పరిమళించిన పద్మాలు!

ఒక్క అడుగు ఏం చేయగలదు? మార్పునకు నాంది కాగలదు.  వేల జీవితాలను మార్చగలదు. నడిచిన మార్గంలో బలమైన ముద్ర వేయగలదు.

Updated : 27 Jan 2024 07:38 IST

ఒక్క అడుగు ఏం చేయగలదు? మార్పునకు నాంది కాగలదు.  వేల జీవితాలను మార్చగలదు. నడిచిన మార్గంలో బలమైన ముద్ర వేయగలదు. అందుకు ఉదాహరణలే ఈ మహిళలు! ఒంటరి భావన వదిలి ముందడుగు వేశారు.  తమ తమ రంగాల్లో రాణించారు, స్ఫూర్తిని నింపారు. ఆ కృషికి గుర్తింపే ఈ ‘పద్మ’ పురస్కారాలు. వారిలో కొందరి గురించి...


రాణి అడిగారనే...

హార్వర్డ్‌ విద్యార్థులకు అభిజ్ఞాన శాకుంతలం, న్యూయార్క్‌ వాసులకు కుమార సంభవం... మనసుకు హత్తుకొనేలా పరిచయం చేశారామె. తెలుగువారి హరికథా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి జీవితాన్నే అంకితం చేశారు దాలిపర్తి ఉమామహేశ్వరి. పద్మశ్రీ వరించిన సందర్భంగా వసుంధర ఆమెను పలకరించింది..

నేను పుట్టింది మచిలీపట్నంలోనే అయినా... నాలోని కళాకారిణికి ప్రాణం పోసింది కపిలేశ్వరపురంలోని ‘శ్రీసర్వారాయ హరికథా పాఠశాల’. అమ్మా, నాన్న ఇద్దరూ సంగీత విద్వాంసులే. ఇంటి విద్య ఒంట పట్టదని బయటే సంగీతం నేర్పిస్తూ.. ‘బీఏ చదివితే మంచి టీచర్‌ ఉద్యోగం వస్తుంద’నేవారు నాన్న. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. రామానాయుడు పేటలో మేముంటున్న ఇంటికి దగ్గర్లో పెద్దబంగ్లా ఉండేది. అక్కడుండే నా స్నేహితురాళ్లని కలవడానికి వెళ్లి సరదాకి ఓ పాట పాడాను. అది విని పక్కగదిలో ఉన్న కపిలేశ్వరపురం రాణి ఎంతో ముచ్చటపడ్డారు. వాళ్ల ఊళ్లోని హరికథా పాఠశాలలో చేరమని అడిగారు. ఆ విషయం ఇంట్లో చెప్పలేదు నేను. ఎందుకంటే మేం ఆరుగురు పిల్లలం. కుటుంబాన్ని వదిలి వేరే ఊరు వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత ఏడాది కూడా రాణిగారు ప్రత్యేకంగా కబురు పంపేసరికి... నాన్నే స్వయంగా స్కూల్‌లో చేర్చారు. నటరాజ రామకృష్ణగారి ఆధ్వర్యంలో.. ఒక కోర్సు ప్రకారం అక్కడ సంగీతం, సాహిత్యం, నాట్యం, సంస్కృతం నేర్పేవారు. అన్నీ ఉచితం. గొప్పగొప్ప గురువులు ఉండేవారు. ఏదో ఒక ఏడాది నేర్చుకుని బయటకు వచ్చేద్దాం అనుకున్నా. కానీ రాణీగారి ప్రేమకు, అభిమానానికి కట్టుబడి.. ఇప్పటికీ ఆ స్కూల్‌తో నా అనుబంధం కొనసాగుతూనే ఉంది.

 

అలా మొదలైన ప్రయాణం...

