పని తీరు ఎలా ఉంది?

ఒక్కసారి ఉద్యోగ జీవితం ప్రారంభమైందంటే ఎక్కువ సమయం ఆఫీసులోనే గడిచిపోతుంటుంది. కాబట్టి ఆఫీసు జీవితం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. నిజానికి వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం రెండూ ఒకదాని పైన మరొకటి ఆధారపడి ఉంటాయి.

Published : 11 Oct 2023 12:21 IST

ఒక్కసారి ఉద్యోగ జీవితం ప్రారంభమైందంటే ఎక్కువ సమయం ఆఫీసులోనే గడిచిపోతుంటుంది. కాబట్టి ఆఫీసు జీవితం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం. నిజానికి వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం రెండూ ఒకదాని పైన మరొకటి ఆధారపడి ఉంటాయి. ఒకటి బాగుంటేనే మరోటి బాగుంటుంది. అయితే ఇది మన పని తీరు పైన కూడా ఆధారపడి ఉందంటున్నారు నిపుణులు. మరి మన పని తీరు బాగుందో లేదో తెలుసుకోవడమెలా..?ఇందుకు కొన్ని సంకేతాలున్నాయట.. మరి, అవేంటో తెలుసుకుందామా...

మీ అభిప్రాయాలు అడుగుతున్నారా..?

ఏ కంపెనీ అయినా సరే- పని చేసే చోట కొన్ని రాజకీయాలు మామూలే. వీటిలో భాగంగా కొంతమంది పని బాగా చేసినా పక్కవారికి ఎక్కడ గుర్తింపు వస్తుందేమోనన్న అసూయతో వారి లోపాలను ఎత్తి చూపిస్తుంటారు. కొంతమంది వ్యతిరేక ప్రచారాలు కూడా చేస్తుంటారు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు పని చేసే ప్రాజెక్టుకి సంబంధించి జరిగే ముఖ్యమైన చర్చలు, మీటింగ్స్‌లో మీకు ప్రాధాన్యమిస్తున్నారంటే మీ పనితీరు బాగున్నట్లే భావించాలి. ఇక సంస్థ తీసుకునే కీలక నిర్ణయాల్లో మీకు భాగస్వామ్యం లభించిందంటే మీకు ఎవరి ప్రశంసలు అవసరం లేదు.

తప్పుల్లేకుండా చేస్తున్నారా?

కొంతమంది మరొకరి సహాయం తీసుకోకుండా పని పూర్తి చేయలేరు. మరికొంతమంది సొంతంగా పని పూర్తి చేసినా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తుంటారు. ఇలాంటి వారు చేసే పనిని మరొకరు పరిశీలిస్తే కానీ పూర్తవదు. అందుకే పైఅధికారులు, మేనేజర్లు ఇలాంటి వారికి ముఖ్యమైన పనులు అప్పగించడానికి సంకోచిస్తుంటారు. కానీ, చాలా కొద్దిమంది మాత్రం సొంతంగా ఎలాంటి తప్పులూ లేకుండా అప్పగించిన పనులను పూర్తి చేస్తుంటారు. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లయితే మీ పని తీరు బాగున్నట్లే లెక్క!

ట్రబుల్‌ షూటరా?

పని చేసేటప్పుడు వివిధ రకాల సందేహాలు, సమస్యలు వస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి వారు తమ కంటే మెరుగ్గా పనిచేసే వారి దగ్గరకు వెడుతుంటారు. ఇలాంటి వ్యక్తులు సంస్థల్లో కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందుకే ఇలాంటి వారిని ‘ట్రబుల్‌ షూటర్’గా అభివర్ణిస్తుంటారు. మీరూ ఈ జాబితాలో ఉన్నారా? అయితే మీ పని తీరుకు ఎవరూ వంక పెట్టలేరు.

వాటిని మీకు అప్పగిస్తున్నారా?

మేనేజర్‌ లేదా బాస్‌ దగ్గరకు కొన్నిసార్లు కీలకమైన ప్రాజెక్టులు వస్తుంటాయి. కొన్ని ప్రాజెక్టులు సంస్థ పేరు, ప్రతిష్టలకు సంబంధించినవి ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే మామూలు కన్నా కాస్త ఎక్కువ శ్రమించడంతో పాటు వినూత్నంగా ఆలోచించాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులను అన్ని రకాల అర్హతలు ఉన్నవారికే అప్పగిస్తుంటారు. అందులో మీ పేరు ఉన్నట్లయితే పరోక్షంగా మీ పనిని మీ బాస్‌ ప్రశంసించినట్లే! మీ పని తీరు బాగున్నట్లే!

అయితే కొంతమంది ఉద్యోగులు ట్యాలెంట్ ఉంది కదాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. అయితే పనిలో నాణ్యత ఎంత ముఖ్యమో.. క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. మీకు యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోంది కదాని ఇష్టానుసారం ప్రవర్తించద్దు. ఇలా చేస్తే కెరీర్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్