అప్పుడు అలా... ఇప్పుడేమో ఇలా!

నాదో విచిత్రమైన పరిస్థితి. ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు తలెత్తడంతో ఎనిమిదో నెల రాగానే సెలవుపెట్టా. బిడ్డకు ఆరు నెలలొచ్చాక తిరిగొస్తే సహోద్యోగులు ‘నీకేం హాయిగా ఎక్కువ సెలవులు తీసుకున్నావ్‌.

Updated : 28 Feb 2024 14:28 IST

నాదో విచిత్రమైన పరిస్థితి. ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు తలెత్తడంతో ఎనిమిదో నెల రాగానే సెలవుపెట్టా. బిడ్డకు ఆరు నెలలొచ్చాక తిరిగొస్తే సహోద్యోగులు ‘నీకేం హాయిగా ఎక్కువ సెలవులు తీసుకున్నావ్‌. మాకే పని భార’మని పదే పదే అనేవారు. అది నాలో గిల్ట్‌ని కలిగించింది. దాంతో బాబుకి బాగోకపోయినా అమ్మను వాడి దగ్గరుంచి, ఆఫీసుకి వచ్చా. ఇప్పుడేమో ‘ఈమెకు కెరియరే ముఖ్యం. బిడ్డ గురించి పట్టించుకోవట్లేదు’ అంటున్నారు. రెండు విధాలుగా వాళ్లే మాట్లాడుతున్నారు. అసలు నేనేం చేయాలి? ఎలా స్పందించాలి?

ఓ సోదరి

ఉద్యోగం చేసే అమ్మలది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇల్లు, ఆఫీసులను సమన్వయం చేసుకోలేక చాలా ఇబ్బంది పడాలి. దీనికితోడు గిల్టీనెస్‌, నలుగురూ అనే మాటలు శారీరకంగానే కాదు, మానసికంగానూ అలసిపోయేలా చేస్తాయి. ఆఫీసులో ఎంత సాధించినా, ఇంట్లో ఎంత ప్రేమ కురిపించినా ఏదో వెలితి కనిపిస్తూనే ఉంటుంది. ఎంత ప్రయత్నించినా సమన్వయ లోపం కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి, పూర్తిగా సమన్వయం సాధ్యం కాదన్న విషయాన్ని ముందు గ్రహించండి. పరిస్థితిని బట్టి, ఆ క్షణం దేనికి ప్రాధాన్యమివ్వాలో ఎంచుకోవడమే మీ చేతిలో ఉన్న పని. ఇక చుట్టూ ఉండేవాళ్లు అనే మాటలంటారా? మీరెంత ప్రయత్నించినా అవి వస్తూనే ఉంటాయి. పని చేస్తేనేమో కుటుంబాన్ని వదిలేశారంటారు. కుటుంబానికి మీ అవసరం ఉండి, సెలవు తీసుకుంటే కెరియర్‌ పరంగా నిబద్ధత లేదంటారు. ఇలాంటివారితో గొడవపడ్డా, సున్నితంగా వ్యవహరించినా సమస్యే. ముందు వాళ్ల గురించి పట్టించుకోవడం మాని, మీ ప్రాధమ్యాలను ఎంచుకోండి. ఆ మాటలను మనసుకు తీసుకొని, మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వెళుతోంటే మిగిలేది అలసటే. ఇంకా... ఇల్లు, ఆఫీసే కాదు మీకంటూ సమయం కూడా కావాలి. దాని మీదా దృష్టిపెట్టండి. అప్పుడే మంచి లీడర్‌, గృహిణి, అమ్మగా గెలవగలుగుతారు. మరోసారి చెబుతున్నా ఉద్యోగం చేసే అమ్మల పని ఎప్పుడూ కష్టమే. అయితే ఇది మీ బలాలు, పట్టుదల, పోరాడే శక్తిని బయటపెట్టే అవకాశం కూడా. కాబట్టి, కుంగిపోక తలెత్తుకొని, సానుకూలంగా సాగిపోండి. అప్పుడే ఇవేమీ మీ మీద ప్రభావం చూపలేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్