్రత్యేకం. ఒక విహారం ముగించి వచ్చిన మరుక్షణం ‘ఈసారి దేనికి వెళ్లాలబ్బా’ అని ఆలోచిస్తుందట. అందుకే నటిగా, మంచి మనసున్న వ్యక్తిగానే కాదు... ‘ట్రావెల్‌ బీ’గానూ గుర్తింపు తెచ్చుకుంది. తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఆ విహారాల విశేషాలే ఎక్కువగా ఉంటాయి. తనకి టూర్లంటే ఎందుకింత ఇష్టం అంటే...

అస్తమానం కెరియర్‌ అంటూ పరుగెడితే బోర్‌ కొట్టదూ? అందుకే అప్పుడప్పుడూ ప్రపంచ అందాలను చుట్టిరావాలి అంటుంది హన్సిక మోత్వానీ. ఇలా విహారయాత్రలకు వెళ్లడం ఎప్పుడు ప్రారంభించిందో తెలుసా? తన పదిహేనో ఏట! ‘అప్పటివరకూ కుటుంబంతో చాలా ప్రాంతాలే తిరిగా. తొలిసారి పెద్దవాళ్ల తోడు లేకుండా స్నేహితులతో కలిసి న్యూయార్క్‌ వెళ్లా. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. అప్పట్నుంచీ ఏడాదికోసారైనా న్యూయార్క్‌ వెళ్లడం, కనీసం 20 రోజులు ఉండటం పరిపాటిగా మారింది’ అంటూ చెప్పుకొచ్చింది హన్సిక.

రెండు కారణాలు...

సెట్‌లో బిజీబిజీగా గడపడానికి ఇష్టపడే హన్సిక... బ్రేక్‌ మాత్రం తప్పనిసరి అంటుంది. ‘అలాగని లాంగ్‌ ట్రిప్‌లే వెళ్లాలనుకోను. కానీ ప్రతి ప్రాజెక్టు పూర్తయ్యాక చిన్న చిన్న విరామాలు తప్పక తీసుకుంటా. ఇది ఒత్తిడిని దూరం చేయడమే కాదు... సరికొత్త ఉత్సాహాన్నీ ఇస్తుందని నమ్ముతా. పని, వ్యక్తిగత జీవితంలో సమన్వయం సాధించడానికి నేను ఎంచుకున్న మార్గమిది. స్నేహితులు, దత్తత తీసుకున్న పిల్లలు... ఇలా నచ్చిన వారితో గడిపేస్తా. కుటుంబంతో ఏటా ఎక్కడికైనా వెళ్లాలన్నది చిన్నప్పట్నుంచీ ఇంట్లో ఉన్న నియమం. దాన్నీ కొనసాగిస్తున్నా. అయితే రెండు లాంగ్‌ ట్రిప్‌లూ వేస్తుంటా. ఇక ఇంకో కారణం... తెలియని ప్రదేశం, కొత్త వ్యక్తులతో సంభాషణ... మనల్ని ఇండిపెండెంట్‌గా మార్చడమే కాదు, ఆత్మవిశ్వాసాన్నీ నింపుతాయి. అందుకే చాలావరకూ ఒంటరిగానూ ప్రయాణిస్తా’ అంటోంది హన్సిక.

బాగా పరిశోధించి...

ఒకసారి బీచ్‌లు, మరోసారి ట్రెక్కింగ్‌, ఇంకోసారి పురాతన ప్రదేశాలు, గుళ్లు... ఇలా తన జాబితాలో ప్రతిదానికీ చోటుంటుంది. అంతేకాదు స్కీయింగ్‌, జంపింగ్‌ వంటివీ ప్రయత్నిస్తుంది. ‘బాగా నచ్చితే అదే ప్రదేశానికి మళ్లీ మళ్లీ వెళ్లిపోతా. జైపుర్‌, న్యూయార్క్‌, పారిస్‌లు ఆ జాబితాలో ఉన్నాయి. ట్రిప్‌ పూర్తి చేసుకొని బ్యాగు కింద పెట్టకముందే ఈసారి ఎక్కడికెళ్లాలని ఆలోచిస్తుంటా. అక్కడ చూడదగ్గ ప్రదేశాల గురించి పరిశోధిస్తా. అంతేకాదు, స్థానిక భాషలో కొన్ని పదాలనూ నేర్చుకుంటా’ననే హన్సిక తన పేరిట యూట్యూబ్‌నీ ప్రారంభించింది. తన ప్రయాణాలు, సందర్శించిన ప్రదేశాల వివరాలను దానిలో పంచుకుంటుంది. తనని యూట్యూబ్‌లో దాదాపు 4 లక్షలమంది అనుసరిస్తున్నారు. తన ట్రావెల్‌ ఫ్యాషన్‌కీ అభిమానులు ఎక్కువే. ‘ఏ దుస్తులు తీసుకెళ్లాలన్నదీ ముందే ప్లాన్‌ చేసుకుంటా. పైగా నాకు ఓసీడీ ఉంది. అందుకే అవసరమయ్యేవన్నీ నేనే సర్దుకుంటా. తక్కువ లగేజీతో వెళ్లడానికి ప్రయత్నిస్తుంటా’ అనే హన్సిక ‘విహారాలు మనసుని శాంత పరచుకునే మార్గం. ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశం. అందుకే ఈ జీవితకాలంలో భూగోళాన్నంతా చుట్టేయాలని లక్ష్యం’గా పెట్టుకుంది. మరి మీ సంగతేంటి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్