ఆ వ్యసనం నుంచి ఆయన్నెలా బయటికి తీసుకురావాలి?

మేడమ్‌.. నేను ఎంసీఏ పూర్తి చేశాను. నా భర్త ఐటీఐ పూర్తి చేసి ఒక ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. మా అత్తింటి వారు మా కంటే ఆర్థికంగా కాస్త తక్కువ స్థాయి అని చెప్పాలి. వాళ్లకు ఆస్తులేమీ లేవు. అయినా తను మంచివాడు, జాబ్‌ చేస్తున్నాడు, నన్ను ఇష్టపడి వచ్చాడని మా వాళ్లు అతనికిచ్చి పెళ్లి చేశారు.

Updated : 30 Dec 2021 20:35 IST

మేడమ్‌.. నేను ఎంసీఏ పూర్తి చేశాను. నా భర్త ఐటీఐ పూర్తి చేసి ఒక ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. మా అత్తింటి వారు మా కంటే ఆర్థికంగా కాస్త తక్కువ స్థాయి అని చెప్పాలి. వాళ్లకు ఆస్తులేమీ లేవు. అయినా తను మంచివాడు, జాబ్‌ చేస్తున్నాడు, నన్ను ఇష్టపడి వచ్చాడని మా వాళ్లు అతనికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి ముందు అతనిని నీకు ‘ధూమపానం, మద్యపానం.. వంటి అలవాట్లున్నాయా?’ అనడిగితే ‘లేవు’ అన్నారు. కానీ ఇప్పుడు తాగి ఆఫీసుకి కూడా సరిగా వెళ్లడం లేదు. నెలలో వారం, పది రోజులు ఇంటి దగ్గరే ఉంటున్నారు. ‘ఎందుకు ఇలా చేస్తున్నావు’ అనడిగితే ఆర్థిక సమస్యలు, ఒత్తిడితో అలా తాగుతున్నానని అంటున్నాడు. వాళ్ల పెద్దవాళ్లకి చెబితే ‘పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లు లేవు.. ఇప్పుడే ఇలా తయారయ్యాడ’ని అంటున్నారు.

డెంగ్యూ జ్వరం రావడం వల్ల నాకు గర్భస్రావం అయ్యింది. మేమిద్దరం మెడికల్‌ చెకప్‌ చేయించుకున్నాం. ఆ రిపోర్టుల్లో మా ఆయనకు షుగర్‌ ఉన్నట్టు, స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉన్నట్టు, తాగడం వల్ల కాలేయం కాస్త చెడిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఇప్పటినుంచి జాగ్రత్తగా ఉంటే ఒక సంవత్సరంలో సాధారణ స్థితికి చేరుకుంటాడని కూడా చెప్పారు. అయితే ఇవన్నీ తెలిసి కూడా ఆయన తాగడం మానట్లేదు. వాళ్ల నాన్న కూడా బాగా తాగుతాడు. అక్కడ ఉంటే అలాగే మారతాడేమోనని విడిగా ఉంటున్నాం. నెలలో కొన్ని రోజులు తాగకుండా పద్ధతిగా తన పని తాను చేసుకుపోతుంటాడు.. మరికొన్ని రోజులు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంటాడు. ఈ మధ్య కూడా అలానే చేస్తే వాళ్ల పెద్దవాళ్లతో ‘తను అలా తాగితే నేను ఉండటం కష్టం’ అని చెప్పి మా ఇంటికి వచ్చేశాను. ఇప్పుడు నా భర్త ‘నువ్వు లేకపోతే నేను ఉండలేను.. మందు ముట్టుకోను.. మళ్లీ అలా చేస్తే నువ్వు వెళ్లిపో’ అని అంటున్నాడు. ఇలా చెప్పడం కూడా ఇదే మొదటిసారేమీ కాదు.. ఇంతకుముందు చాలాసార్లు ఇలాంటి మాటలు మాట్లాడి మాట తప్పాడు.

తనని నేను ఎలా మార్చుకోవాలి? తను మంచివారే కానీ మందు తాగే విషయంలో అతన్ని ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను మా తల్లిదండ్రులతోనే ఉంటున్నా. వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా ఆయనను పట్టించుకోరు. మా వాళ్లని ఆర్థికంగా సహాయం చేయమంటున్నారు. కానీ వాళ్లు చేయలేరు. ఇప్పటికే నా పెళ్లికి చాలా అప్పులు చేశారు. అతన్ని ఎలా మార్చాలో.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. పెద్దవాళ్లు మీ ఇద్దరినీ సంప్రదించి పెళ్లి చేసినా కూడా మీ మధ్య చదువు, ఇతర విషయాల్లో తారతమ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. అతడు ఎలాంటి ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడికి గురవుతున్నాడనే విషయంలో మీకు అవగాహన ఉందా? అలాగే నెలలో కొన్ని రోజులు తాగడం.. కొన్ని రోజులు తాగకపోవడం వంటి వైఖరి ఎందుకు కనిపిస్తుందో మీరు విశ్లేషణ చేయగలుగుతారా? అనేది ఆలోచించుకోండి.

ఏది ఏమైనా అతనికి సంబంధించిన వాళ్లు పట్టించుకోవడం లేదు.. అదే సమయంలో మీరంటే ఇష్టపడుతున్నట్టుగానూ, మాటిచ్చి దాని మీద నిలబడతానన్నట్టుగానూ చెబుతున్నాడు. మీ భర్త బలహీనతలో ఉన్నాడే తప్ప అది వ్యసనం దాకా వెళ్లలేదని అనిపిస్తోంది. కాబట్టి, మీ వాళ్ల సహాయ సహకారాలు మీకుంటే.. అతడి మందు అలవాటు వ్యసనంగా పరిణమించకముందే అతని బలహీనతలు, చెడు అలవాట్ల నుంచి అతడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చెడు అలవాట్లు, వ్యసనాల నుంచి బయటకు తీసుకొచ్చే డీ-అడిక్షన్‌ సెంటర్లు కొన్నుంటాయి. వాటిని మానసిక నిపుణులు నిర్వహిస్తుంటారు. మీ భర్తను కూడా అలాంటి సెంటర్లకు తీసుకువెళ్లండి. మీ భర్త కొన్ని రోజుల పాటైనా నియంత్రణ కోల్పోకుండా ఉంటున్నాడు కాబట్టి మిగతా రోజులు కూడా అలానే ఉండేట్టు మానసిక నిపుణుల సహాయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

మీరు కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు కాబట్టి.. మీకు తగ్గ ఉద్యోగం చేసేందుకు ప్రయత్నించండి. అతని సంపాదనలో కొంత మొత్తాన్ని అప్పులు తీర్చడానికి, ఒకవేళ ఇద్దరూ కలిసి సంపాదించుకునే క్రమంలో కొంత కుటుంబానికి, మరికొంత భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకునే ప్రయత్నాలు చేయండి. ఇక మద్యపానం విషయానికొస్తే.. సోషల్‌ డ్రింకింగ్‌(అప్పుడప్పుడు మద్యం తాగడం) అయితే అది వేరే విషయం. కానీ అది ఇబ్బంది పెట్టే విధంగా ఉందంటే.. అది అతనికి ఎలా అలవాటైందో మనకు తెలియదు. కాబట్టి మానసిక నిపుణుల సహాయంతో దాన్నుంచి మీ వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కేవలం ‘ఒత్తిళ్ల వల్ల మాత్రమే తాగుతున్నాను’ అని చెప్పడం వెనుక కారణాలను మీరు విశ్లేషించి చూడండి. ఆ ఒత్తిళ్లేంటో అర్థం చేసుకుని వాటి నుంచి ఆయన బయటపడేలా మీ వంతుగా సహాయం అందించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్