ఆ ప్రశ్న.. ప్రపంచానికి పరిచయం చేసింది!

‘దూకేయ్‌’... వెనక నుంచి చిన్న అరుపు! ఆమె పాదం మాత్రం కదల్లేదు. రెండు, మూడుసార్లు వినిపించినా అదే పరిస్థితి. ఒంట్లో సన్నటి వణుకు, గుండెల్లో తెలియని భయం. కానీ... ఈ అవకాశం పోతే ఇంకెప్పటికీ సాధించలేను అనుకున్నాక ధైర్యం చేసింది. ఆ నిర్ణయం ఉమా మణికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడమే కాదు... ప్రపంచంలో ఆమెకో గుర్తింపునూ తెచ్చిపెట్టింది. ఇంతకీ ఈమెవరు?

Updated : 11 Mar 2024 05:24 IST

‘దూకేయ్‌’... వెనక నుంచి చిన్న అరుపు! ఆమె పాదం మాత్రం కదల్లేదు. రెండు, మూడుసార్లు వినిపించినా అదే పరిస్థితి. ఒంట్లో సన్నటి వణుకు, గుండెల్లో తెలియని భయం. కానీ... ఈ అవకాశం పోతే ఇంకెప్పటికీ సాధించలేను అనుకున్నాక ధైర్యం చేసింది. ఆ నిర్ణయం ఉమా మణికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడమే కాదు... ప్రపంచంలో ఆమెకో గుర్తింపునూ తెచ్చిపెట్టింది. ఇంతకీ ఈమెవరు?

‘నాకోసం నేనేదైనా చేయాలనుకుంటున్నా’ ఉమా మణి ఈ మాట అన్నప్పుడు ఇంట్లోవాళ్లంతా ఆశ్చర్యపోయారు. అప్పటికి ఆమె వయసు 45 మరి! ‘ఏదైనా చేయడానికి ఈ వయసేమీ పెద్ద అడ్డంకి కాదే’ అనిపించినా వాళ్లకిది అరుదైన సంఘటనే. చెన్నైకి చెందిన ఉమది సంప్రదాయ కుటుంబం. సాహిత్యంలో ఉన్నత చదువులు చదివినా... ‘ఆడపిల్లలంటే పుట్టినవాళ్లకి నాలుగు అక్షరాలు నేర్పిస్తూ, ఇంట్లోవాళ్ల బాగోగులు చూసుకుంటే చాల’న్న ధోరణే వాళ్లది. మహిళల కెరియర్‌కు సంబంధించిన ప్రస్తావనా ఇంట్లో ఉండదు. దీంతో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టారు ఉమ. భర్త మాల్దీవుల్లో డాక్టర్‌. దీంతో మకాం అక్కడికి మార్చారు. ఉమకి చిన్నతనంలో పెయింటింగ్‌ అంటే ఇష్టం. నేర్చుకుందామని ఉన్నా... ఇంట్లోవాళ్లు వారించడంతో ఆగిపోయారామె. భర్త, పిల్లలకు అన్నీ సమకూర్చడం, వారికోసం ప్రయాణాలు... ఇలాగే సాగిందామె జీవితం. పిల్లలు పైచదువులకు దూరప్రాంతాలకు వెళ్లాక ‘నాకోసం నేనేం చేసుకున్నా’ అన్న ఆలోచన మొదలైందామెలో. అప్పుడు పెయింటింగ్‌ కోర్సులో చేరతానంటే ఇంట్లోవాళ్లు ఆశ్చర్యపోయారు. ఆమె పట్టుదలను చూసి ప్రోత్సహించినా... తర్వాత అంతకన్నా పెద్ద షాకే ఇచ్చారామె.

సముద్రం రంగు తెలుసా?

నచ్చిన కళ కదా... త్వరగానే పట్టు సాధించారు ఉమ. తన సృజనాత్మకతనంతా అందమైన ప్రకృతి చిత్రాలుగా తీర్చిదిద్దడం మొదలుపెట్టారు. ఓసారి టీవీలో పగడపు దిబ్బలకు సంబంధించిన డాక్యుమెంటరీ చూసి మనసు పారేసుకున్నారు. వాటి గురించి తెలుకుంటున్న కొద్దీ ఆసక్తి పెరిగింది. ఆ అందాల్ని కాన్వాసుపై పెట్టడమే కాదు, ఎగ్జిబిషన్లనూ నిర్వహించి పేరు తెచ్చుకున్నారు. ఓసారి ఆమె కజిన్‌ ‘నీ జీవితంలో ఎప్పుడైనా పగడపు దిబ్బలను చూశావా? పోనీ సముద్రపు రంగైనా తెలుసా? పైకి నువ్వు ఊహించుకుంటున్న సముద్రలోకమంతా కాలుష్యంతో నిండిపోయింది. నువ్వేమో వాటికి రంగులద్ది చూపిస్తున్నావ్‌’ అన్నారట. ఆ మాట ఆవిడను ఆలోచనలో పడేసింది. అప్పుడే నేరుగా చూడటానికి డైవింగ్‌ నేర్చుకోవాలనుకున్నారు.

ఆ కృషికి...

‘అప్పటికి 49. ఆలోచన విని ఇంట్లోవాళ్లు షాకయ్యారు. నేను మాత్రం ఆనందంగా సముద్రంలోకి పయనమయ్యా. తీరా నీటిలోకి దూకే సమయానికి ముచ్చెమటలు పట్టాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చేయలేనన్న ఆలోచన వచ్చాక ధైర్యం తెచ్చుకున్నా. తొలిసారి చూసిన ఆ దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేను. కానీ తర్వాతే అసలు పరిస్థితి అర్థమైంది. కాలుష్యం, పరిశ్రమల వ్యర్థాలు, రసాయనాలు, నూనెల లీకేజీలు పగడపుదిబ్బలను క్షీణింపజేస్తున్నాయి. సముద్ర వాతావరణాన్ని రక్షించే, ఆ జీవుల జీవనాధారమైన పగడపు దిబ్బలు కనుమరుగవుతోంటే బాధేసింది. అందుకే వాటిపై అవగాహన తేవాలనుకున్నా’ననే ఉమ డైవింగ్‌లో సర్టిఫికేషన్‌ పొందారు. వాటి చిత్రాలతో, స్కూళ్లు, కాలేజీలు, సంస్థల్లో అవగాహన కలిగిస్తున్నారు. ఎగ్జిబిషన్లూ నిర్వహిస్తున్నారు. దీనికోసం శ్రీలంక, గోవా, ద్వీపాలు, గల్ఫ్‌... ఇలా ఎన్నో ప్రదేశాలూ తిరిగారు. చూపించడం ద్వారా మరింత ప్రభావవంతంగా అర్థమయ్యేలా చెప్పొచ్చు అనుకున్న ఆవిడ 2018లో ‘కోరల్‌ ఉమన్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీ నిర్మించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఎన్నో అవార్డులూ అందుకున్నారు. ఈమె కథ పుస్తకరూపంలోనూ వచ్చింది. మెరైన్‌ కన్జర్వేషన్‌ సంస్థతో కలిసి కృత్రిమ పగడపుదిబ్బలు నిర్మిస్తున్న ఉమ కృషికి గుర్తుగా సోనీ బీబీసీ ఎర్త్‌ తాజాగా ‘ఎర్త్‌ ఛాంపియన్‌’గా ప్రకటించింది.

‘‘బామ్మవి కావాల్సిన వయసులో ఏంటీ సాహసాలు. కాళ్లు విరగ్గొట్టుకోగలవు జాగ్రత్త’ అన్న సలహాలొస్తాయి. కానీ నేను భయపడను. సముద్రాలు కార్బన్‌డయాక్సైడ్‌ను తీసుకొని మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. చెత్తను వదిలించుకుంటున్నాం అనుకుంటూ మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. దాన్ని ఆపాలనే నా ప్రయత్నం’ అంటోన్న ఉమ ప్రయాణం... ఎందరికో స్ఫూర్తిదాయకమే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్