ఇవి తింటే.. బరువు పెరుగుతామని భయమొద్దు!

డ్రైఫ్రూట్స్ విషయంలో చాలామందికి వివిధ అపోహలుంటాయి. ఇవి తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని, ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుందని కొంతమంది భావిస్తారు. అయితే ప్రత్యేకించి బాదం విషయంలో ఈ అపోహలన్నీ సరికాదంటున్నారు నిపుణులు.

Published : 07 Oct 2023 18:52 IST

డ్రైఫ్రూట్స్ విషయంలో చాలామందికి వివిధ అపోహలుంటాయి. ఇవి తింటే శరీరంలో కొవ్వు పెరిగి లావవుతామని, ఫలితంగా లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుందని కొంతమంది భావిస్తారు. అయితే ప్రత్యేకించి బాదం విషయంలో ఈ అపోహలన్నీ సరికాదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగకుండానే, శరీరానికి ఉపయోగపడే విటమిన్ 'ఇ'తో పాటు మోనో అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు, మంచి కొవ్వులు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు. మహిళల్లో అప్పుడప్పుడు బాదం పప్పు తినే వారి కంటే క్రమం తప్పకుండా తినేవారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 35 శాతం తక్కువని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. బాదంలో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండడమే ఇందుకు కారణం. మరి విటమిన్ 'ఇ', పీచు.. వంటి ఎన్నో పోషకాలతో మిళితమైన బాదం పప్పు బరువు తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి..

మంచి స్నాక్!

ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా లేదంటే బయటికి వెళ్లినప్పుడైనా సాయంత్రం పూట స్నాక్స్ తినందే కొందరు ఉండలేరు. అందుకే ఈ సమయంలో వారికి నచ్చినవేవో చేసుకొని లేదా బయటికి వెళ్తే కొనుక్కొని ఆరగిస్తుంటారు. అయితే ఇవి అంత ఆరోగ్యకరం కాకపోవచ్చు. కాబట్టి వీటన్నింటికి బదులు ఓ గుప్పెడు బాదం పప్పుల్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం కడుపు నిండుగా ఉండేలా చేసి ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది. తద్వారా ఇతర ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడచ్చు.

కడుపు నిండుగా..

ఉప్మా, ఓట్‌మీల్, కిచిడీ, నూడుల్స్.. వంటి బ్రేక్‌ఫాస్ట్‌లో బాదం పప్పును వేయడం లేదంటే బ్రేక్‌ఫాస్ట్ పూర్తయిన తర్వాత కొన్ని బాదం పప్పుల్ని తినడం వల్ల కడుపు నిండుగా అనిపించి చాలాసేపటి వరకు ఆకలేయకుండా ఉంటుంది. తద్వారా ఏది పడితే అది తినకుండా ఉండి.. బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

పొట్ట తగ్గాలంటే..!

పొట్ట తగ్గించుకునే క్రమంలో వివిధ వ్యాయామాలు చేయడం మామూలే. దాంతో పాటు రోజూ బాదం పప్పుల్ని కూడా తినడం అలవాటు చేసుకుంటే పొట్ట భాగంలో పెరిగిపోయిన కొవ్వుల్ని ఇట్టే తగ్గించుకోవచ్చు. దీనికి ఇందులో ఎక్కువ మొత్తంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ కొవ్వులే కారణం. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలపై దాడి చేసి దాన్ని క్రమంగా తగ్గించేస్తాయి. ఈ క్రమంలో పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వులు కూడా కరిగి.. నాజూకైన నడుమును సొంతం చేసుకోవచ్చు.

ఎలాగైనా తినచ్చు..

బాదం పప్పు మామూలుగా తింటేనే బరువు పెరుగుతామనుకుంటారు చాలామంది. అలాంటిది వేయించుకుని తింటే.. అంటారా? వేయించుకొని తిన్నా బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు. అయితే అది కూడా నూనె లేకుండానే..! ఈ క్రమంలో నూనె లేకుండా వేయించిన బాదం పప్పైనా, నానబెట్టినవైనా, నేరుగా తిన్నా.. ఇలా ఎలా తీసుకున్నా.. వాటిలోని క్యాలరీల్లో ఎక్కువ, తక్కువలేమీ ఉండవు. కాబట్టి ఎలాంటి సంకోచాలూ లేకుండా బాదం పప్పుని ఈ మూడు పద్ధతుల్లో మీకు నచ్చినట్లుగా తినొచ్చు అంటున్నారు నిపుణులు. తద్వారా అందులోని పోషకాలతో ఆరోగ్యాన్ని పొందచ్చు. అంతేకాదు.. ఈ తక్కువ క్యాలరీలున్న పదార్థంతో బరువూ తగ్గచ్చు.

ఇవి కూడా..

బాదంలోని మెగ్నీషియం రక్తంలోని చక్కెరల్ని అదుపు చేస్తుంది. తద్వారా ఆహారం ఎక్కువగా తినాలన్న కోరిక తగ్గుతుంది.

శరీరంలోని చెడు కొవ్వుల్ని తగ్గించి, మంచి కొవ్వుల్ని పెంచే శక్తి బాదం పప్పుకి ఉంది. తద్వారా బరువు అదుపులో ఉండడంతో పాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

రాత్రంతా నానబెట్టిన బాదం పప్పుల్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. బాదం నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. ఇది మన ఆహారం ద్వారా తీసుకున్న కొవ్వులు కరిగేందుకు దోహదపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్