తోట పనితో.. ఆనందమానందమే!

రోజంతా ఇంటిపనులతో సతమతమయ్యే మహిళలు మొక్కల పెంపకాన్ని అదనపు శ్రమ అనుకోవడంలేదు. అది ఆరోగ్యానికీ, ఆనందానికీ కూడా కారణమవుతోందని చెబుతున్నారు. తమ ఇళ్లల్లో ఉన్న స్థలాన్ని బట్టి వీలైనన్ని చెట్లు పెంచేస్తున్నారు. వాళ్లు అమలుచేస్తున్న సూత్రాలు చూడండి...

Updated : 06 Feb 2022 05:14 IST

రోజంతా ఇంటిపనులతో సతమతమయ్యే మహిళలు మొక్కల పెంపకాన్ని అదనపు శ్రమ అనుకోవడంలేదు. అది ఆరోగ్యానికీ, ఆనందానికీ కూడా కారణమవుతోందని చెబుతున్నారు. తమ ఇళ్లల్లో ఉన్న స్థలాన్ని బట్టి వీలైనన్ని చెట్లు పెంచేస్తున్నారు. వాళ్లు అమలుచేస్తున్న సూత్రాలు చూడండి... మీరూ ప్రేరేపితులవుతారు.

* మామిడి, నేరేడు లాంటి చెట్లు డాబా మీదికి పరుచుకుంటాయి. ఆ వంగిన కొమ్మలకు తోడు మల్లె, గులాబి లాంటి పూలమొక్కలు, వంగ, బెండ లాంటి కూరగాయలు, మెంతి, గోంగూర లాంటి ఆకుకూరలూ తోడయితే ఇక చెప్పాల్సిందేముంది? చక్కటి ఉద్యానవనంలా ఉండదూ! అందుకే చాలామంది మహిళలు మిద్దెతోటలు పెంచేస్తున్నారు. అక్కడ కొన్ని కుర్చీలు వేసుకుని కూర్చుంటే ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చునంటున్నారు.

* బట్టలుతికే టబ్బు వెలిసిపోయిందా? కూలర్‌ పాడైపోయిందా? బకెట్టుకి లేదా టంబ్లర్‌కి హ్యాండిల్‌ విరిగిపోయిందా? వంటింటి సామాను ఏ కారణంగానయినా నిరుపయోగంగా ఉందా? ఇలాంటివేటినీ వృథాగా పడేయక మొక్కల పెంపకానికి వియోగిస్తున్నారు. వస్తువులు కొన్నప్పుడు వచ్చిన అట్టపెట్టెలకు మందపాటి పాలిథిన్‌ కవర్లు తగిలించేసి వాటిల్లోనూ మొక్కలు పెంచేస్తున్నారు.

* గట్టు, మెట్లు, బాల్కనీ గోడలు ఎక్కడ వీలైతే అక్కడ మొక్కలు పెంచేయొచ్చు, పచ్చదనాన్ని మించిన శోభ ఇంకెక్కడుంటుంది అంటున్నారు. మొక్కల మధ్య ఫోల్డబుల్‌ టేబులు వేసుకుని భోజనం చేస్తే ప్రతిరోజూ వనభోజనం చేసిన అనుభూతే కదా!

కొన్ని ఇళ్లల్లో ముందుగదిలోకి ఎండ వచ్చేసి వేడిగా అనిపిస్తుంది. ఆ వేడిని నివారించడానికి కర్టెన్లు తగిలించేకంటే కిటికీ బయట కొన్ని చెట్లు పెంచి చూడండి.. అటు అందమూ ఇటు చల్లదనమూ మీ సొంతమైపోతాయి. వాటికి తోడు లోపలి వైపున కొన్ని ఇండోర్‌ ప్లాంట్స్‌ కుండీలు ఉంచారంటే మరింత శోభాయమానంగా ఉంటుంది. వరండాలో కొక్కేలు బిగించేసి కొన్ని కుండీలు వేళ్లాడదీసి చూడండి.. మీకే కాదు, ఇంటికొచ్చిన అతిథులూ ముచ్చటపడతారు.

* మొక్కల పెంపకం ఆరోగ్యకరమైన వ్యాయామం. ఇంటికి అవసరమైన కాయగూరలతో కొంత వ్యయం తగ్గుతుంది. తాజాకూరలు తింటున్నామన్న ఆనందాన్నిస్తుంది. అన్నిటినీ మించి మన పరిధిలో పర్యావరణాన్ని కాపాడుతున్న భావనా కలుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్