అక్కడ లావుగా ఉండి తీరాల్సిందే!

ప్రపంచం అంతా అందం అంటే సన్నగా మెరుపు తీగలా ఉండటమే అని నమ్ముతుంటే... ఒక్క మారిటేనియన్ల తీరు మాత్రం వేరుగా ఉంది. వాళ్ల దృష్టిలో అందం అంటే బొద్దుగా ఉండటమే! వీళ్లు మహిళలు లావుగా ఉండటాన్ని ఎంతగా ప్రోత్సహిస్తున్నారంటే... ఆ దేశానికే ఇదో పెద్ద సమస్య అయి కూర్చుంది.

Published : 27 Mar 2024 01:17 IST

ప్రపంచం అంతా అందం అంటే సన్నగా మెరుపు తీగలా ఉండటమే అని నమ్ముతుంటే... ఒక్క మారిటేనియన్ల తీరు మాత్రం వేరుగా ఉంది. వాళ్ల దృష్టిలో అందం అంటే బొద్దుగా ఉండటమే! వీళ్లు మహిళలు లావుగా ఉండటాన్ని ఎంతగా ప్రోత్సహిస్తున్నారంటే... ఆ దేశానికే ఇదో పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆఖరికి ప్రభుత్వం, ఎన్జీవోలు కూడా ఈ దురాచారానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేస్తున్నాయి. మారిటేనియా ఆఫ్రికాలో 11వ అతిపెద్ద దేశం. ఇక్కడ ఆడపిల్లలు చిన్నగా ఉన్నప్పట్నుంచే బరువు పెరిగేలా తల్లులు, సమాజం కూడా బలవంతంగా ప్రయత్నిస్తారు. ఈ పద్ధతిని లెబ్లో లేదా గాలేజ్‌ అంటారు. కొన్ని దేశాల్లో బాతులకు బలవంతంగా ఆహారమిచ్చి అవి విపరీతమైన బరువు పెరిగేలా చేస్తారు. ఆ తరవాత వాటి నుంచి కాలేయాన్ని సేకరించి, ఇష్టంగా తింటారు. ఈ పద్ధతిని గాలేజ్‌ లేదా ఫోగ్రాస్‌ అంటారు. ఆ బాతులకి తినిపించినట్టే ఇక్కడ ఆడపిల్లలకు కూడా వద్దు మొర్రో అన్నా... కూరి, కూరి తినిపిస్తారు. ఒంటెపాలు, మిల్లెట్లు కలిపి ‘బసి’ అనే ప్రత్యేక ఆహారం ఇస్తారు. వాళ్ల లెక్క ప్రకారం రోజుకి 16000 కెలొరీలు అందాల్సిందే. అలా తినిపించడం తల్లుల బాధ్యతే. ఆమెకి చేతకాకపోయినా, పిల్లలు సన్నగా ఉన్నారనిపించినా ఊళ్లోని ‘ఫ్యాట్‌ ఫార్మ్స్‌’కి పంపిస్తారు. అక్కడ ప్రత్యేకించి కొంతమంది తినిపించడానికి ఉంటారు.

వీళ్లు కర్రల మధ్య కాళ్లు పెట్టి, గిల్లి, కొట్టి తినిపిస్తారు. ఇంతకీ ఎందుకు ఇంత బలవంతంగా తినిపిస్తారో తెలుసా? ‘మంచంపై ఎక్కువ స్థలం ఆక్రమించిన అమ్మాయే మగాడి గుండెనూ ఆక్రమిస్తుంద’ని అక్కడి సామెత. లావుగా ఉండటాన్ని ఆర్థిక స్థోమతగా భావిస్తారు వీళ్లు. పెళ్లితో ఈ పద్ధతి ఆగిపోతుందా అంటే ఆగదు. అప్పుడు సన్నబడినా భర్త పోషించడం లేదు అన్న చెడ్డపేరు వస్తుందట. అందుకని ఆ బరువు కొనసాగాల్సిందే. ఆ దేశంలో 61 శాతం మంది ఆడవాళ్లు ఈ లెబ్లో ఆచారానికి బలైనవాళ్లే. ఇక్కడ 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తారు. ఆ వెంటనే పిల్లలు. బరువు, బాల్య వివాహాల కారణంగా ఇక్కడి మహిళలు గుండె   జబ్బులు, నిద్రలేమి, క్యాన్సర్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికితోడు ఒంటెలు పాలివ్వడానికి వాడే హార్మోన్లను కూడా ఇక్కడి పిల్లలకు ఇవ్వడంతో సమస్య తీవ్రమయ్యింది. దాంతో ఈ లెబ్లో ఆచారానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం చేసింది. ఎన్జీవోలూ పోరాటం చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొంతమంది ముందుకొచ్చి సన్నబడి, జీన్స్‌ ధరించాలని కలలు కంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్