Updated : 04/03/2022 19:23 IST

Women Cricket: ఉనికి చాటారు.. అంచనాలు పెంచేశారు!

క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫీవర్‌ మళ్లీ మొదలైంది.. అయితే ఈసారి ఆట అమ్మాయిలది! మొన్నటిదాకా జెంటిల్మెన్‌ గేమ్‌గా ముద్రపడిపోయిన క్రికెట్‌ను అమ్మాయిలు తమ ఆటతో తమ వైపు తిప్పుకున్నారు. తాము ఆడే ప్రతి మ్యాచ్‌నూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆస్వాదించేలా అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. పట్టుబట్టి బంధనాలు తెంచుకొని జెంటిల్మెన్‌ గేమ్‌ను కాస్తా లేడీస్‌ గేమ్‌గా మార్చేయడానికి ప్రయత్నిస్తున్నాయి మహిళా జట్లు. ‘మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌’ ఆరంభం, ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా.. మహిళల క్రికెట్‌ మహర్దశ వైపు అడుగులేసిన వైనాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం..!

అడుగడుగునా సవాళ్లే!

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 1745లో హంబుల్డన్, బ్రామ్లే జట్ల మధ్య తొలి మహిళా క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరువైపుల నుంచి పదకొండు మంది చొప్పున ఇంటి పనివాళ్లు ఆడటం విశేషం. అయితే అప్పట్నుంచి అంచెలంచెలుగా పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ ఆటను ఆడుతున్నా.. వాళ్లకు సరిసమానమైన ఆదరణ దక్కలేదనే చెప్పాలి. కానీ పట్టు వదలకుండా వివిధ దేశాల్లోని మహిళా క్రీడాకారిణులు చేసిన కృషే ఇప్పుడు తమ ఆటను క్రికెట్‌ ప్రేమికుల దగ్గర్నుంచి మేటి పురుష క్రికెటర్ల దాకా.. ప్రతి ఒక్కరూ ఆస్వాదించేందుకు కారణమైందని చెప్పచ్చు.

వివక్షను కాలరాసి!

ఆడవాళ్లు బలహీనులు.. శారీరకంగా ఎక్కువ కష్టపడలేరు.. ఇప్పటికీ చాలామందికి ఇలాంటి భావన ఉంటుంది. క్రికెట్‌ విషయంలోనూ దీన్నే సాకుగా తీసుకొని అడుగడుగునా వివక్షతోనే స్వాగతం పలికేవారు. 1976లో భారత మహిళల జట్టు వెస్టిండీస్ జట్టుతో తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. అయితే పురుషుల ఆటలోని నియమావళితో పోలిస్తే మహిళల క్రికెట్‌లోని నియమాలు స్త్రీల పట్ల ఉన్న వివక్షను ఎత్తిచూపేవని స్పష్టంగా అర్థమవుతుంది. పురుషులు ఐదు రోజులపాటు ఈ ఆటను ఆడితే.. మహిళలకు నాలుగు రోజులు మాత్రమే కేటాయించారు. పురుషుల ఆట స్థలం కంటే మహిళల ఆట స్థలాన్ని కుదించి మగవారి కంటే స్త్రీలు బలహీనులు అని చెప్పకనే చెప్పారు. మరోవైపు పురుషులకు బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణాలైతే.. మహిళలతో సాధారణ రైలు ప్రయాణాలు చేయించేవారు. ఇక పురుషులతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు ఇచ్చే జీతం, కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం కూడా తక్కువగానే ఉండేది. అయితే ఈ విషయాల్లో అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయని చెప్పాలి. పురుషులతో దాదాపు సమానంగా అన్ని రకాల సౌకర్యాలు, జీతభత్యాలు అందుకుంటున్నారు మహిళలు. అయితే ఇదంతా మహిళల ప్రతిభ, క్రీడానైపుణ్యాల వల్లే సాధ్యమైందనడంలో సందేహం లేదు.

పురుషులకు తీసిపోని ప్రతిభ!

పురుషులు క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన ఇరవై సంవత్సరాలకు గానీ తొలి విజయాన్ని నమోదు చేయలేకపోతే, మహిళలు గ్రౌండ్‌లో అడుగుపెట్టిన రెండో సంవత్సరంలోనే తొలి విజయాన్ని నమోదు చేయడం విశేషం. 1978లో శాంత రంగస్వామి సారథ్యంలో భారత మహిళల జట్టు వెస్టిండీస్‌పై ఈ విజయాన్ని నమోదు చేసింది. అందుకే అప్పటి భారత ప్రభుత్వం శాంత రంగస్వామిని అర్జున అవార్డుతో సత్కరించింది. అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో సమంగా రాణిస్తోన్న భారత మహిళల జట్టు ఇప్పటికీ పురుషుల జట్టుతో సమానంగా పోటీపడుతోంది. మిథాలీ రాజ్‌, జులన్‌ గోస్వామి.. వంటి సీనియర్లు, వాళ్ల స్ఫూర్తితో ఎంతోమంది జూనియర్లు భారత మహిళల క్రికెట్‌ జట్టుకు పట్టుగొమ్మగా మారారు. వాళ్ల ఆటతీరుతో ఇప్పటికే రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్‌ చేరి.. కోట్లాది మంది క్రికెట్‌ ప్రేమికుల ఆదరాభిమానాలు చూరగొంది మన జట్టు. ఇక ఈసారి ఏకంగా కప్పుకే గురిపెట్టి బరిలోకి దిగుతోంది మిథాలీ సేన. పైగా మిథాలీ సారథ్యంలో ఇదే ఆఖరి ప్రపంచకప్‌గా భావిస్తుండడంతో.. కప్పు గెలిచి.. తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు మనమ్మాయిలు.

చక్‌ దే టీమిండియా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని