Published : 19/01/2022 16:08 IST

పాప్‌కార్న్ ఆరోగ్యానికీ మంచిదే..!

పాప్‌కార్న్.. పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతిఒక్కరూ ఇష్టపడే ఆహారపదార్థాల్లో ఇదీ ఒకటి. సినిమా అనగానే ఠక్కున గుర్తుకొచ్చే మంచి స్నాక్ ఐటమ్ కూడా. అయితే పాప్‌కార్న్ తినడం ద్వారా టైం పాస్ మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చట! ఈ క్రమంలో - అమెరికాలో ఏటా జనవరి ౧౯ని ‘నేషనల్ పాప్‌కార్న్ డే’గా  జరుపుకోవడం గమనార్హం. ఇంతకీ పాప్‌కార్న్ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి..

పాప్‌కార్న్.. అందరూ తినడానికి అమితంగా ఇష్టపడే స్నాక్ ఐటమ్. ముఖ్యంగా థియేటర్‌లో సినిమా చూసేటప్పుడు చాలామందికి ఇది చేతిలో ఉండాల్సిందే..! ఎక్కువగా టైంపాస్ కోసం తీసుకునే ఈ స్నాక్ ద్వారా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు సైతం కలుగుతాయంటున్నారు నిపుణులు. జొన్నల నుంచి తయారయ్యే ఈ పాప్‌కార్న్‌లో ఉండే పీచు, పాలిఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియం.. మొదలైనవన్నీ ఆరోగ్యానికి ఉపకరించేవేనట!

కొవ్వు స్థాయులు తగ్గిస్తుంది..

పాప్‌కార్న్‌లో ఉండే పీచు పదార్థాలు రక్తనాళాలు, ధమనుల గోడల్లో పేరుకుపోయిన కొవ్వును సమర్థంగా తగ్గిస్తాయి. తద్వారా శరీరంలోని కొవ్వు స్థాయుల్లో తగ్గుదల కనిపిస్తుంది. ఫలితంగా హృద్రోగ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి.

చక్కెర స్థాయులను నియంత్రిస్తూ..

మన శరీరంలో తగినంత పీచు పదార్థాలు ఉన్నప్పుడు అవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయులను క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి. ఫలితంగా డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అందుకే పాప్‌కార్న్ తినేవారితో పోలిస్తే తినని వారిలో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందట!

జీర్ణక్రియ సాఫీగా..

మన శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియ సాఫీగా సాగాలన్నా మనం తీసుకునే ఆహారంలో తగినన్ని పీచు పదార్థాలు ఉండడం తప్పనిసరి. అప్పుడే జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసి, మలబద్ధకం వంటి సమస్యలను దరి చేరనీయకుండా చేస్తుంది. పాప్‌కార్న్‌లో అధికస్థాయిలో ఉండే పీచు పదార్థాలు పేగుల పనితీరుని మెరుగుపరిచి జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.

బరువు తగ్గడానికి..

బరువు తగ్గాలనుకునే వారు ఏ స్నాక్స్ తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు.. ఆయా పదార్థాలు ఆహారంగా తీసుకుంటే తిరిగి బరువు పెరిగిపోతామేమో అనే భయమే అందుకు కారణం! అయితే బరువు తగ్గాలనుకునేవారు పాప్‌కార్న్ నిస్సందేహంగా తినవచ్చు. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే పీచుపదార్థాలు అధిక సమయం కడుపు నిండుగా అనిపించేలా చేయడం మాత్రమే కాకుండా ఆకలికి కారణమయ్యే గ్రెలిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి కాకుండా ఆపుతాయి. తద్వారా ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా తర్వాత కూడా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటాం. అలాగే ఒక కప్పు పాప్‌కార్న్‌లో 30 కెలొరీలు మాత్రమే ఉంటాయి కాబట్టి వీటిని ఎవరైనా ఆహారంగా తీసుకోవచ్చు.

ఎముకల ఎదుగుదలకు..

పాప్‌కార్న్లో ఉండే మాంగనీస్ మన శరీరంలో ఎముకల ఎదుగుదలకు ఉపకరించడమే కాదు.. వాటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలోనూ చక్కగా ఉపయోగపడుతుంది. ఫలితంగా ఆస్టియోపొరోసిస్, ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
వృద్ధాప్య ఛాయలు రానీయకుండా..

పాప్‌కార్న్‌లో ఉండే ఫ్రీ రాడికల్స్ వయసు పెరిగే కొద్దీ తలెత్తే సమస్యలను దరిచేరనీయకుండా చేస్తాయి. ముఖ్యంగా ముడతలు, దృష్టి లోపం, కండరాల బలహీనత, ఆస్టియోపొరోసిస్, అల్జీమర్స్, జుట్టు రాలిపోవడం.. మొదలైన సమస్యలకు ఇది చక్కని పరిష్కారంగా పని చేస్తుంది.

కావాల్సినంత ఇనుము కూడా..

* 28గ్రా|| పాప్‌కార్న్‌లో 0.9 మి||గ్రా|| ఇనుము ఉంటుంది. సాధారణంగా పురుషులకు రోజుకి 8 మి||గ్రా|| ఇనుము అవసరం అయితే మహిళలకు 18 మి||గ్రా|| అవసరం అవుతుంది. పాప్‌కార్న్ ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమయ్యే ఇనుముని కూడా సులభంగా పొందవచ్చు.

* వీటిలో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు కాబట్టి బరువు పెరుగుతుందనే భయం అవసరం లేదు.

* బంగాళాదుంప చిప్స్‌తో పోలిస్తే ఇందులో ప్రొటీన్, ఫాస్ఫరస్ అధిక స్థాయుల్లో ఉంటాయి. అంతేకాదు.. గుడ్లు, పాలకూరలో కంటే కూడా పాప్‌కార్న్‌లోనే వీటి స్థాయి ఎక్కువగా ఉంటుందట!

అవి మితంగానే..!

పాప్‌కార్న్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పాం కదాని అధిక మోతాదులో లాగించేసే ముందు అందులో మీరు రుచి కోసం ఏమేం వేస్తున్నారో కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. ముఖ్యంగా పాప్‌కార్న్ తయారుచేయడానికి ఉపయోగించే నూనె, వాటికి మరింత రుచి రావడానికి పైపైన జోడించే చీజ్, బటర్.. వంటి టాపింగ్స్.. ఇవన్నీ చాలా మితంగానే ఉండాలి. అయితే పాప్‌కార్న్ ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు పొందాలనుకునేవారు మాత్రం ప్లెయిన్ పాప్‌కార్న్ తింటే సరిపోతుంది. ఒకవేళ షుగర్ ఉన్నట్లయితే వీటిని తినే ముందు ఎంత పరిమితి వరకు వాటిని పరిమితం చేయాలో ఒకసారి వైద్యుల్ని సంప్రదించి తెలుసుకోవాలి. ఆ తర్వాతే వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.


Advertisement

మరిన్ని