‘ఉజ్జయినిలో మహాకవి కాళిదాసు ఉత్సవాలు జరుగుతున్నాయి. మీ ఉమతో కుమార సంభవం హరికథా ప్రదర్శన చేయిస్తే బాగుంటుంది’ అని నటరాజ రామకృష్ణగారే మా స్కూల్‌కి ఫోన్‌చేశారు. అలా అంతర్జాతీయ వేదికపై మొదటిసారి సంస్కృతంలో హరికథా ప్రదర్శన ఇచ్చా. సాహిత్యం, సంగీతం, నృత్యం కలిసిన ఈ కళని చూసి ఎంతో మంది ప్రశంసించారు. ఇది తెలుగువారి ప్రత్యేకం అని తెలిసి ఆశ్చర్యపోయారు. దాంతో అప్పటివరకూ నాలో ఉన్న బెరుకూ, భయం అన్నీ పోయాయి. ఆ తర్వాత దేశంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ నా ప్రదర్శనలు జరిగాయి. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో, న్యూయార్క్‌లోని వేదిక్‌ కాన్ఫరెన్స్‌ సహా తానా, ఆటా అంటూ ప్రపంచం మొత్తం పర్యటించా. తెలుగులో 800, సంస్కృతంలో 600 ప్రదర్శనలు ఇచ్చాను. మరోపక్క కపిలేశ్వరపురంలోని మా పాఠశాలకు వెళ్తూ... అక్కడా సేవలు అందిస్తున్నా. ఏడాదిలో ఆరుసార్లు వెళ్తా. వెళ్లినప్పుడల్లా పదిరోజులుండి ... విద్యార్థులకు సంగీత, నాట్య పాఠాలు నేర్పుతుంటా. మావారు కళాకృష్ణ ఆంధ్రనాట్యంలో నిష్ణాతులు. వివాహమయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. ఇద్దరం కళాకారులమే కావడంతో క్షణం తీరికలేని రోజులున్నా.. సమన్వయంతోనే జీవితాన్ని నెగ్గుకొచ్చాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఇగోలకు పోకుండా కొన్నిసార్లు మౌనాన్ని ఆశ్రయిస్తా. మాకిద్దరు పిల్లలు. దత్తత తీసుకున్నాం. పాప వివాహమై విదేశాల్లో స్థిరపడింది. బాబు ఎంఎస్‌ చదివాడు. ఇక కొత్తతరం పిల్లలూ ఈ కళలని నేర్చుకోవడానికి ఆసక్తితో ముందుకొస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్న పిల్లలకు ఆన్‌లైన్‌ వేదికగా సంగీత పాఠాలు నేర్పుతున్నా. ఇక పురస్కారాలంటారా... సంగీత నాటక అకాడమీ, రాష్ట్రపతి అవార్డులతో సహా ఎన్నో వరించాయి. ఈ పద్మశ్రీ మరింత ప్రత్యేకం.


లేడీ టార్జాన్‌... 

చామీ దేవి ముర్ముని ఝార్ఖండ్‌ లేడీ టార్జాన్‌గానూ పిలుస్తారు. అలాగని ఈమె పులులతో స్నేహం, ఏనుగులూ, కోతుల వంటి జంతువులతో కబుర్లూ చెబుతుందని కాదు. తమ ప్రాంతంలో టింబర్‌ మాఫియా, మావోయిస్టుల విధ్వంసంతో కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం వల్లే ఈ పేరొచ్చింది. చామీది సరైకేలా ఖార్సావాన్‌లోని భుర్‌సాయ్‌ గ్రామం. కలప అక్రమ రవాణా, పేదరికంతో మగ్గిపోతోన్న ఊళ్లను చూశాక ఈ నిర్ణయం తీసుకున్నారామె. 1996లో మొక్కలు నాటాలనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బెదిరింపులకు లొంగలేదు. భౌతిక దాడులను లెక్కచేయలేదు. ఒక్కొక్కరిగా మహిళలందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. మూడు వేలమందితో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. వీరందరి సాయంతో మద్ది, వేప, తుమ్మ, యూకలిప్టస్‌, మామిడి, జామ వంటి పండ్ల మొక్కలనూ నాటారు. వాటర్‌షెడ్‌లూ, చెక్‌డ్యామ్‌లూ నిర్మించుకున్నారు. ఫలితంగా పరిసరాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. నర్సరీలు ఏర్పాటు చేసుకున్నారు. వీరి ప్రయత్నాన్ని గుర్తించిన ప్రభుత్వం మేకలూ, కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ సాగుని ప్రోత్సహిస్తోంది. వీటన్నింటి ఫలితంగా సుమారు 30,000 మంది మహిళల జీవితాల్లో మార్పు సాధ్యమయ్యింది. అంతేకాదు, చామీ ‘సహయోగి మహిళ’ పేరుతో ఎన్జీవోను నిర్వహిస్తూ... సురక్షిత ప్రసవాలు జరిగేలా చూస్తున్నారు. రక్తహీనత, పోషకాహారలేమి, డ్రాపవుట్లను అడ్డుకోగలుగుతున్నారు. ఈ కృషికి గుర్తింపుగానే 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి అవార్డు ఆమెను వరించింది. 36ఏళ్ల పాటు శ్రమించి 500 గ్రామాల్లో 28 లక్షలకు పైగా మొక్కలను నాటినందుకే చామీని ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు వరించింది.


బద్ధకంగా గడిపేయాలనుకుంది కానీ...

‘కెరియర్‌ అంటూ ఎందుకొచ్చిన పరుగు? హాయిగా పెళ్లి చేసుకొని నచ్చినంతమంది పిల్లల్ని కనేయాలి. వాళ్లని చూసుకుంటూ షాపింగ్‌లు చేసుకుంటూ కాలం వెళ్లదీయాలి’ చిన్న వయసులో కల్పనా మోర్పారియా కలే ఇది. కొన్ని దశాబ్దాల తర్వాత బ్యాంకింగ్‌ రంగంపై తనదైన ముద్ర వేస్తారని ఆవిడా ఊహించలేదు. ముంబయికి చెందిన ఈమెకు బీఎస్‌సీ పూర్తయ్యి ఇంట్లో ఖాళీగా గడిపితేగానీ అదెంత కష్టమో అర్థం కాలేదు. దీంతో టీచర్‌ అయ్యారు. అదీ నచ్చక ‘లా’లో చేరారు. అప్పుడే పెళ్లయ్యింది. అత్తింటివాళ్ల ప్రోత్సాహంతో పూర్తిచేసి, జీతం లేకుండా ఓ లా సంస్థలో చేరారు. తర్వాత ఐసీఐసీఐలోకి మారడం ఆవిడ జీవితాన్నే మార్చింది. చుట్టూ అనుభవం ఉన్నవాళ్లు. తనేమో ఈ రంగానికి కొత్త, పైగా వేరే విద్యానేపథ్యం. వాళ్లలో వెనకపడొద్దని చాలా కష్టపడ్డారు. ప్రతిఫలంగా పదోన్నతులు వరించాయి. ఆ తత్వానికి ఉన్నత బాధ్యతలు వరించాయి. ‘సుఖంగా ఉన్న ప్రాణం. దీన్ని కష్టపెట్టడమెందుకు అనుకున్నా పైవాళ్లు వినిపించుకోలేదు’ అనే కల్పన ‘క్యాపిటల్‌ మార్కెటింగ్‌’ గురించి అభ్యసించడమే కాదు న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఐసీఐసీఐ లిస్ట్‌ అయ్యేలా చేసి, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. తర్వాత జేపీ మోర్గాన్‌కి మారి, సీఈఓ అయ్యారు. ఒకప్పుడు బద్ధకంగా గడిపేయాలనుకున్న ఆమె తన నిర్ణయాలతో సంస్థలను దూసుకెళ్లేలా చేయడమే కాదు, ఎంతోమందికి మెంటార్‌గానూ మారారు. రెండేళ్ల క్రితం పదవీవిరమణ చేసిన కల్పన ఇప్పటికీ ‘పనే నా జీవితం’ అంటారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, బెనెట్‌ అండ్‌ కోల్‌మన్‌ వంటి పలు సంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫార్చూన్‌ ‘ద 50 మోస్ట్‌ పవర్‌ఫుల్‌ విమెన్‌ ఇన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌’ జాబితాలో చోటు సహా మరెన్నో పురస్కారాలు అందుకున్న ఈమెకు ‘పద్మశ్రీ’ ఓ కలికితురాయి లాంటిదే అంటారు ఆమెకు తెలిసినవారంతా. 74ఏళ్ల కల్పన... సేవలోనూ ముందే! భారతీ ఫౌండేషన్‌ తరఫున దేశవ్యాప్తంగా కొన్ని పాఠశాలలను దత్తత తీసుకొని, తిరిగి నిర్మిస్తున్నారు.


నాట్య పద్మం  

భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్‌ అందుకున్న వారిలో చెన్నైకి చెందిన ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి పద్మాసుబ్రహ్మణ్యం ఒకరు. మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని కె.సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులకు జన్మించారామె. తల్లి గొప్ప సంగీత విద్వాంసురాలు. తండ్రి ప్రముఖ చలనచిత్ర దర్శకుడు. ఆయన స్థాపించిన నృత్యోదయ పాఠశాలలో వజువూర్‌ బి రామయ్య పిళ్లై దగ్గర ఆమె తొలి అడుగులు పడ్డాయి. తర్వాత దండాయుధపాణి, గౌరీ అమ్మాళ్‌ దగ్గరా శిష్యరికం చేశారు. పలువురు దేవదాసీల దగ్గర సమారు 150 ముద్రలను నేర్చుకున్నారు. అప్పుడే నృత్య చరిత్ర, థియరీల మధ్య అంతరం ఉందని భావించి దీనిపై పరిశోధన చేయాలనుకున్నారు. 

ఆపై ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పద్మభూషణ్‌ గ్రహీత కూతుర్‌ రామకృష్ణన్‌ శ్రీనివాసన్‌ మార్గదర్శకత్వంలో సంగీతంలో బ్యాచిలర్‌ డిగ్రీ, ఎథ్నో మ్యూజికాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ, నృత్యంలో 108 భంగిమలపై పీహెచ్‌డీ చేశారు. దేశవిదేశాల్లో ప్రదర్శనలెన్నో ఇచ్చారు. పద్మ ప్రతిభను గుర్తించిన జపాన్‌, ఆస్ట్రేలియా, రష్యా వంటి పలు దేశాలు ఆమె గౌరవార్థం ఎన్నో డాక్యుమెంటరీలు, చిత్రాలూ నిర్మించాయి. సమాంతరంగా బీవీ లక్ష్మణ్‌, సలీల్‌ చౌదరిల దగ్గర సంగీతంలో తర్ఫీదు పొందారు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా దేశ, విదేశీ భాషల్లో పనిచేశారు. చరిత్ర, సంసృతి, కళలు వంటి అంశాలపై ఎన్నో వ్యాసాలు, పరిశోధనా పత్రాలు, పుస్తకాలూ రాశారు పద్మ. ఇండోసబ్‌ కమిషన్‌లో నాన్‌ అఫీషియల్‌ మెంబర్‌గా పనిచేశారు. కంచి పరమాచార్య నేతృత్వంలో సతారాలోని నటరాజ దేవాలయం కోసం బ్లాక్‌ గ్రానైట్‌తో 108 నటరాజ, పార్వతి విగ్రహాలను డిజైన్‌ చేశారు. అంతేనా, గతేడాది కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన బంగారు రాజదండం (సెంగోల్‌) ఏర్పాటులో కీలకంగా పనిచేశారు. ఇలా పద్మ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఇప్పటివరకూ వందకు పైగా పురస్కారాలెన్నో అందుకున్నారు. 1981లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్‌, తాజాగా పద్మవిభూషణ్‌ వరించాయి.


ఏనుగుల నేస్తం

శ్చిమ్‌బంగాలోని ఓ గ్రామం. 50కిపైగా ఏనుగులు ఊరిమీద పడి బీభత్సం సృష్టించాయి. వాటిని కట్టడి చేయడానికి ప్రయత్నించిన మావటితోపాటు ప్రజలూ ప్రాణాలు కోల్పోయారు. పేరున్న మావటులు, అధికారులు శ్రమిస్తున్నా ఫలితం లేదు. ఏం చేయాలో పాలుపోని సమయంలో వారికి తట్టిన పేరు పార్వతి బారువా. కొన్నిగంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశంలోనే తొలి ఏనుగుల శిక్షకురాలీమె. అసోం, గౌరీపూర్‌లోని రాజకుటుంబంలో పుట్టారు. నాన్నకి ఏనుగులను పట్టి, శిక్షణ ఇవ్వడమంటే సరదా. అదిచూసి ఆమెకీ ఆసక్తి మొదలైంది. కానీ మావటులంతా మగవారే. అప్పుడు తండ్రి దగ్గరికెళ్లి ‘ఏనుగులకు అమ్మాయిలు శిక్షణ ఇవ్వకూడదా’ అని అడిగారట పార్వతి. ‘ఆసక్తి ముఖ్యం కానీ, అమ్మాయైతే ఏంట’న్న ఆయన సమాధానం విని సాధన మొదలుపెట్టారు పార్వతి. 14 ఏళ్లకే ఏనుగును పట్టి, గురుదక్షిణగా నాన్న ముందు నిలబెట్టారు. తర్వాత రాచరికం పోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డప్పుడూ అవే వాళ్లకి ఆసరా అయ్యాయి. అందుకే వాటిని తన స్నేహితులు అంటారీమె. ‘అడవుల నరికివేతతో ఏనుగులు ఊళ్లలోకి వస్తున్నాయి. మానవాళికీ, వాటికీ మధ్య సామరస్యం ఏర్పరచగలిగితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. మావటిగా, కన్జర్వేషనిస్ట్‌గా నా పనే అది’ అనే 67ఏళ్ల పార్వతి కొన్ని దశాబ్దాలుగా ఒడిశా, పశ్చిమ్‌బంగ, అసోంలలో సేవలందిస్తున్నారు. ఏనుగులే కాదు, మావటులు, అటవీశాఖ వారికీ శిక్షణ ఇస్తున్నారు. బీబీసీ డాక్యుమెంటరీ, ఓ విదేశీయుడి పుస్తకం ద్వారా పార్వతి కథ ప్రపంచానికి తెలిసింది. ఐక్యరాజ్యసమితి నుంచి ‘గ్లోబల్‌ 500- రోల్‌ ఆఫ్‌ ఆనర్‌’ సహా ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఏనుగుల శిక్షకులకు సెలవుండదు. వాటితో కలిసి జీవించడమే. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలూ పోతాయి. కానీ ఆవిడ వాటికేమీ భయపడరు. వాటికోసం భర్తకి దూరమైనా, అడవుల్లో ఓ చిన్న టెంట్‌లో జీవితం గడిపేస్తున్నా ఏనుగులే తన ప్రపంచమంటారు. ఆ సేవకి గుర్తింపే తాజా పద్మశ్రీ పురస్కారం! పొలిటికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన పార్వతి, 5 భాషలు మాట్లాడగలరు.


మధుబని శిక్షణలో...

ధుబని చిత్రకళలో నాలుగు దశాబ్దాలుగా సేవలందిస్తున్న కళాకారిణి శాంతిదేవి పాశ్వాన్‌ను ఈ ఏడాది ‘పద్మ’ అవార్డు వరించింది. బిహార్‌, మిథిలాలోని మధుబని జిల్లాలో సీమా గ్రామంలో పుట్టారీమె. నిమ్న వర్గంలో పుట్టి... అవమానాలెన్నో ఎదుర్కొన్న ఈమె, తన కళానైపుణ్యాలతో ఇప్పుడు ప్రపంచస్థాయికి చేరుకొన్నారు. జీ20 సదస్సులో తన చిత్రకళను ప్రదర్శించే అర్హతను పొందారు. ‘మధుబని కళకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఓర్పు, సహనం ఉంటే చాలు. అద్భుతంగా మధుబని చిత్రాల్ని చిత్రించొచ్చు. రామాయణం వంటి కావ్యాలను చిత్రలేఖనం రూపంలో చెప్పొచ్చు. అపూర్వమైన ఈ కళను సంరక్షించి శాశ్వతం చేయాలనేది నా లక్ష్యం. నేటి తరానికి దీన్ని దగ్గరచేయడానికి శిక్షణనిస్తున్నా. ఇప్పటివరకు దాదాపు 20వేలమందికి పైగా ఇందులో శిక్షణ తీసుకొన్నా’రని చెబుతున్న శాంతిదేవి విదేశాల్లోనూ తన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. వర్క్‌షాపులు నిర్వహిస్తూ.. భారతీయ సంప్రదాయ చిత్రకళను ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. ఎక్కడ పుట్టామని కాదు.. ఎంత సాధించామన్నది ముఖ్యమని నిరూపిస్తున్నారీమె. ఈమె రూపొందించిన చిత్రలేఖనాలు అమెరికా, జపాన్‌, హాంకాంగ్‌ వంటిచోట్ల ప్రదర్శితమవుతున్నాయి. కళాభివృద్ధిలో ఈమె చేపడుతున్న కృషికి ‘తామ్రపాత్ర’, ‘అశోక్‌చక్ర’, ‘చేతనా సమితి’ వంటి జాతీయ, అంతర్జాతీయ  అవార్డులెన్నో అందుకున్నారీమె.


చక్మా చేనేతతో...

చేనేత కళలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు స్మృతిరేఖ చక్మా. అలనాటి చేనేత కళను నేటి తరానికీ అందిస్తున్నారు. వేల మంది గిరిజన మహిళలకు ఇందులో శిక్షణనిచ్చి ఉపాధిని కల్పించడంలో కృషి చేస్తున్నారు. ఈ సేవలకుగాను ఈ ఏడాది ఈమెను ‘పద్మ’ అవార్డు వరించింది. త్రిపురలోని అగర్తలాలో చక్మా గిరిజన జాతిలో పుట్టారీమె. తరతరాలుగా వస్తున్న సంప్రదాయ చక్మా చేనేత కళపై స్మృతికి బాల్యంలో అంతగా ఆసక్తి లేదు. ‘ఇంట్లో నానమ్మ, అమ్మ సమయం దొరికినప్పుడల్లా మగ్గంపై కూర్చునేవారు. నాకంతగా శ్రద్ధ ఉండేది కాదు. దీంతో అమ్మ తరచూ కోప్పడేది. అయితే పదోతరగతి తర్వాత ఆసక్తి మొదలైంది. ఛాలెంజ్‌గా తీసుకొని, నానమ్మ నేసే రకరకాల డిజైన్లన్నీ మగ్గంపై నేసి చూపించి అమ్మను ఆశ్చర్యపరిచా. అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేద’ంటారు స్మృతి. అతి తక్కువ కాలంలోనే  నైపుణ్యాలు పెంచుకొని సొంతంగా పలురకాల డిజైన్లనూ ఆవిష్కరించారీమె. అయిదు దశాబ్దాలుగా ఈ కళలో ఆమె ప్రదర్శిస్తున్న నైపుణ్యం, అందిస్తున్న సేవల కారణంగా రాష్ట్రపతి నుంచి ‘మాస్టర్‌ వీవర్‌’ అవార్డు సహా ‘సూత్రకార్‌ సమ్మాన్‌’, ‘సంత్‌ కబీర్‌’ వంటి పురస్కారాలెన్నో అందుకొన్నారు. ప్రముఖుల ప్రశంసలనూ పొందారు. శాలువాలు, చీరలు తదితర వస్త్రాలపై జామెట్రిక్‌ మోటిఫ్‌లు తీర్చిదిద్దడం ఈమె ప్రత్యేకత. బుద్ధుడితోపాటు ప్రముఖ నాయకుల రూపాలను నేతలో ప్రతిఫలించేలా చేశారు. నూలుకు ఈమె వినియోగించే రంగులన్నీ వేర్లు, విత్తనాలు, మూలికలు, ఆకుల నుంచి తీసిన సహజ వర్ణాలే. ‘ఉజెయా జాధా’ పేరుతో గిరిజన మహిళలకూ.. శిక్షణనిచ్చి ఉపాధి పొందేలా మార్గనిర్దేశం చేస్తున్నారు 63 ఏళ్ల స్మృతి.


ఆది తెగ మూలికలతో...

రుణాచల్‌ ప్రదేశ్‌కి చెందిన మూలికావైద్య నిపుణురాలు యనుంగ్‌ జమోహ్‌ లెగోను పద్మశ్రీ వరించింది. ‘ఆది తెగ’ సంప్రదాయ మూలికా వైద్య వ్యవస్థను పునరుద్ధరించినందుకే ఈ ఘనత దక్కింది. ‘ఆది క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌’గా పిలిచే యనుంగ్‌ది తూర్పు సియాంగ్‌లోని మారుమూల గిరిజన పల్లె. అసోం విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశారు యనుంగ్‌. ఆమె తల్లి సంప్రదాయ వైద్యం చేసేవారు. తండ్రి సామాజిక కార్యకర్త. వారి లక్షణాలే పుణికి పుచ్చుకున్నారేమో...ఎవరికి ఏ కష్టమొచ్చినా తక్షణం స్పందించే గుణం ఆమెను మూలికా వైద్యంపై దృష్టి సారించేలా చేసింది. ‘ఎంతో ఆరోగ్యంగా ఉండే మా పూర్వికుల జీవన విధానాలు, ఎలాంటి అనారోగ్యాన్నైనా తరిమికొట్టే ఔషధ మూలికా చికిత్స కనుమరుగవుతుండటం గమనించా. దీన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నా’ అంటారామె. ఇందుకోసం ఔషధ మూలికల్ని సేకరించడం మాత్రమే సరిపోదని భావించారు. ప్రతి ఇంటా హెర్బల్‌ కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటుకి కృషి చేశారు. వివిధ స్వయం సహాయక బృందాలతో కలిసి పనిచేశారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఏటా 5000కు పైగా ఔషధ మొక్కలను ఇంటి తోటలుగా పెంచాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఆమె భర్త గుమిన్‌లెగో వ్యవసాయ కార్మికుడు. వీరికి నలుగురు పిల్లలు. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సవాళ్లు వేధిస్తున్నా... పదమూడేళ్లుగా తన ప్రయాణాన్ని ఆపలేదామె. పదివేలమందికిపైగా వైద్య సాయం చేశారు. లక్షల మంది ప్రజలకు ఔషధ మూలికల గురించి అవగాహన కల్పించారు. ఈ సేవలే ఆమెకీ పురస్కారాన్ని అందించాయి.


పాతిక వేలకుపైగా సర్జరీలతో...

చిన్నప్పుడు కాలు బయట పెట్టాలంటే చాలా ఆలోచించేవారు ప్రేమా ధనరాజ్‌! తన రూపాన్ని చూసి వెక్కిరించేవారు కొందరైతే, భయపడేవారు మరికొందరు. బెంగళూరుకు చెందిన ఈమె ఎనిమిదేళ్ల వయసులో అనుకోకుండా అగ్ని ప్రమాదానికి గురయ్యారు. బతకడమే కష్టమనుకున్నారంతా. ముఖమంతా కాలిపోయింది. మాట కూడా రాలేదు. ‘ఈసారి తప్పక బాగవుతావు’ అంటే నొప్పిని భరించి మరీ ఒకదాని తర్వాత మరొకటి 12 శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. కానీ రూపంలో పెద్దగా మార్పులేదు. బతకడమే దండగ అనుకుంటున్న ప్రేమను ఆమె తల్లి, చికిత్స చేసిన డాక్టర్‌ ప్రోత్సహించారు. వారి సాయంతో ఆత్మవిశ్వాసం పెంచుకొని తిరిగి చదువు ప్రారంభించారు. అమ్మ కోరిక మేరకు వైద్యురాలవ్వాలి, తనలాంటి వారికి సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రేమ. ప్లాస్టిక్‌ సర్జరీలో ఎండీ చేసి, తను చికిత్స పొందిన వైద్యశాల, వెల్లూరు సీఎంసీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి అధిపతి అయ్యారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రేమ... పాతిక వేలకుపైగా సర్జరీలు చేశారు. ‘అగ్నిరక్ష’ ప్రారంభించి అగ్ని ప్రమాద బాధితులకు చికిత్సలు చేయడమే కాదు, తిరిగి ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేస్తున్నారామె. కొందరు బాధితులను వలంటీర్లుగా చేర్చుకొని ఉపాధినీ చూపిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగానే 72ఏళ్ల ప్రేమను... పద్మశ్రీ వరించింది.


నారియల్‌ అమ్మ...

వినూత్న పద్ధతులతో సేంద్రియ వ్యవసాయాన్ని చేయటమే కాదు...చుట్టు పక్కల వారినీ అదే మార్గంలో నడిపిస్తున్నారు సౌత్‌ అండమాన్‌కు చెందిన 69ఏళ్ల కె. చెల్లమ్మాల్‌. తన పది ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ అంతరపంటగా అల్లం, అరటి, లవంగాలు, అనాస వంటి వాటినీ పండిస్తున్నారు. రెండు హెక్టార్లలో కొబ్బరి మొక్కలతో పాటు 460 రకాల తాటిచెట్లనూ సాగు చేస్తున్నారు. వాటిని తెగుళ్ల బారి నుంచి రక్షించుకోవటానికి వినూత్నమైన మార్గాలను కనిపెట్టారు. అలా ఏడాదిలో 27వేలకు పైగా కొబ్బరికాయలను పండించారు. అక్కడ ఉండే మరో 150 మంది రైతులూ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లేలా ప్రోత్సహించారామె. అక్కడి వాళ్లు చెల్లమ్మాల్‌ను ప్రేమగా నారియల్‌ అమ్మ అని పిలుచుకుంటారు. నిత్యం కొత్త పరిష్కారాలు అన్వేషిస్తూ ఐదు దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తోన్న ఈమెను ఈ ఏడాది పద్మశ్రీ వరించింది. అయితే సేంద్రియ సాగులో ఎన్నో సృజనాత్మక పద్ధతులకు శ్రీకారం చుట్టిన చెల్లమ్మాల్‌ చదివింది ఆరో తరగతే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్