బరువు తగ్గించే ‘తామర గింజలు’!

తామర గింజలు.. ‘మఖానా’గా పిలుచుకునే ఈ గింజల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు.

Published : 23 Oct 2023 09:03 IST

తామర గింజలు.. ‘మఖానా’గా పిలుచుకునే ఈ గింజల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ గింజలు ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని కొందరు పచ్చిగానే తీసుకుంటే.. మరికొందరు వేయించుకొని, ఉడకబెట్టుకొని, కూరల్లో, స్వీట్లలో భాగం చేసుకుంటారు. ఎలా తీసుకున్నా.. తామర గింజలతో ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

బరువు తగ్గిస్తాయి!

క్యాలరీలు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతాం. అయితే మఖానాతో ఆ సమస్య లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనిలో క్యాలరీల శాతం తక్కువ! వీటిలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్‌.. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. ఫలితంగా ఆహారపు కోరికల్ని అదుపులో పెట్టుకోవచ్చు.. అధిక బరువునూ తగ్గించుకోవచ్చు.

ఆ సమస్యలు రాకుండా..!

మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్‌తో పాటు క్యాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రక్తహీనత, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తాయి.

ఈ గింజల్లోని మెగ్నీషియం నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

తామర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆర్థ్రైటిస్‌.. తదితర సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.

గ్లైసెమిక్‌ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. కాబట్టి మధుమేహ బాధితులకు ఇది మంచి ఆహారమని చెబుతున్నారు నిపుణులు.

కీళ్ల సమస్యలతో పాటు దంత సమస్యలతో బాధపడేవారు ఈ గింజలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం.. ఎముకలు, దంతాల్ని దృఢంగా మారుస్తాయి.

వీటిలోని క్యాల్షియం, ఐరన్ గర్భిణులకు మేలు చేస్తాయి. వారిలో రక్తహీనత సమస్య రాకుండా కాపాడతాయి.

మఖానాలో సోడియం తక్కువ.. పొటాషియం, మెగ్నీషియం.. వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. బీపీ ఉన్న వారు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

మఖానాలోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కేవలం ఆరోగ్యాన్నే కాదు.. మఖానాతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, ముడతలు రాకుండా ఉంటాయి.

ఎలా తీసుకోవాలి?

తామర గింజలను పచ్చిగానే తినచ్చు.. లేదంటే వేయించి, ఉడకబెట్టి.. సూప్స్‌, సలాడ్లు, వివిధ కూరల్లో, స్వీట్స్‌లోనూ భాగం చేసుకోవచ్చు. చాలామంది వీటిని కాల్చుకొని స్నాక్స్‌గా తీసుకోవడానికీ ఇష్టపడతారు. అయితే వీటిని వేయించే బదులు పచ్చిగా లేదా ఉడకబెట్టి తీసుకోవడం వల్లే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చంటున్నారు నిపుణులు. అయితే అలర్జీ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు, కడుపుబ్బరంతో బాధపడే వారు వీటిని దూరం పెట్టడమే మేలట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్