పుడమికి ప్రేమతో!

అమ్మలాంటి భూమి మనకి ఎన్నో ఇచ్చింది.. మరి ఆ పుడమికి మనమేం ఇస్తున్నాం? ప్లాస్టిక్‌ వ్యర్థాలు.. కాలుష్యాన్ని పెంచే చెత్తాచెదారం. భవిష్యత్‌ తరాలకి స్వచ్ఛమైన ధరణిని కానుకగా ఇవ్వడానికి నడుం బిగించారు వీరంతా.

Updated : 22 Apr 2023 06:16 IST

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం

అమ్మలాంటి భూమి మనకి ఎన్నో ఇచ్చింది.. మరి ఆ పుడమికి మనమేం ఇస్తున్నాం? ప్లాస్టిక్‌ వ్యర్థాలు.. కాలుష్యాన్ని పెంచే చెత్తాచెదారం. భవిష్యత్‌ తరాలకి స్వచ్ఛమైన ధరణిని కానుకగా ఇవ్వడానికి నడుం బిగించారు వీరంతా. అందుకోసం ఏం చేస్తున్నారో చూడండి..


పెళ్లితో మొదలుపెట్టి.. 

పెళ్లిళ్లు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యాలని పర్యావరణహితంగా నిర్వహించి.. వచ్చిన వ్యర్థాలను ‘ఎర్త్‌ సిట్టర్స్‌’ పేరుతో ఎరువుగా మారుస్తోంది కావ్య సింధూజ... 

హైదరాబాద్‌లోని బిట్స్‌లో డ్యూయల్‌ డిగ్రీ చేసిన కావ్య సొంతూరు విజయవాడ. ముంబయిలో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే ఇబ్బందుల గురించి తెలుసుకుని ఉద్యోగం మానేసింది. తనూ పర్యావరణం కోసం ఏదైనా చేయాలనుకుంది. ‘ఓసారి దిల్లీ దగ్గర్లోని బలస్వా డంపింగ్‌ యార్డును చూశా. దూరం నుంచి చూసి పెద్ద కొండేమో అనుకున్నా. ఆ తర్వాత బెంగళూరులో భూమి కళాశాలలో సుస్థిర జీవనంపై ఏడాది కోర్సు చేశాను. అక్కడే వ్యర్థాల నిర్వహణ గురించి తెలిసింది. కళాశాల సదస్సులో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ బృందానికి నాయకత్వం వహించా. ఆ ఆత్మవిశ్వాసంతోనే బెంగళూరుకు చెందిన ‘రౌండ్‌ టేబుల్‌’ సంస్థలో ఓ ఏడాది పనిచేశా. 2021లో ‘ఎర్త్‌ సిట్టర్స్‌’ను స్థాపించా. దీనిద్వారా అతి తక్కువ వ్యర్థాలతో జీవించడం.. సేంద్రియ ఎరువుల తయారీ అంశాలపై అవగాహన కల్పించేదాన్ని. నా పెళ్లినీ పర్యావరణహితంగా చేసుకున్నా. వచ్చిన చెత్తలో 90 శాతాన్ని సేంద్రియ ఎరువుగా మార్చాం. ఇది నచ్చిన మిత్రులు, తెలిసిన వారు మాక్కూడా అలా చేసి పెట్టమని అడిగారు. ఇక దీన్నే వ్యాపార మార్గంగా ఎంచుకున్నా. వేడుకల్లో వ్యర్థాలను తగ్గించుకునే పద్ధతులు, సామగ్రి గురించి తెలియపరుస్తాం. ఆహారం, అలంకరణ, బహుమతులు, ఆహ్వాన పత్రికలు ఇలా అన్ని అంశాల్లో పునర్వినియోగ, పర్యావరణ హిత వస్తువులే ఉండేలా జాగ్రత్తలు చెబుతాం. కావాలంటే వేడుకలప్పుడు మేమే వ్యర్థాలను సేకరించి, చిలకలూరిపేట సమీపంలోని మా యూనిట్‌కు తరలించి ఎరువుగా మారుస్తాం. విజయవాడ, గుంటూరు మినహా మిగిలిన ప్రాంతాల్లో అయితే ఆ సమీపంలోని వ్యర్థాల నిర్వహణ యూనిట్లకు తరలిస్తాం. మా సేవలను తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై వంటి ప్రాంతాలకూ అందించాం. ఇంతవరకూ 4 టన్నుల ఎరువుని తయారుచేసి రైతులకు ఉచితంగా అందించాం. మా సంస్థలో 15 మంది వరకూ ఉపాధి పొందుతున్నారు’ అంటోంది కావ్య. 

చిరుమామిళ్ళ లక్ష్మణరావు, ఈనాడు, అమరావతి


అత్తగారి కోసం..

ప్రయాణాలంటే షిప్రాకి చాలా ఇష్టం. ఎన్నో దేశాలు చుట్టి ంది. వివిధ ప్రాంతాల సంప్రదాయాలు, కళలు, సంస్కృతి గురించి తెలుసుకోవడమంటే ఆసక్తి. అదే తనను ఇంటీరియర్‌ డిజైనర్‌ని చేసింది. యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌లో చదివిన ఆమె వివిధ దేశాల్లోనూ పనిచేసింది. పుట్టింది లఖ్‌నవూ. ఉద్యోగరీత్యా ముంబయిలో స్థిరపడింది. అనుభవం సంపాదించాక 2014లో సొంత సంస్థ ‘స్కెచ్‌ డిజైన్‌ స్టూడియో’ ప్రారంభించి.. దేశ, విదేశీ సంస్థలతో కలిసి పనిచేసింది. ఇల్లు, ఆఫీసులు, షాపింగ్‌ మాళ్లు వంటివీ డిజైన్‌ చేసింది. వాటిల్లో భారతీయ సంప్రదాయం కనిపించేలా చూడటం తన ప్రత్యేకత. షిప్రా అత్తగారిది రాజస్థాన్‌. ఆవిడకి మొక్కల పెంపకం అంటే ఆసక్తి. ఇంట్లోకి వాడే కూరగాయలన్నీ మందుల్లేకుండా స్వయంగా పండిస్తారు. సెలవుల్లో విశ్రాంతి తీసుకోవడానికని వీళ్ల కుటుంబం ఓ ఇంటిని ప్లాన్‌ చేసుకోవాలనుకుంది. అది పూర్తి పర్యావరణ హితంగా ఉండాలన్నది అత్తగారి కోరిక. గతంలోనూ షిప్రాకి క్లయింట్ల నుంచి ఇలాంటి కోరికలే వచ్చాయి. ఆసక్తి ఉన్నా సంప్రదాయ పద్ధతుల్లో కట్టడంపై అవగాహన లేక చేయలేదు. ఈసారి ప్రయత్నిద్దామనుకొని దీనిపై విస్తృతంగా పరిశోధన చేసింది. అల్వార్‌లో సిమెంట్‌ వాడకుండా స్థానికంగా దొరికే రాళ్లు, మట్టి, లైమ్‌ ప్లాస్టర్‌, గడ్డి, బెల్లం, వేప, మెంతులు వంటివి వాడి ఇంటిని 2021లో పూర్తిచేసింది. దీనికి ‘మడ్‌ కోటి’గా పేరు పెట్టింది. సహజ వెలుతురు, ఎండల్లోనూ చల్లగా ఉన్న ఆ నిర్మాణాన్ని చూసి, అత్తగారే కాదు ఎంతోమంది ఫిదా అయ్యారు. ఇదిచ్చిన ఉత్సాహంతో తను డిజైన్‌ చేసే ఇళ్లలో పర్యావరణ హిత పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తోంది షిప్రా. అంతేకాదు కోరుకున్న వారికి మట్టి ఇళ్లనూ చేసిస్తూ జాతీయ స్థాయి పురస్కారాలూ అందుకుంటోంది.


ప్లాస్టిక్‌ని వడికేస్తున్నారు!

ఒకప్పుడు విదేశీవస్త్రాల బహిష్కరణకు గాంధీజీ చరఖాను ఆయుధం చేసుకున్నారు. అమితా దేశ్‌పాండే దాన్నే పర్యావరణ హితానికి ఉపయోగిస్తోంది. స్వస్థలమైన దాద్రానగర్‌ హవేలీ కాలుష్యానికి కాస్త దూరం. ఉద్యోగం కోసం పుణెకి వెళ్లాక.. విచ్చలవిడిగా చెట్లను నరికేయడం, ప్లాస్టిక్‌ కవర్లూ, బహిరంగంగా చెత్త పడేయడం వంటివన్నీ చూసి బాధపడిందామె. ఐటీ ఉద్యోగం చేస్తూనే వ్యర్థాల సేకరణకి డ్రైవ్‌లు నిర్వహించేది. తన సంస్థలో ప్లాస్టిక్‌ కప్పుల నిషేధానికీ కృషిచేశారు. అమెరికాలో మాస్టర్స్‌ చేసి తిరిగొచ్చాక కార్పొరేట్‌ సంస్థల సామాజిక బాధ్యతా కార్యక్రమాలు, బాధితుల అవసరాల మధ్య అంతరాన్ని గమనించారామె. దాన్ని తగ్గించడానికి ఓ కన్సల్టెన్సీ ప్రారంభించారు. అయినా ఏదో అసంతృప్తి. దాంతో వ్యర్థాల నిర్వహణపై దృష్టిపెట్టి ‘రీచరఖా- ది ఎకో సోషల్‌ ట్రైబ్‌’ను ప్రారంభించింది. వ్యర్థాలను అప్‌సైక్లింగ్‌ చేయడం, గ్రామీణులకు జీవనోపాధి కల్పించడం, ప్లాస్టిక్‌ రహిత జీవనంపై సామాజిక అవగాహన కల్పించడం సంస్థ ప్రధాన లక్ష్యాలు. దీనికోసం పుణెలో చెత్త ఏరుకునే వారి నుంచి పాలిథీన్‌ బ్యాగులు, ర్యాపర్లు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి.. అందమైన బ్యాగులు, చాపలు, పొట్లీలు వంటివి రూపొందిస్తోంది. దీనికోసం దాద్రానగర్‌ హవేలీలో ఓ యూనిట్‌నీ ఏర్పాటు చేసింది.. సేకరించిన వాటిని కడిగి, శానిటైజ్‌ చేశాక చరఖాపై నూలుగా తిప్పి, చేనేత మగ్గంపై ప్లాస్టిక్‌ ఫైబర్‌ని అల్లుతారు. ఆపై వస్తువులు తయారు చేస్తారు. వీటిని వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. పదిలక్షలకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేసిన రీచరఖా ఎంతోమంది మహిళలకీ ఉపాధినిస్తోంది.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా
పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని