సహజమైన మిస్ట్‌లివీ!

మిస్ట్‌.. ఫేషియల్‌ స్ప్రే.. పేరేదైనా చర్మానికి పోషణనిస్తూనే మెరుపు, తాజాదనం ఇస్తాయి. రసాయన రహిత ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ.. వీటినీ సహజంగా తయారు చేసుకోవచ్చు...గ్రీన్‌ టీ.. కప్పు వేడినీటిలో ఒక గ్రీన్‌టీ బ్యాగు వేసి, 20 నిమిషాలు వదిలేయండి.

Published : 03 Jan 2023 01:02 IST

మిస్ట్‌.. ఫేషియల్‌ స్ప్రే.. పేరేదైనా చర్మానికి పోషణనిస్తూనే మెరుపు, తాజాదనం ఇస్తాయి. రసాయన రహిత ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ.. వీటినీ సహజంగా తయారు చేసుకోవచ్చు...

గ్రీన్‌ టీ.. కప్పు వేడినీటిలో ఒక గ్రీన్‌టీ బ్యాగు వేసి, 20 నిమిషాలు వదిలేయండి. పూర్తిగా చల్లారాక ఒక క్యాప్సూల్‌ విటమిన్‌ ఇ నూనె కలిపితే సరి. గ్రీన్‌టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి, చర్మకణాల్లో జీవం నింపుతాయి. విటమిన్‌ ఇ చర్మానికి తేమను అందిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడంలోనూ ఈ మిస్ట్‌ సాయపడుతుంది.

కొబ్బరి నీళ్లు.. పావు కప్పు చొప్పున కొబ్బరినీళ్లు, కలబంద గుజ్జు తీసుకోవాలి. దానికి టేబుల్‌ స్పూను బాదం నూనె కలిపి స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. కొబ్బరినీళ్లలో ఉండే సైటోకైనిన్లు కణాల ఉత్పత్తిలో సాయపడటమే కాదు.. యాంటీ ఏజింగ్‌గానూ పని చేస్తాయి. అలోవెరా చర్మానికి తేమను అందిస్తూనే చర్మ సమస్యలను దరి చేరనివ్వదు.

రోజ్‌ వాటర్‌.. అరకప్పు గులాబీ నీటికి ఒకటిన్నర టేబుల్‌ స్పూను జొజోబా ఆయిల్‌ కలిపితే సరి. ఈ మిస్ట్‌ పీహెచ్‌ స్థాయిలను సమన్వయం చేసి, చర్మాన్ని మృదువుగానూ మారుస్తుంది. సువాసనలు నరాలను శాంతపరిచి విశ్రాంతి భావనని కలిగిస్తాయి.

బియ్యంతో.. బియ్యాన్ని చల్లటి నీటితో ఒకసారి కడగాలి. ఆ నీరు వంపేసి, బియ్యం మునిగేలా వేడినీరు పోసి పక్కన పెట్టాలి. అరగంటయ్యాక ఆ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్‌లో పోసుకుంటే సరి. బియ్యపు నీరు అందాన్ని పెంచే సహజ వనరు. దీనిలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉండి, చర్మానికి మెరుపు, బిగుతుదనం ఇస్తాయి.

సహజ మిస్ట్‌లు తర్వగా పాడయ్యే అవకాశాలెక్కువ. కాబట్టి, ఉపయోగించగానే ఫ్రిజ్‌లో పెట్టేసుకుంటే కొన్నాళ్లు నిలవుంటాయి. ముఖాన్ని కడుక్కుని, తుడిచి ఆపై మిస్ట్‌ను స్ప్రే చేయాలి. ఆరాక మాయిశ్చరైజర్‌ రాయాలి. చర్మానికి పోషకాలను అందిస్తూనే తేమను బంధిస్తుంది. మేకప్‌ను ఎక్కువసేపు పట్టి ఉంచడంలోనూ సాయపడుతుంది. బాగా అలసినట్లు కనిపిస్తే మిస్ట్‌ను స్ప్రే చేస్తే ముఖం తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్