Updated : 03/02/2022 05:30 IST

ఆంక్షలు దాటి..అడవిలో సివంగిలా!

చదువుకుంటానంటేనే ఒప్పుకోని ఊరది. చదవడమే కాదు.. అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాన్ని ఎంచుకుందామె. హేళనలు, అవమానాలు.. ప్రమాదాలు.. ఎదురైనా ధైర్యంగా నిలిచింది. ఆమెను చూసి ఇప్పుడా ఊరే మారింది. ఆమె స్ఫూర్తిగా ఎంతోమంది అమ్మాయిల తమ తలరాతను మార్చుకుంటున్నారు. ఇదంతా సూరజ్‌ బాయ్‌ మీనాకి ఎలా సాధ్యమైంది?

‘ఓసారి పర్యటకులతో జీప్‌లో వెళ్తున్నాం. మా ముందు, వెనుక రెండు వాహనాలు. దూరం నుంచి సుందరి అనే ఆడపులి కనిపించింది. దాన్ని మేం రంతంబోర్‌కి మహారాణి అంటాం. అది వెళ్లిపోయిందని మేం ముందుకు సాగుతున్నాం. పొదల చాటు నుంచి ఒక లేడిపిల్ల పరుగెత్తింది. అకస్మాత్తుగా బండి ఆపేశాం. ఇంతలో దాన్ని వెంబడిస్తూ పులి. రెండు వాహనాల మధ్య పట్టలేదు. దీంతో జీపు బ్యానెట్‌పై నుంచి దూకింది. తీరా చూస్తే.. దాని నోట్లో ఆ జింక పిల్ల. అప్పటిదాకా పులి కనిపిస్తే ఫొటోలు తీయాలని ఆసక్తిగా ఎదురుచూసిన వాళ్లంతా చేతిలో కెమెరాలతో బిగుసుకు పోయారు’.. 15 ఏళ్ల సర్వీసులో సూరజ్‌ బాయ్‌కి ఇలాంటి అనుభవాలెన్నో.

ఈమెది  రాజస్థాన్‌లోని భురి పహాడి. వ్యవసాయమే జీవనాధారం. పక్కన పరిశ్రమలు, సంస్థలు ఎరుగరు. విద్యుత్‌ సౌకర్యమే లేదు. అమ్మాయిలంటే వంట, ఇల్లు చక్కదిద్దుకోవడం, పిల్లలు కనడానికే అని బలంగా నమ్ముతారక్కడ. అలాంటి గ్రామం నుంచి బయటకు వచ్చి పనిచేస్తోన్న మొదటి మహిళ సూరజ్‌ బాయ్‌. ఈమెకు ఆరుగురు అన్నలు, ఓ అక్క. అన్న హేమరాజ్‌తో సాన్నిహిత్యం ఎక్కువ. అతను రంతంబోర్‌ నేషనల్‌ పార్క్‌లో గైడ్‌. ఇంట్లోవాళ్లకు చెప్పకుండా సూరజ్‌ బాయ్‌ అతని కూడా వెళ్లేది. అది చూసి చుట్టూ ఉన్నవాళ్లు వాళ్లిద్దర్నీ హేళన చేసేవారు, ఏడిపించేవారు. ఏడ్చినా, విననట్లు మౌనంగా ఉన్నా వాళ్ల ఆగడాలు పెరిగాయే కానీ తగ్గలేదు. దీంతో ఓసారి తిరగబడింది. అంతే.. హేళన చేసినవాళ్లే దూరంగా ఉంటూ వచ్చారు. అలా చిన్న వయసులోనే ఏదైనా సాధించాలంటే ధైర్యంగా నిలబడాలని సూరజ్‌కి అర్థమైంది. తర్వాత ఆసక్తి పెరిగి, తనూ అన్నలాగే నేచురలిస్ట్‌ అవుతానంది. ఇంట్లో ఒప్పించి అన్న ఆమెను పక్క ఊరి స్కూల్లో చేర్పించాడు. పదో తరగతి తర్వాత నేచురలిస్ట్‌ శిక్షణనిప్పించాడు. చుట్టూ మగవాళ్లే. ఒకరకమైన చూపులు, వెక్కిరింతలు.. ఉద్యోగంలో చేరినా అదే పరిస్థితి. ‘విదేశీ పర్యటకులతో మాట్లాడతావా? నీకు జీవితంలో పెళ్లి అవ్వదు’ అంటూ ఇంట్లో వాళ్ల ఒత్తిడి. ఊళ్లో తెలిసి.. మొదట నచ్చజెప్పాలని ప్రయత్నించారు. తర్వాత బెదిరింపులకీ దిగారు. మళ్లీ అన్నే తనకు అండగా నిలిచాడు. అలా 16 ఏళ్ల వయసులో రంతంబోర్‌ నేషనల్‌ పార్క్‌ మొదటి మహిళా నేచురలిస్ట్‌ అయ్యింది. తను చదివింది పదో తరగతే. అదీ హిందీ మీడియం. తనకు జంతువులు, పక్షుల స్థానిక పేర్లే తెలుసు. ఇతర భాషల వాళ్లతో మాట్లాడటమే కష్టమయ్యేది. ఇంగ్లిష్‌ అక్షరాలే తెలియదు. మాట్లాడమెలా? మొదట్లో ఆంగ్ల పేర్లను హిందీలో రాసుకునేది. అక్షరాలు, ఆపై డిక్షనరీ సాయంతో పదాలు తెలుసుకుంటూ ఇంగ్లిష్‌ నేర్చుకుంది. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ, ఎంఏ, బీఈడీ పూర్తిచేసింది. జంతువుల గొంతు, పాదాల గుర్తుల ఆధారంగా వాటిని కనిపెట్టడం, వాటి శరీర భాషను బట్టి వాటి మానసిక స్థితిని అంచనా వేయడం వంటివి చేసేయగలదు. ‘అమ్మాయి అనగానే ఏమీ చేయలేదన్న భావన చాలామందిలో. చదువుకున్న వాళ్లూ అంతే. ఓసారి ఓ పై అధికారిని పర్యటనకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆయన నిల్చొని ఫొటోలు తీస్తున్నారు. పులులు ఎక్కువగా తిరిగే ప్రాంతమని చెప్పి కూర్చోమన్నా. ఆయన ‘నిన్ను నువ్వెలా ఎలా కాపాడుకోవాలో చూసుకో చాలు. నా గురించి అనవసరం’ అన్నాడు. అనుకోకుండా జీపులోంచి పడిపోయాడు. ఎదురుగా పులి. నేను వెంటనే దూకి ఓ కర్ర అందుకుని దానికీ, ఆయనకీ మధ్యలో నిల్చొన్నా. భయపడకుండా దానివైపే చూశా. చివరికి అది వెళ్లిపోయింది. ఆయన్ని జీపు ఎక్కించి, నా పని కొనసాగించా. నా పని మాట్లాడితే చాలన్నది నా అభిప్రాయం. నా అత్తింటివాళ్లు నన్ను ప్రోత్సహించేవాళ్లే. చిన్న తోడ్పాటు చాలు.. అమ్మాయిలు ఏదైనా సాధించగలరు. ఇప్పుడు నన్ను స్ఫూర్తిగా తీసుకుని మా గ్రామంలోని అమ్మాయిలంతా విద్యవైపు సాగుతున్నారు. మహిళలపట్ల మగవాళ్ల ప్రవర్తనా మారింది. అది చూసినప్పుడు సాధించా అనిపిస్తోంది’ అంటుంది సూరజ్‌ బాయ్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని