Updated : 12/04/2021 04:44 IST

ఎత్తు పెరగడానికి మందులున్నాయా...

నా వయసు 25. ఎత్తు నాలుగున్నర అడుగులు మాత్రమే. పొట్టిగా ఉంటానని హీల్స్‌ వేసుకోవడం అలవాటు చేసుకున్నాను. కానీ రెండేళ్లుగా మడమల నొప్పితో బాగా ఇబ్బందిగా ఉంది. నేను ఎత్తు పెరగడానికి ఏమైనా మందులు ఉంటే చెబుతారా? - ఓ సోదరి
అమ్మాయిల్లో పెరుగుదల సాధారణంగా పద్దెనిమిదేళ్లకే ఆగిపోతుంది. రజస్వల అయిన మూడు, నాలుగు ఏళ్ల వరకే ఎత్తు పెరుగుతారు. అరవై నుంచి ఎనభైశాతం వరకు ఎత్తు అనేది వంశపారంపర్యంగానే వస్తుంది. మిగతాది పోషకాహారం, వ్యాయామాల మీద ఆధారపడి ఉంటుంది. ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. బరువు మొత్తం పాదం మీద పడకుండా మడమలు, మోకాళ్ల మీద ఒత్తిడి పడుతుంది. దీంతో చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులూ, నడుము నొప్పీ వంటివి వచ్చే ప్రమాదం ఉంది.
ఏం చేయాలంటే: ఎక్కువ కాలంపాటు హీల్స్‌ వేసుకోకూడదు. కూర్చున్నప్పుడు చెప్పులు తీసేయాలి. ఎత్తు మడమల చెప్పులు వేసుకోక ముందు తర్వాత కూడా కొన్ని స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయాలి. దీంతో కొంత రిలాక్స్‌ అవ్వొచ్చు. రెండు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నవి వేసుకోకూడదు. పాయింట్‌ హీల్‌ అసలు వాడొద్దు. చెప్పు మొత్తం ఎత్తుగా ఉన్నవి ఎంచుకోండి.
మందులుండవు: మీ వయసు పద్నాలుగు నుంచి పదహారేళ్ల మధ్యలో ఉంటే.. పరీక్షలు చేసి అవసరమైతే గ్రోత్‌ హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇవ్వొచ్చు. పోషకాహార లోపం ఉంటే సరిచేయొచ్చు. వ్యాయామాలు చేసినా ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. మీ వయసు 25 ఏళ్లు కాబట్టి ఎత్తు పెరిగే అవకాశం లేదు. అయినా ఎత్తు గురించి అతిగా ఆలోచించకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. అది అన్నిటికంటే ముఖ్యమైంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని