Published : 19/09/2021 18:19 IST

పెళ్లొద్దంటున్నా మా పేరెంట్స్ వినడం లేదు... ఏం చేయాలి?

మేడమ్‌.. నా వయసు 28 సంవత్సరాలు. నా సమస్యల్లా నా తల్లిదండ్రులే. వారు నా కెరీర్‌ కోసం ఎంతో సహాయం చేశారు. కానీ వారి ఆలోచనలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నచ్చని విషయాల్లో నన్ను బలవంతపెట్టడం నాకు అస్సలు ఇష్టముండదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి పరిస్థితులు నన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇదే విషయాన్ని వారికి చెబితే దాన్ని ఓ జోక్‌లా తీసిపారేస్తున్నారు. అంతేకాదు.. నేను ఎమోషనల్‌ డ్రామా ఆడుతున్నానని అంటున్నారు. అయినా సహిస్తున్నా వారు లెక్కచేయట్లేదు. ‘ఇప్పుడు నీ టైం బాలేదు.. పెళ్లి చేస్తే అన్నీ సర్దుకుంటాయ’ని అంటున్నారు. కానీ పెళ్లి చేసుకొని బాధ్యతలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఒంటరిగా బతకాలని ఉంది. ఈ విషయం చెబితే వాళ్లు కటువుగా మాట్లాడుతున్నారు. దయచేసి సలహా ఇవ్వగలరు.

జ: ఇప్పుడు మీది వివాహం చేసుకునే వయసే కాబట్టి బహుశా వాళ్లు మిమ్మల్ని పెళ్లి విషయంలో ఒత్తిడి చేస్తుండచ్చు. అయితే మీకున్నటువంటి స్వతంత్ర భావాలను బట్టి మీ స్వేచ్ఛను పోగొట్టుకోవడం కానీ, మరొకరితో జీవితం పంచుకుంటే ఎలా ఉంటుందో తెలియదు అన్న భావనేమైనా మిమ్మల్ని వేధిస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా మీరు అధిగమించగలరో ఆలోచించి చూడండి. ఇన్నేళ్లుగా మీ తల్లిదండ్రులు చెప్పడం, మీరు ఆచరించడం.. బహుశా మీకు అలవాటైపోయి ఉంటుంది. అలాగే వాళ్లు కూడా మీకు ఇష్టం లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా ఎమోషనల్‌గా మాత్రమే ఆలోచిస్తున్నారు.. కాబట్టి అది అపరిపక్వత అన్న ధోరణితో వాళ్లు పదే పదే మీ మీద ఒత్తిడి చేస్తుండచ్చు. పెళ్ళికి సంబంధించి - మీవైపు నుంచి మీ ఆలోచనలను వారికి తార్కిక ధోరణిలో సహేతుకంగా వివరిస్తే వాళ్లు ఏ విధంగా స్పందిస్తారో చూడండి.

కారణాలను విశ్లేషించుకోండి...

అలాగే ‘పెళ్లి చేసుకోవద్దు’ అనే మీ ఆలోచనలకు కారణమేంటో ముందుగా మీకు మీరు స్వయం విశ్లేషణ చేసుకోండి. ప్రస్తుతం ఉన్న ఆలోచనలు ఇంకొన్నేళ్ల తర్వాత ఉంటాయా? అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ‘ఆ సమయంలో నేను సరైన నిర్ణయం తీసుకోకపోతే నా తల్లిదండ్రులైనా నాకు నచ్చచెప్పి ఉండాల్సింది.. లేదంటే ఇంకెవరైనా నాకు సరైన ధోరణిలో మార్గనిర్దేశనం చేసి ఉండాల్సింది’ అన్న ఆలోచన మీకు రాకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఆలోచించుకోండి.

ఇక ఒంటరి జీవితం అనేది ప్రస్తుతం మీకున్న స్వేచ్ఛలా మీరు భావిస్తున్నారు. ఈ జీవితం మీకు సౌకర్యాన్నిస్తోంది కాబట్టి ప్రస్తుతం మీరు పెళ్లి వద్దనుకుంటున్నారు. అలాగే కేవలం శారీరక పరంగానే కాకుండా మానసికంగా, సామాజికంగా కూడా మీరు కోరుకున్నటువంటి అండ, తోడు ఇవ్వగలిగిన జీవిత భాగస్వామి అసలు దొరకరని మీరు అనుకుంటున్నారేమో ఆలోచించి చూడండి. ఒకవేళ మీ ఆలోచనలకు తగిన జీవిత భాగస్వామి దొరికినప్పుడు అటువంటి వారితో జీవితం పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారేమో అన్న కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మీకు ఎలాంటి లక్షణాలున్న జీవిత భాగస్వామి కావాలో మీ కుటుంబ సభ్యులకు విశ్లేషించి చెప్పే ప్రయత్నం చేయండి.

ఈ స్వేచ్ఛ ఒంటరితనమవుతుందా?

అలాకాకుండా కేవలం స్వేచ్ఛ కోసం మాత్రమే జీవితాంతం ఒంటరిగా ఉండాలనుకుంటే ఆ స్వేచ్ఛ కొన్నాళ్లు పోయాక ఒంటరితనంగా మిమ్మల్ని బాధించకుండా ఉంటుందా అనే కోణంలో నుంచి కూడా ఆలోచించి చూడండి. మీ భవిష్యత్తులో మీరు తీసుకున్న నిర్ణయానికి బాధపడడం, అది తప్పని భావించడం, మిమ్మల్ని సరిగ్గా మార్గదర్శకత్వం చేసే వాళ్లు లేకపోయారే అని మీరు అనుకోవడం.. ఇలాంటివన్నీ జరుగుతాయేమో ముందుగానే ఆలోచించుకోండి.

మీకు మీరు ఒంటరిగా ఉండాలనుకోవడానికి కారణాలేంటో ముందు మీరు మీ తల్లిదండ్రులతో వివరంగా చర్చించండి. మీరు ఉద్వేగానికి లోనై మాట్లాడినప్పుడల్లా మీరు కేవలం ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని మాత్రమే వారికి అర్థమవుతుంది. అలాకాకుండా ఉద్వేగానికి బదులుగా మీరు లాజికల్‌గా మాట్లాడే ప్రయత్నం చేయండి. ముందుగా మీరు తార్కికంగా ఆలోచించుకొని, స్వయం విశ్లేషణ చేసుకొని, మీకు ఎలాంటి వ్యక్తి దొరికితే మీరు సంతోషంగా ఉంటారో ఆలోచించుకోండి. మీ ఉద్దేశం ప్రకారం మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన వ్యక్తిని మీకు మీరే చూసుకోవడం లేదంటే మీ పేరెంట్స్‌తో ఆ విషయం చెప్పడం.. వంటివి చేయచ్చు. అలాకాకుండా అసలు తోడే వద్దనుకుంటే దానికి కారణాలేంటో కూడా వారికి విశ్లేషణ పూర్వకంగా చెప్పి చూడండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని