ఆ మోజులో పడిపోయి.. భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తున్నారా?

పక్కన కూర్చున్న వాళ్లతో పైపైన మాట్లాడుతూనే.. ఫోన్‌తో బిజీగా గడుపుతుంటారు. ‘ఫబింగ్’గా పిలిచే ఈ అలవాటు కారణంగా.. జంటల మధ్య అన్యోన్యత దెబ్బతింటుందంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

Published : 09 Aug 2023 12:35 IST

నిద్ర లేవగానే ఫోన్‌ చూడడం, కాస్త ఖాళీ సమయం దొరికినా ఫోన్‌తో కాలక్షేపం చేయడం చాలామందికి అలవాటు! అయితే కొంతమంది భాగస్వామి పక్కనున్నా సరే పట్టించుకోకుండా ఫోన్‌లో సంభాషణలు, చాటింగ్‌లు చేస్తుంటారు.. పక్కన కూర్చున్న వాళ్లతో పైపైన మాట్లాడుతూనే.. ఫోన్‌తో బిజీగా గడుపుతుంటారు. ‘ఫబింగ్’గా పిలిచే ఈ అలవాటు కారణంగా.. జంటల మధ్య అన్యోన్యత దెబ్బతింటుందంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. కాబట్టి ఇది హద్దులు దాటకముందే జాగ్రత్తపడమంటున్నారు. అప్పుడే అనుబంధాన్ని తిరిగి నిలబెట్టుకోవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఫబింగ్ వల్ల దాంపత్య బంధంలో ఎలాంటి సమస్యలొస్తాయి? ఈ అలవాటుకు చెక్‌ పెట్టాలంటే జంటలు ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

ఎలాంటి సమస్యలొస్తాయంటే..?

పక్కనే ఉన్న భాగస్వామిని కూడా పట్టించుకోకుండా లేదంటే ఏదో పైపైన వాళ్లతో మాట్లాడుతూ.. ఫోన్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వడాన్నే ‘ఫబింగ్’ అంటారు. అయితే ఇలా ఇద్దరూ చేస్తే ‘డబుల్ ఫబింగ్’గా పిలుస్తారు. ఇలా మొబైల్‌ మోజులో పడిపోయి.. భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం వల్ల దాంపత్య బంధంలో పలు సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు.

ఆలుమగల బంధమంటే ముద్దూ ముచ్చట్లు, ఒకరితో ఒకరు సమయం గడపాలనుకోవడం, రొమాంటిక్‌ సంభాషణలు.. వంటివెన్నో ఉంటాయి. వీటితోనే అనుబంధం దృఢమవుతుంది కూడా! అయితే ఫబింగ్ వల్ల జంటల మధ్య వీటి ఊసే లేకుండా పోతుందంటున్నారు నిపుణులు. తద్వారా వివాహ బంధంలో ఉన్న సంతోషం, సంతృప్తి రెండూ కనుమరుగవుతున్నాయంటున్నారు.

ప్రేమగా మాట్లాడదామని వెళ్లి పక్కన కూర్చున్నా.. భాగస్వామి ఫోన్‌లోనే లీనమైతే.. ‘నీకు నా కంటే ఫోనే ఎక్కువైందన్నమాట! దాన్నే పెళ్లి చేసుకోలేకపోయావా?’ అంటూ కోపం రావడం సహజమే! ఈ కోపమే క్రమంగా అలకలు, గొడవలకు కారణమయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇలా తరచూ గొడవలు పెట్టుకోవడం వల్ల ఒక దశలో.. ఈ బంధంలో కొనసాగడం కంటే విడిపోవడమే మేలనిపిస్తుంటుంది.

ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా తమ భాగస్వామి తమకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ! కానీ తమను కాదని ఫోన్‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భాగస్వామి తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనను తట్టుకోలేకపోతారు. ఇది వారిని మానసికంగా కుంగదీస్తుంది. క్రమంగా అనుబంధాన్నీ దెబ్బతీస్తుంది.

భాగస్వామి ఎక్కువసేపు ఫోన్‌లో గడుపుతున్నారంటే.. కోపం కంటే ముందుగా వారిపై అనుమానమొస్తుంది. తమను కాదని.. మరో వ్యక్తిని ఇష్టపడుతున్నారేమో, తమను వదిలేసి వారికి దగ్గరవుతారేమోనన్న ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఈ అనుమానమే పెనుభూతమై ఇద్దరి మధ్య చిచ్చుపెట్టే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు.

భార్యాభర్తలంటే సుఖాల్లోనే కాదు.. కష్టాల్లోనూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ ఫోన్‌తో సహజీవనం చేసే భాగస్వామి తోడుగా ఉన్నా, లేకపోయినా ఒకేవిధంగా అనిపిస్తుంటుంది. ఈ క్రమంలో వాళ్లు పక్కనే ఉన్నా.. ఫోన్‌లో నిమగ్నమవడం వల్ల ఒంటరితనం, ఒక రకమైన మానసిక కుంగుబాటు.. వంటివి వేధిస్తాయి.

