Updated : 02/11/2021 20:42 IST

బానిసగా చూశాడు.. బయటకొచ్చేశా..!

స్త్రీలు మగవారితో సమానంగా అంతరిక్షానికి కూడా చేరుకుంటున్న రోజులివి.. ప్రతి విషయంలోనూ మగవారితో పోటీపడుతూ తమ కెరీర్‌లో మరింత ఉన్నత స్థానాలను అందుకుంటున్నారు నేటి మహిళలు. కానీ ఇప్పటికీ కొంతమంది మగ మహారాజులు స్త్రీలంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితమని.. వారికి ఇంటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు లేదని భావిస్తున్నారు. అయితే ఇలాంటివాళ్లకు భయపడి మన జీవితాన్ని ఇంటికే పరిమితం చేయాల్సిన అవసరం లేదని చెబుతోందో అమ్మాయి.. తన అనుభవాన్ని జోడించి.. మనకు స్వేచ్ఛకు సంబంధించిన పాఠాన్ని చెప్పడానికి మన ముందుకొచ్చింది. తన కథేంటో తన మాటల్లోనే విందాం రండి..

'నేను చెప్పింది వింటావా? ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతావా?' కార్తీక్ అల్టిమేటంలాంటి ప్రశ్నకు ఆ క్షణం నా బుర్ర సమాధానాన్ని వెతకలేకపోతోంది. అసలీ ప్రశ్న ఎందుకు ఎదురైందో తెలియాలంటే నా గురించి మీకు తెలియాలి.. మాది నల్గొండ దగ్గర ఓ పల్లెటూరు. నాకు రెండేళ్లున్నప్పుడు.. మా అమ్మానాన్న హైదరాబాద్‌కి మారిపోయారు. నా తర్వాత ఓ చెల్లెలు.. ఇద్దరూ ఆడపిల్లలే అయినా నాన్న మగ పిల్లలకు ఏమాత్రం తక్కువ కాకుండా మమ్మల్ని పెంచారు. మా భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా పడేందుకు నాన్న సిద్ధంగా ఉండేవారు. చిన్నతనం నుంచీ మాకు ఆసక్తి ఉన్న పనులన్నీ చేయమనేవారు. అలా నాన్న ఇచ్చిన ధైర్యంతో నేను భరతనాట్యం, కరాటే నేర్చుకున్నా. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంటెక్‌లో చేరడానికి వేచి చూస్తున్న సమయంలో ఓ మంచి సంబంధం వచ్చిందంటూ నాన్న నన్ను అడిగారు. అబ్బాయిది ప్రభుత్వోద్యోగమని.. ఆస్తిపాస్తులు కూడా బాగా ఉన్నాయని.. మంచి సంబంధమని చెప్పడంతో పెళ్లయ్యాక డిస్టెన్స్‌లో చదువుకోవచ్చులే.. అన్న ఆలోచనతో సరేనన్నా..

పెళ్లిచూపులు సింపుల్‌గా జరిగిపోయాయి. వారం రోజుల్లోనే తాంబూలాలు కూడా తీసుకున్నారు. తాంబూలాల తర్వాత ఓసారి నాకు కాబోయే భర్త కార్తీక్‌తో నా మనసులోని మాటను పంచుకున్నా. 'పెళ్లయ్యాక నేను చదువుకోవాలనుకుంటున్నా.. ఒకవేళ మీకు ఆర్థికంగా ఇబ్బందిగా అనిపిస్తే నేనే ఉద్యోగం చేసుకుంటూ డిస్టెన్స్‌లో చదువుకుంటాను..' అని చెప్పాను. అయితే దీనికి తన నుంచి నాకు మౌనమే సమాధానంగా వచ్చింది. పదేపదే అడగ్గా.. నేను చదువుకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని.. కానీ వాళ్లింట్లో దానికి ఒప్పుకుంటారో లేదో అని ఆలోచిస్తున్నా..' అన్నాడు. చదువంటే నాకెంత ఇష్టమో తనకి చెప్పి ఇంట్లోవాళ్లని కన్విన్స్ చేయమని చెప్పాను. తనూ నాకు సాయం చేస్తానని చెప్పడంతో అర్థం చేసుకునే భర్త దొరికాడని ఆనందించా. ఆ ఆనందం కొన్నాళ్లేనని నాకు అప్పుడు తెలియలేదు.

*****

నాన్న ఇచ్చిన భారీ లాంఛనాలతో ఘనంగా నా పెళ్లి జరిగిపోయింది. పెళ్లయ్యాక ఓ నెల రోజులు బాగానే ఉంది. ఆ తర్వాతే నాకు అర్థమైంది అది ఇల్లు కాదు బందీఖానా అని.. ఆ ఇంట్లో ఆడవాళ్లకు ఏ హక్కూ ఉండదు. కనీసం ఏరోజు ఏం కూర వండాలో నిర్ణయించే హక్కు కూడా ఆడవాళ్లకు లేదు. మా మామగారు ఏ వంటకం చేయమంటే అదే ఇంట్లో వండాలి. అది మిగిలినవారికి ముఖ్యంగా ఆడవాళ్లకు ఇష్టం ఉన్నా.. లేకపోయినా అదే తినాలి.. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఎప్పుడూ కనీసం కూరగాయలు కొనడానికో.. షాపింగ్ కోసమనో బయటకు వెళ్లడం నేను చూడలేదు. వాళ్లకు కావాల్సినవన్నీ మగవాళ్లే తెచ్చి ఇంట్లో పడేస్తారు. ఇతరులకు నచ్చినవి వేసుకోవడం తప్ప వాళ్లకు మరో ఆప్షన్ లేదు. కనీసం భార్యాభర్తలు కలిసి ఎక్కడికైనా బయటకెళ్లిన సందర్భాలు ఎప్పుడూ లేవని మా తోటికోడలు చెబుతుంటే ఇంకా ఇలాంటి మనుషులు ఉన్నారా? అనిపించింది. క్రమంగా ఆ ఇంట్లో నాకు ప్రతి నిమిషం నరకంగా తోచడం ప్రారంభమైంది..

*****

ఎవరెలా ఉన్నా.. నా భర్త నన్ను బాగా చూసుకుంటారు. నాకు తోడు నిలుస్తారన్న నమ్మకం నాకుండేది. కానీ రోజురోజుకీ ఆయనలో మార్పు గమనించడం ప్రారంభించా. ప్రతి విషయానికీ తన అనుమతి తీసుకోవాలని చెప్పేవారు. చివరకు మా అమ్మానాన్నలతో ఫోన్ మాట్లాడాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిందేనట. పైగా అన్నింట్లోనూ తన మాటే చెల్లాలని పట్టుబట్టడం ఆయనకు అలవాటైపోయింది. నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆయన పెత్తనం నేను భరించలేకపోయేదాన్ని. భార్యంటే అణిగిమణిగి కాళ్ల దగ్గర బతకాలన్నది ఆయన సిద్ధాంతం. దీనికి నేను ఆయన్ని తప్పు పట్టలేను. చిన్నతనం నుంచి తను పెరిగిన వాతావరణం ఆయన్ని అలా ఆలోచించేలా చేస్తోంది. కానీ మా ఇంట్లో నాకిచ్చిన స్వేచ్ఛతో స్వతంత్రంగా పెరిగిన నేను ఇలాంటి పద్ధతిని భరించలేకపోయా.

నా ఉద్యోగం గురించి మాట్లాడమని కార్తీక్‌ని కాళ్లావేళ్లా పడి బతిమాలుకున్నా. మా అమ్మానాన్నలతో చెప్పించా. దీంతో ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నా.. ఇంట్లో పనుల్లోనూ సాయం చేస్తేనే అని రూల్ పెట్టారు. ఉదయాన్నే ఐదింటికి లేచి ఇంటిపనుల్లో ఆడవాళ్లకు సాయం చేసి ఎనిమిదింటికి ఆఫీస్‌కి వెళ్లి తిరిగి ఏడింటికి వచ్చి మళ్లీ ఇంట్లో పనులన్నీ చేసి పడుకునే సరికి రాత్రి పదకొండయ్యేది. అయినా నేను కోరుకున్న జీవితం ఇచ్చే ఆనందం ముందు ఈ కష్టం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కానీ నా జీతం కూడా తన చేతికే ఇవ్వాలని.. నాకేమైనా కావాలంటే తనని అడిగి తీసుకోవాలని కార్తీక్ రూల్ పెట్టడంతో ఇక నేను ఉద్యోగం చేసి ఏం ప్రయోజనమన్న ఆలోచన కూడా రావడం ప్రారంభమైంది. ఈ పరిణామాలతో మా ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. నేను ఇంతకుముందున్న పద్ధతిలోనే స్వేచ్ఛగా జీవించేందుకు నా నోరు తెరవడానికి నిర్ణయించుకున్నా. నా మీద ఆధిపత్యం కోసం కార్తీక్ ప్రయత్నించేవాడు. దీంతో తరచూ మా మధ్య గొడవలు జరిగేవి.

*****

చివరగా ఓరోజు గొడవ ముదిరి కార్తీక్ నాకు అల్టిమేటం జారీ చేశాడు. తన దృష్టిలో నాకు ఈ విషయాలన్నీ నేర్పేది మా అమ్మానాన్న కాబట్టి వారితో మాట్లాడడం ఆపేయాలి. ఉద్యోగం వల్లే నాకు పొగరు ఎక్కువైంది కాబట్టి అది మానేసి వాళ్ల అమ్మ, వదినల్లా ఇంట్లోనే ఉంటూ పనులు చూసుకోవాలి. ఇవీ తను నాకు పెట్టిన షరతులు. ఇవి పాటిస్తే ఇంట్లో ఉండు.. లేదంటే ఇంట్లోంచి వెళ్లిపో.. అంటూ చెప్పి వెళ్లిపోయాడు. జరిగిందంతా ఆలోచించిన నాకు మార్గం సుస్పష్టంగా తోచింది. ఒకవైపు ఇక్కడే ఉంటూ జీవితాంతం ఏ తప్పూ చేయకపోయినా ఈ జైలు జీవితం గడపాలి.. మరోవైపు విడాకులు తీసుకొని నా స్వేచ్ఛను నేను అనుభవించాలి. సమాజం ఏమంటుందా? అని ఆలోచించి నా జీవితాన్ని నరకం చేసుకోదల్చుకోలేదు. అందుకే విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నా. అమ్మానాన్నలు ముందు కాస్త భయపడ్డా నా నిర్ణయం మార్చుకోకపోవడంతో నాకు అండగా నిలిచారు. ఇప్పుడు తన నుంచి విడాకులు తీసుకొని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. పార్ట్‌టైం ఎంబీయే కోర్సులోనూ చేరాను. నా భవిష్యత్తును నాకు నచ్చినట్లుగా మలుచుకోగలనన్న నమ్మకం నాకుంది.

*****

ఇదంతా ఇలా మీ ముందుకు వచ్చి ఎందుకు చెబుతున్నా అంటే.. నాలాగా చాలామంది అమ్మాయిలు పెద్ద చదువులు చదువుకున్నా భర్త విధించిన ఆంక్షల చట్రంలో బందీలుగా మారి.. పలు ఇబ్బందులకు గురవుతూ బతుకీడుస్తున్నారు. సమాజం ఏమనుకుంటుందో అని మీకు మీరు శిక్ష వేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లంటే భార్యాభర్తలిద్దరూ సమానత్వంతో చేసే స్నేహంలాంటిది. ‘ఆడది బానిస మగవాడు యజమాని’ అని భావించేవాళ్లలో మార్పు రాకపోతే వారి అధీనంలో మిమ్మల్ని మీరు ఇబ్బందిపెట్టుకుంటూ కలిసి ఉండాల్సిన అవసరం లేదు. పెళ్లి బంధం మీ జీవితాన్ని ఆనందంగా మార్చాలే తప్ప దుఃఖం వైపు, బానిసత్వం వైపు తీసుకెళ్లకూడదు. అలా ఉంటే ఆ బంధాన్ని వదులుకొని ఈ సమాజానికి మిమ్మల్ని మీరు నిరూపించి చూపించడమే మంచిది. నా నిర్ణయం, నా ఆలోచనలు కరక్టే కదూ??


Advertisement

మరిన్ని