‘క్యాట్‌ ఐ’ కళ్లద్దాల సృష్టికర్త ఎవరో తెలుసా?

 ‘క్యాట్ ఐ’ గ్లాసెస్ ఎన్నో ఏళ్ల నుంచీ ఫ్యాషన్ ప్రపంచంలో రాజ్యమేలుతున్నాయి. కళ్లద్దాల్లో ఎన్ని కొత్త కొత్త డిజైన్లు వస్తున్నప్పటికీ ఇప్పటికీ వీటి హవా తగ్గలేదు. సినీ తారల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు ఎంతోమంది వివిధ ఈవెంట్లలో వీటిని ధరించి హొయలు పోతుంటారు. అయితే ఈ కళ్లద్దాలను దాదాపు వందేళ్ల క్రితమే రూపొందించారన్న విషయం తెలుసా?

Updated : 04 Aug 2023 21:24 IST

ఫ్యాషన్ విషయంలో అమ్మాయిలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆపాదమస్తకం ఫ్యాషనబుల్‌గా ఉండాలనుకుంటారు. కళ్లద్దాల నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో ప్రత్యేకించి కళ్లద్దాల గురించే తీసుకుంటే -  ‘క్యాట్ ఐ’ గ్లాసెస్ ఎన్నో ఏళ్ల నుంచీ ఫ్యాషన్ ప్రపంచంలో రాజ్యమేలుతున్నాయి. కళ్లద్దాల్లో ఎన్ని కొత్త కొత్త డిజైన్లు వస్తున్నప్పటికీ ఇప్పటికీ వీటి హవా తగ్గలేదు. సినీ తారల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు ఎంతోమంది వివిధ ఈవెంట్లలో వీటిని ధరించి హొయలు పోతుంటారు. అయితే ఈ కళ్లద్దాలను దాదాపు వందేళ్ల క్రితమే రూపొందించారన్న విషయం తెలుసా? అందులోనూ వీటిని డిజైన్‌ చేసింది ఓ మహిళే కావడం విశేషం. అమెరికాకు చెందిన అల్టినా స్కినాసి ఈ కళ్లద్దాలను డిజైన్‌ చేశారు. నేడు ఆమె 116వ జయంతి. ఈ సందర్భంగా గూగుల్‌ ప్రత్యేకంగా డూడుల్ రూపొందించింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి మరిన్ని వివరాలు.. మీ కోసం!

(Photo: Wikipedia)

అల్టినా ఆగస్టు 4, 1907లో న్యూయార్క్‌లో జన్మించారు.

అల్టినాకు చిన్నప్పట్నుంచి ఆర్ట్స్‌ అంటే మక్కువ. అందుకే ఆమె డిగ్రీ పూర్తి కాగానే పెయింటింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి ప్యారిస్ వెళ్లారు. తిరిగి న్యూయార్క్‌కు వచ్చిన ఆమె ‘The Art Students League’లో చేరారు.

అల్టినా మొదట ‘విండో డ్రెస్సర్‌’గా కెరీర్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే సాల్వడార్ డాలీ, జార్జ్ గ్రోజ్ వంటి ప్రముఖ ఆర్టిస్టులతో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. వారి సూచనలతో తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నారు.

ఓరోజు కళ్లద్దాలు తీసుకోవడానికి అల్టినా స్టోర్‌కు వెళ్లారు. అయితే మహిళలు ఎంచుకోవడానికి తగినన్ని డిజైన్లు లేవని గుర్తించారు. ఈ క్రమంలో స్వతహాగా ఆర్టిస్టైన అల్టినా మహిళలను ఆకట్టుకునే కళ్లద్దాలను తనే సొంతంగా డిజైన్‌ చేద్దామనుకున్నారు. అనుకుందే తడవుగా ఆ దిశగా పరిశోధన మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా వివిధ డిజైన్లను పరిశీలించిన అల్టినా హర్లెక్విన్‌ మాస్క్‌లను స్ఫూర్తిగా తీసుకుని ‘హర్లెక్విన్‌ ఫ్రేమ్స్‌’ని రూపొందించారు. తర్వాత అవే కళ్లద్దాలు ‘క్యాట్‌ ఐ’గా ప్రాచుర్యం పొందాయి.

అల్టినా డిజైన్‌ చేసిన కళ్లద్దాలను మొదట చాలామంది రిటైలర్లు తిరస్కరించారట. దాంతో ఆమె ఓ స్థానిక రిటైలర్‌ను సంప్రదించారు. ఈ డిజైన్‌లో ఏదో గొప్పతనం ఉందని భావించి సదరు వ్యాపారి వాటిని ఉత్పత్తి చేయడానికి ముందుకొచ్చారట.

అల్టినా డిజైన్‌ చేసిన ‘క్యాట్‌ ఐ’ కళ్లద్దాలు కొద్దికాలంలోనే ప్రాచుర్యం పొందాయి. 1930, 1940 ల కాలంలో ఆమెరికా మహిళలు వీటిని విపరీతంగా ఆదరించారట. దాంతో ఈ డిజైన్ రూపొందించినందుకు గాను అల్టినాకు ఎన్నో ప్రశంసలు లభించాయి. 1939లో ఆమెకు ‘అమెరికన్‌ డిజైన్‌ అవార్డు’ కూడా దక్కింది. అలాగే ప్రముఖ మ్యాగజైన్లు వోగ్‌, లైఫ్‌లు కూడా ఆమెను ప్రశంసించాయి.

అల్టినా తన డిజైనింగ్‌ నైపుణ్యాలను కేవలం ‘ఐ గ్లాసెస్‌’కు మాత్రమే కాకుండా ఇతర ఉత్పత్తులకు కూడా విస్తరించారు. దుస్తులు, ఆభరణాలు, సెరామిక్స్.. మొదలైన ఉత్పత్తులకు కూడా ఆమె పలు డిజైన్లు అందించారు.

అల్టినా 1960లో నిర్మాతగా కూడా మారారు. ఆమె తన గురువు పేరిట ‘George Grosz's Interregnum’ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. దీనిని వెనిస్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అలాగే ఇది అకాడమీ అవార్డుకి సైతం నామినేట్ అవడం గమనార్హం.

అల్టినా 1995లో తన అనుభవాలకు పుస్తక రూపం ఇచ్చారు. ‘The Road I Have Traveled’ పేరుతో దీనిని పబ్లిష్‌ చేశారు. అల్టినా 1999లో మరణించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్