Deepfake: రష్మిక.. కత్రిన.. తర్వాత మనమేనా?

లిఫ్ట్‌లో నుంచి బయటకు వస్తోన్న రష్మిక మందన్న.. అక్కడున్న ఫొటోగ్రాఫర్లకు ఫోజులిస్తోంది. పేరున్న హీరోయిన్‌ కదా! వీడియో నెట్టింట వైరలైంది. దాంతోపాటు కాస్త అసభ్యంగా ఉన్న ఆమె దుస్తులపై చర్చా మొదలైంది.

Updated : 08 Nov 2023 07:57 IST

లిఫ్ట్‌లో నుంచి బయటకు వస్తోన్న రష్మిక మందన్న.. అక్కడున్న ఫొటోగ్రాఫర్లకు ఫోజులిస్తోంది. పేరున్న హీరోయిన్‌ కదా! వీడియో నెట్టింట వైరలైంది. దాంతోపాటు కాస్త అసభ్యంగా ఉన్న ఆమె దుస్తులపై చర్చా మొదలైంది. ఉచిత సలహాలూ వెల్లువెత్తాయి. తీరా అది నేను కాదంటూ అందరూ షాకయ్యేలా చేసింది రష్మిక!

కొత్త సినిమా అప్‌డేట్‌కు సంబంధించి తన ఇన్‌స్టా ఖాతాలో ఫొటో షేర్‌ చేసింది కత్రిన. కొద్ది గంటల్లోనే ఆమె సినిమా అప్‌డేట్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఆ ఫొటో తెగ హల్‌ చల్‌ చేస్తోంది. ముఖం, ఫోజు అంతా ఒకటే.. వైరల్‌ అవుతోన్న ఆ ఫొటోలో దుస్తులే అసభ్యంగా మార్పు చేసి ఉన్నాయి.

‘నటిని.. కుటుంబం, స్నేహితులు నన్ను సపోర్ట్‌ చేశారు. అందుకు సంతోషంగా ఉన్నా.. ఇదే ఘటన కాలేజీ లేదా స్కూల్లో చదువుతున్నప్పుడు జరిగితే..’ అంటూ సందేహాన్ని వెలిబుచ్చింది రష్మిక. నిజమే..! సామాన్యులకు.. టెక్నాలజీపై అవగాహన లేనివాళ్లకు ఇది ‘డీప్‌ఫేక్‌ టెక్నాలజీ మాయ’ అని అర్థమయ్యేలా చెప్పడం సాధ్యమేనా? ఎందుకంటే ఈ సమస్య సెలబ్రిటీలది మాత్రమే కాదు.. సామాన్య ఆడపిల్లలది కూడా..

డీప్‌ఫేక్‌(Deepfake).. అసభ్యంగా ఉన్న ఎవరో ఫొటో, వీడియోకు తెలిసిన ముఖాన్ని అతికిస్తారు. అసలు వ్యక్తే అని నమ్మించేలా ఉంటుంది. బాగా తరచి చూస్తే.. టెక్నాలజీ సాయంతో అది ఫేక్‌ అని గుర్తుపట్టొచ్చు. కానీ తొలిసారి చూసినప్పుడు మాత్రం ఎవరైనా నిజమే అనుకోవడం ఖాయం. కానీ అంత తరచి చూసే ఓపిక, ఆలోచన ఎవరికి ఉంటాయి? గమనించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ టెక్నాలజీ కారణంగా ప్రాణాలు తీసుకుంటోన్న యువతుల కథలే ఇందుకు ఉదాహరణలు. దీని బారిన పడొద్దంటే..

  • ఫాలోయర్లు పెరుగుతారు, తేలిగ్గా డబ్బులు సంపాదించొచ్చు అని ఇన్‌ఫ్లుయెన్సర్లు అవ్వడానికి పోటీ పడుతున్న అమ్మాయిలే ఎక్కువ. పైకి కనిపించే పేరే కాదు.. దాని మాటున అపాయాలూ ఉంటాయి. లైకులొస్తాయని ఫొటోలు షేర్‌ చేసుకుంటూ వెళితే.. అవి ఎవరి చేతిలోనైనా పడొచ్చు. కాబట్టి, పోస్ట్‌ చేసే ముందే ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోండి.
  • తెలియని వాళ్ల రిక్వెస్టులను యాక్సెప్ట్‌ చేయొద్దు. సోషల్‌ మీడియా ఖాతాను ప్రైవేట్‌లో పెట్టుకోండి. మీ ఊరు, సమాచారం ఏవీ తెలియకుండా సెట్టింగుల్లో మార్పులు చేసుకోండి. అప్పుడు మీ ఫొటోలు, వ్యక్తిగత సమాచారం తెలియని వారికి చిక్కుతాయన్న భయం ఉండదు.
  • ఫొటోను అందంగా తీర్చడానికే కాదు.. భద్రంగా మార్చుకోవడానికి అందుబాటులోకి వచ్చిన యాప్‌లెన్నో. వాటి సాయంతో ఫొటోపై వాటర్‌మార్క్‌ వేసుకోండి. అప్పుడు మార్ఫింగ్‌ అవకాశాలు తగ్గుతాయి.
  • గుర్తుంచుకోవడానికి వీలుగా ఉంటుందని తేలిక పాస్‌వర్డ్‌లు పెట్టుకోవద్దు. నెట్టింట కాచుకొని ఉండేవారే ఎక్కువ. పొరపాటున హ్యాకర్ల చేతికి చిక్కారో.. సమాచారం, ఫొటోలన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. క్లిష్టమైన పాస్‌వర్డ్‌లనే పెట్టుకోండి. సోషల్‌మీడియా ఖాతాలు ఒక్కోదానికి ఒక్కోటి పెట్టుకోవడం మేలు. టూ వే అథెంటికేషన్‌కి ప్రాధాన్యమిస్తే సురక్షితంగా ఉండొచ్చు.
  • ట్రెండ్‌ పేరుతో ప్రతిదానికీ హ్యాష్‌ట్యాగ్‌లను ఇచ్చుకుంటూ వెళ్లొద్దు. మీ ఖాతాను అందరి ముందుకీ తీసుకెళ్లే మార్గమిది. ఇంకా.. కంప్యూటర్‌లో యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ తప్పనిసరి చేసుకోండి. సిస్టమ్‌, మొబైల్‌ ఏదైనా.. ఉపయోగించడం పూర్తయ్యాక సోషల్‌ మీడియా ఖాతాల నుంచి లాగ్‌ఆఫ్‌ అయితే ఇంకా మంచిది, సురక్షితం కూడా!

వలలో చిక్కితే?

ఫేక్‌ ఫొటో కనిపించినా.. బెదిరింపు కాల్స్‌ వచ్చినా భయపడొద్దు, ఆత్మహత్య నిర్ణయం తీసుకోవద్దు. సాయం చేసే చట్టాలున్నాయి. వాటిని ఆశ్రయించండి. ఈమెయిల్‌, ఫోన్‌ ద్వారా సైబర్‌ పోలీసులను ఆశ్రయించొచ్చు. ఫొటోలు, వీడియోలు కనిపిస్తే అవి వ్యాప్తి చెందకుండా చూడమని కోర్టు నుంచి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకోవచ్చు. వాటిని తీసేయమని ఆ వెబ్‌మాస్టర్‌ లేదా గూగుల్‌, ఫేస్‌బుక్‌లను సంప్రదించవచ్చు. stopncii.orgలో సంబంధిత వివరాలను నమోదు చేసినా చాలు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో నెట్టింట ఏ మూలన మీ అభ్యంతరకర ఫొటోలున్నా తొలగించేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్