పొదుపు రూ.10 కోట్లు

37 ఏళ్ల కెటీ డొనేగన్‌ పొదుపు గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అందరూ ఉద్యోగంలో ఒక స్థాయికి చేరే వయసులో తను రిటైరవ్వడమే కాదు... రూ.10 కోట్లు పొదుపు చేసి వార్తల్లోకెక్కింది. అదెలా

Updated : 06 Oct 2021 03:32 IST

37 ఏళ్ల కెటీ డొనేగన్‌ పొదుపు గురించి వింటే ఆశ్చర్యపోవాల్సిందే. అందరూ ఉద్యోగంలో ఒక స్థాయికి చేరే వయసులో తను రిటైరవ్వడమే కాదు... రూ.10 కోట్లు పొదుపు చేసి వార్తల్లోకెక్కింది. అదెలా సాధ్యమైందో కూడా సామాజిక మాధ్యమాల్లో చెబుతోంది... ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్న కెటీ పొదుపు రహస్యాలను తెలుసుకుందాం.

చదువుకునేటప్పుడు అమ్మానాన్న ఇచ్చిన పాకెట్‌ మనీని తోబుట్టువుల్లా కెటీ ఖర్చు పెట్టేది కాదు. చిన్నప్పటి నుంచి ప్రతి పైసాను పొదుపు చేసేది. అలా దాచిన నగదుతో ఏదైనా చిన్నవ్యాపారం మొదలు పెట్టాలని పాఠశాల స్థాయి నుంచే ఆలోచించేది. అదే ఆమెను కోస్టారికాకు వెళ్లేలా చేసింది. అక్కడ తన జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటనే అలాన్‌ని కలవడం అంటుంది కెటీ. ‘అనుకోకుండా ఏర్పడిన మా పరిచయం ప్రేమగా మారి జీవితాన్ని పంచుకునేలా చేసింది. పొదుపులో మా ఆలోచనలు ఒకటిగా ఉండటమే దీనికి కారణం. అలా ఒంటరిగా వెళ్లి జంటగా లండన్‌కు 2013లో తిరిగొచ్చా. ఆ తర్వాత లండన్‌ యూనివర్శిటీలో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేసి, ఓ జీవితబీమా సంస్థలో ఏడాదికి రూ.28 లక్షల జీతానికి చేరా. అలాన్‌ సొంత వ్యాపారం చేసేవాడు.

సొంత ఇల్లు కోసం నగదు కూడబెట్టడం మొదలు పెట్టాం. దీనికోసం ఇద్దరం చాలా పొదుపుగా ఉండేవాళ్లం. ప్యాక్డ్‌ లంచ్‌ తినేవాళ్లం. ఎక్కువ ఖర్చయ్యే రాత్రి పార్టీలకు స్వస్తి పలికాం. అవసరానికి సెకండ్‌ హ్యాండ్‌ కారునే కొన్నాం. నెలకు రూ.3లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేయాలనే లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. అలా మాకంటూ చిన్న ఇల్లు  కొనుక్కున్నాం. మా కారు, ఇంటిని చూసి చాలామంది విమర్శించేవారు. అవేవీ పట్టించుకునే వాళ్లం కాదు. ఉద్యోగంలో చాలా కష్టపడే దాన్ని. దాంతో ఏడాదికే నా జీతం  రెట్టింపయ్యింది. దాంతోపాటు మేమిద్దరం స్టాక్‌ మార్కెట్‌ గురించి అధ్యయనం చేసేవాళ్లం. క్రమేపీ అందులో కొంత నగదును వెచ్చించాం. సరైన నిర్ణయాలు తీసుకునే వాళ్లం. చిన్నచిన్న సంస్థలకు ఇన్వెస్టర్లుగా మారాం. ఏటా వీటి నుంచి రూ.65 లక్షలు ఆదాయం వస్తుంది. దీంతోపాటు ఆర్థిక సూత్రాల గురించి పాఠాలు చెప్పడానికి ఆన్‌లైన్‌లో రెబెల్‌ ఫైనాన్స్‌ స్కూల్‌ ప్రారంభించా. పదివారాల ఈ కోర్సులో ఆర్థికపరమైన జాగ్రత్తలు, ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు, పొదుపుపై పాఠాలుంటాయి. రెండేళ్లక్రితమే ఉద్యోగవిరమణ చేసి, సొంతంగా స్కూల్‌ నిర్వహణతోపాటు కౌన్సెలింగ్‌ చేస్తున్నా. మా లక్ష్యం రూ.10 కోట్లు పొదుపు చేయాలని. దాన్ని చేరుకున్నాం’ అని చెబుతున్న కెటీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్