ఐదుపదుల వయసులో.. ఎవరెస్ట్‌ దారిలో..

ఎవరెస్ట్‌ని అధిరోహించడం ఉడుకు రక్తానికే సాధ్యం అంటే ఆమె ఒప్పుకోరు. ఐదుపదుల అనుభవం కూడా అర్హతే అనే కర్రా విజయలక్ష్మి తాజాగా ఎవరెస్ట్‌ బేస్‌క్యాంపు చేరుకుని తోటి మహిళలకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు...

Updated : 17 May 2023 06:36 IST

ఎవరెస్ట్‌ని అధిరోహించడం ఉడుకు రక్తానికే సాధ్యం అంటే ఆమె ఒప్పుకోరు. ఐదుపదుల అనుభవం కూడా అర్హతే అనే కర్రా విజయలక్ష్మి తాజాగా ఎవరెస్ట్‌ బేస్‌క్యాంపు చేరుకుని తోటి మహిళలకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు...

ర్వతారోహణ తేలికైన విషయం కాదు. మైనస్‌ డిగ్రీల వాతావరణంలో.. తీసుకునే ఊపిరి కూడా గడ్డేకట్టేంత చలి. అలాంటి వాటి గురించి ఆలోచించడానికి కూడా వణికిపోయే 50 ఏళ్ల వయసులో విజయలక్ష్మి తన చిన్ననాటి కలని నిజం చేసుకోవాలనుకున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు ఆమె సొంతూరు. ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త వెంకట్‌రెడ్డి వ్యాపారి. చిన్నతనం నుంచీ పర్వతాలను అధిరోహించాలన్నది ఆమె కల. అందులో భాగంగానే ఈ సాహసయాత్రలు. ‘చిన్నప్పుడు నల్గొండలో ఉర్సు ఉత్సవాలప్పుడు లతీఫ్‌ సాహెబ్‌ గుట్టను ఆగకుండా ఎక్కినప్పుడే నా సత్తా ఏంటో నాకు తెలిసింది. అప్పటి నుంచి పర్వతారోహణంపై ఇష్టం పెరిగింది. తోటి ఉపాధ్యాయుల ద్వారా పర్వతారోహణం చేయించే ‘బ్రూట్స్‌ అండ్‌ క్రాంపన్స్‌’ సంస్థ గురించి తెలుసుకున్నా. వారి సూచనలు మేరకు యోగా, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. యూట్యూబ్‌ సాయంతో చాలామంది అనుభవాలు తెలుసుకున్నా. 2020లో ఉత్తరాఖండ్‌లోని రుడుగైరా పర్వతాన్ని ఎక్కా. ఆ తర్వాత 2021 సెప్టెంబర్‌లో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాగ్రాన్ని చేరుకున్నా. ఆ ఆత్మవిశ్వాసంతోనే గతేడాది ఆగస్టులో ఐరోపాలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్‌బ్రస్‌నూ అధిరోహించా’ అంటున్న విజయలక్ష్మి ప్రస్తుతం ఆరువేల మీటర్ల ఎత్తున్న ఎవరెస్ట్‌ బేస్‌క్యాంపు చేరుకుని శెభాష్‌ అనిపించుకున్నారు. ఈ నెల 6న హైదరాబాద్‌ నుంచి తన యాత్రని ప్రారంభించిన ఆమె భర్తతో కలిసి బేస్‌క్యాంపు చేరుకున్నారు. ‘ఏ వయసు వారికైనా పర్వతారోహణ కష్టమే. కానీ నాకున్న ఆసక్తి కొద్దీ ఈ పర్వతారోహణ చేశా. ఎన్నో సవాళ్ల మధ్య ఇక్కడకు చేరుకున్నా, ఈసారి ఎవరెస్ట్‌ శిఖరాగ్రం చేరడమే నా లక్ష్యం. ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాక వయసు గురించి ఆలోచించొద్దు’  అంటున్నారు విజయలక్ష్మి. 

- శ్రీకాంత్‌ మడుపు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని