అంతవరకూ అలసిపోను!

ఏడు కోట్ల మందికి కంటి పరీక్షలు... అరకోటిమందికి శస్త్రచికిత్సలు... 160 దేశాలకు ఎగుమతవుతోన్న నేత్ర సంరక్షణ ఉత్పత్తులు... సాధారణ పల్లె యువతులే అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా వైద్య నిపుణులుగా మారుతున్న వైనం... డాక్టర్‌ జి. నాచ్చియార్‌ సంకల్ప ఫలాల్లో ఇవి మచ్చుకు కొన్నే. ‘అరవింద్‌ ఐకేర్‌ సిస్టమ్‌’ని ముందుండి నడిపిస్తున్న నాచ్చియార్‌ పద్మశ్రీ అందుకున్న సందర్భంగా పంచుకున్న అనుభవాలివి.

Updated : 31 Jan 2024 07:26 IST

ఏడు కోట్ల మందికి కంటి పరీక్షలు... అరకోటిమందికి శస్త్రచికిత్సలు... 160 దేశాలకు ఎగుమతవుతోన్న నేత్ర సంరక్షణ ఉత్పత్తులు... సాధారణ పల్లె యువతులే అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా వైద్య నిపుణులుగా మారుతున్న వైనం... డాక్టర్‌ జి. నాచ్చియార్‌ సంకల్ప ఫలాల్లో ఇవి మచ్చుకు కొన్నే. ‘అరవింద్‌ ఐకేర్‌ సిస్టమ్‌’ని ముందుండి నడిపిస్తున్న నాచ్చియార్‌ పద్మశ్రీ అందుకున్న సందర్భంగా పంచుకున్న అనుభవాలివి...

‘చీకటి నిండిన కళ్లలో వెలుగులు నింపాలనే సంకల్పం’...  తమిళనాడులోని మా సొంతూరు వడమలాపురంలో మొదలైంది. మాది రైతు కుటుంబం. చిన్నతనంలోనే నాన్నని కోల్పోవడంతో... అన్నయ్య గోవిందప్ప వెంకటస్వామే అన్నీ అయి పెంచారు. మొదట్లో పిల్లల డాక్టర్‌ అవ్వాలనేది నా కల. ఓ రోజు అన్నయ్య నన్ను పిలిచి.. ‘నీతోపాటు చదువుకోవాల్సిన ఆ పిల్లలు.. చూపులేక ఎలా కర్రల సాయంతో నడుస్తున్నారో చూశావా? నువ్వు ఆఫ్తల్మాలజిస్ట్‌ అయితే వాళ్ల కళ్లల్లో వెలుగు నింపొచ్చు’ అన్నారు. ఆయనా కంటి వైద్య నిపుణుడే. ‘డాక్టర్‌ వి’గా పేరొందిన ప్రజా వైద్యుడాయన. అలా అన్నయ్య సలహాతో... ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ చేశా. చికాగో వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. అప్పటికే అన్నయ్య ఆధ్వర్యంలో 12 పడకల అరవింద్‌ ఐ ఆసుపత్రి నడుస్తోంది. లక్షలమంది అంధత్వంతో బాధపడుతుంటే మా ప్రయత్నం చిన్నదనిపించింది నాకు. అందుకే కంటి-మెదడు సమస్యల అధ్యయనం కోసం హార్వర్డ్‌ యూనివర్సిటీకెళ్లి న్యూరో ఆఫ్తల్మాలజీలో ఫెలోషిప్‌ చేశా. దేశంలోనే తొలి న్యూరో- ఆఫ్తల్మాలజిస్ట్‌ని నేను.

మహిళా సైన్యంతో...

గ్రామాల్లో చూపులేనివారు లక్షల్లో ఉన్నారు. మా సిబ్బంది చూస్తే తక్కువ. అప్పుడే నాకు పారామెడికల్‌ ప్రోగ్రామ్‌ ఆలోచన వచ్చింది. పెద్ద చదువులు చదువుకునే స్థోమతలేక ఇంటిపట్టునే ఉన్న యువతులని నా బలంగా మార్చుకోవాలనుకున్నా. అంధత్వంపై మేం చేస్తోన్న పోరాట యజ్ఞంలో భాగమవ్వాలని వాళ్లకు పిలుపునిచ్చా. మరో పక్క ఆసుపత్రులూ, అనుబంధ పరీక్షా కేంద్రాలూ పెంచుకుంటూ అందుకనుగుణంగా ఏటా 500మంది యువతులకు ఉద్యోగాలిస్తూ వచ్చాను. ప్రతి ఒక్కరికీ రెండేళ్లు శిక్షణ అందించి, మిడ్‌లెవెల్‌ ఆఫ్తాల్మిక్‌ పర్సనల్‌ (ఎంఎల్‌ఓపీ)గా మార్చాం. వీరంతా కంటి పరీక్షలు, ఆపరేషన్లప్పుడు సహకరిస్తారు. గ్రామాల్లో క్యాంపులు పెట్టడం, అవగాహన పెంచడంలోనూ వీళ్లే కీలకం. అలా తమిళనాడు, ఏపీల్లో 14 స్పెషాలిటీ ఆసుపత్రుల్నీ, ప్రపంచవ్యాప్తంగా 400 కంటిపరీక్ష కేంద్రాల్నీ తెరిచాం. ఈ మొత్తం వ్యవస్థలో ఆరువేలమంది సిబ్బంది పనిచేస్తుంటే అందులో 90శాతం మహిళలున్నారు.

ఈ సైన్యమే మా అరవింద్‌ ఐకేర్‌ వ్యవస్థకి బలం, బలగం. రోగులని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మా ఆసుపత్రుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యం ఉచితం. ఇప్పటివరకూ 7.78కోట్ల మంది రోగుల్ని పరీక్షించి.. 87లక్షల మందికి సర్జరీలు చేశాం. అందులో 48శాతం మందికి ఉచిత, సబ్సిడీ విధానంలో శస్త్ర చికిత్సలు చేశాం. ప్రపంచవ్యాప్తంగా 4వేలమందికి పైగా కంటివైద్యులు మాతో కలిసి పనిచేస్తున్నారు. ‘అరో ల్యాబ్‌’ని ప్రారంభించి.. తక్కువ ధరకే కంటి సంరక్షణా ఉత్పత్తులు తయారుచేసి 160 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు పీజీ మొదలుకుని వివిధ కోర్సులు చేసే అవకాశమూ మా సంస్థలో ఉంది.

80 ఎకరాల్లో సాగు చేస్తూ

డైరెక్టర్‌గా ఓ పక్క సంస్థను నడిపిస్తూనే... మరోపక్క నాకిష్టమైన వ్యవసాయాన్నీ చేస్తున్నా. 80 ఎకరాల్లో సేంద్రియసాగు చేస్తూ ఇక్కడ పండిన పండ్లు, కూరగాయలు, ధాన్యాలని ఆసుపత్రి సిబ్బందికీ, క్యాంటీన్‌కీ పంపిస్తున్నా. సేంద్రియ సాగులో శిక్షణ ఇచ్చే ‘అరోఫామ్‌’నీ ఏర్పాటుచేశా. ఇక్కడా యువతులకే ప్రాధాన్యం. అన్నట్టు నా వయసు ఎంతో చెప్పనే లేదు కదూ! 84ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్నో కంటి ఆసుపత్రులు తెరవాలనీ, నాణ్యమైన ఆహార ఉత్పత్తుల్ని అందివ్వాలన్నదే నా లక్ష్యం. ఆ కల నెరవేరేవరకూ నేను అలసిపోను.

హిదాయతుల్లాహ్‌.బి, చెన్నై


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు,  సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్