ఆలుమగల మధ్య ప్రేమ ఉంటేనే.. వారు శృంగార జీవితాన్నీ ఆస్వాదించగలుగుతారు. అదే ఫోన్‌ ధ్యాసలో పడిపోయి భాగస్వామి తమను నిర్లక్ష్యం చేస్తున్నారనిపిస్తే.. వారిపై రొమాంటిక్‌ ఫీలింగ్స్‌ కూడా క్రమంగా కనుమరుగవుతాయంటున్నారు నిపుణులు. ఇది అనుబంధానికి అతి పెద్ద అవరోధంగా పరిణమించే ప్రమాదం ఉంటుందంటున్నారు.

సంసారంలో కలతలు సహజం. వీటివల్ల ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసుకొని మానసిక ప్రశాంతతను పొందడానికి కొంతమంది ఫోన్‌కు అలవాటు పడుతుంటారు. అయితే దీనివల్ల ప్రశాంతతేమో గానీ.. భార్యాభర్తల మధ్య దూరం మరింతగా పెరుగుతుందంటున్నారు నిపుణులు.

ఫోన్‌కు దూరంగా.. భాగస్వామికి దగ్గరగా..!

దాంపత్య బంధాన్ని శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బతీసే ఫబింగ్ అలవాటును దూరం చేసుకుంటేనే జంటలు అనుబంధాన్ని తిరిగి నిలబెట్టుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.

భార్యాభర్తల మధ్య అనుబంధం పెంచుకోవాలన్నా, పెరిగిన దూరాన్ని తగ్గించుకోవాలన్నా కలిసి సమయం గడపడం ముఖ్యం. ఈ క్రమంలో ఫబింగ్‌కు దూరంగా ఉండాలంటే.. ‘నో ఫోన్‌ జోన్‌’ ఏర్పాటుచేసుకోవాలి. అంటే.. భాగస్వామికి కేటాయించిన సమయంలో, ప్రదేశంలో ఫోన్‌ వాడకూడదని కచ్చితంగా నియమం పెట్టుకోవాలి. తద్వారా ఎలాంటి గొడవలకు, వాదోపవాదాలకూ తావుండదు.

మానసిక ప్రశాంతత కోసం ఫోన్‌తో గడిపేవాళ్లకు.. భాగస్వామి తానున్నానంటూ భరోసా ఇవ్వడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వాళ్లను ఇబ్బంది పెడుతోన్న సమస్యలేంటో తెలుసుకొని.. వాటిని దూరం చేసే ప్రయత్నం చేయడం ముఖ్యమంటున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్లలో ఫోన్‌ అలవాటు తగ్గడంతో పాటు ఇద్దరి మధ్య అనుబంధమూ పెరుగుతుంది.

టైంపాస్‌ కోసం ఫబింగ్‌కు అలవాటు పడే వారూ లేకపోలేదు. అయితే భాగస్వామిలో ఈ అలవాటును దూరం చేయాలంటే.. ఆ టైంపాస్‌ ఏదో దంపతులిద్దరూ కలిసి చేస్తే మంచిది. ఈ క్రమంలో కలిసి అలా బయటికి వెళ్లడం, నచ్చిన ఆటలాడుకోవడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం.. ఇలా ఆలోచిస్తే బోలెడు ఐడియాలొస్తాయి. ఇవి ఇద్దరి మధ్య అన్యోన్యతనూ పెంచుతాయి.

కొంతమంది భాగస్వామి ఫోన్‌తో గడిపితే తట్టుకోలేరు. ఎప్పుడూ తమతోనే గడపాలని కోరుకుంటారు. ఇలా వాళ్ల ప్రవర్తనతో విసుగు చెంది కొందరు ఇలా ఫబింగ్‌కు అలవాటు పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటప్పుడు వాళ్ల వ్యక్తిగత సమయానికి అంతరాయం కలగకుండా జాగ్రత్తపడితే సమస్య లేకుండా ఉంటుందంటున్నారు.

శృంగార జీవితాన్ని దెబ్బతీసే ఫబింగ్ అలవాటుకు చెక్‌ పెట్టాలంటే.. దంపతులిద్దరూ తమ ఫోన్లను పడకగది బయటే ఉంచడం మంచిదంటున్నారు నిపుణులు. అప్పుడే ఒకరి సంభాషణపై మరొకరు దృష్టి పెట్టగలుగుతారు.. ఎలాంటి అంతరాయం కూడా ఉండదు.

అయితే ఇవన్నీ పాటించినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొంతమందిలో మార్పు రాకపోవచ్చు. ఇలాంటి వారు జంటగా కౌన్సెలింగ్‌కు వెళ్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్