‘ఉగాది’.. ఎలా ప్రారంభమైందంటే..?!

ప్రకృతి పచ్చటి చీర కట్టుకున్న వసంత వేళ.. కోయిల కుహుకుహూ రాగాల మధ్య ఆనందంగా జరుపుకొనే పండగ ఉగాది. అడుగడుగునా సంప్రదాయ రీతులను ప్రతిబింబిస్తూ కొత్త సంవత్సరం ఆరంభం కాబోతోంది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొనే ఈ పండగ వెనక అనేక పురాణ కథలు, ఖగోళపరమైన అంశాలూ......

Updated : 31 May 2023 17:14 IST

ప్రకృతి పచ్చటి చీర కట్టుకున్న వసంత వేళ.. కోయిల కుహుకుహూ రాగాల మధ్య ఆనందంగా జరుపుకొనే పండగ ఉగాది. అడుగడుగునా సంప్రదాయ రీతులను ప్రతిబింబిస్తూ కొత్త సంవత్సరం ఆరంభం కాబోతోంది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొనే ఈ పండగ వెనక అనేక పురాణ కథలు, ఖగోళపరమైన అంశాలూ ఉన్నాయి. ప్రకృతి పరంగానూ ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. తెలుగు వాకిళ్లలోకి మరో కొత్త ఏడాది అడుగుపెడుతోన్న ఈ శుభవేళ ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

జగత్తును సృష్టించిన రోజు

పూర్వం సోమకుడనే రాక్షసుడు బ్రహ్మ నిద్రిస్తున్న సమయంలో వేదాలను దొంగిలించాడట. వాటిని తిరిగి తేవడానికి శ్రీహరి మత్స్యావతారం ఎత్తి సోమకున్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందజేస్తాడు. అప్పుడే బ్రహ్మ ‘చైత్రమాసే జగద్బ్రహ్మే ససర్జ ప్రథమే..’ అంటూ చైత్రమాసంలో తొలి రోజైన శుద్ధ పాడ్యమి నాడు సకల జగత్తును సృష్టించాడట. అదే యుగానికి ఆదిగా.. యుగాదిగా పిలిచారు. కాలక్రమంలో దాన్ని మనం ఉగాదిగా జరుపుకుంటున్నాం. కృష్ణావతారం పరిసమాప్తి అయిన చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రవేశించింది. కలియుగారంభం జరిగిన ఈ రోజునే ఉగాదిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఖగోళ శాస్త్ర పరంగా..

365రోజుల్లో ఒక రోజుకు రాత్రింబవళ్లు సమానంగా ఉంటాయి. ఆ రోజు తర్వాత వచ్చే తొలి పాడ్యమిని మనం ఉగాదిగా జరుపుకొంటున్నాం. భారతీయ తొలి ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట సైతం చైత్ర శుద్ధ పాడ్యమినాడు భూమి పైకి సూర్యకిరణాలు ప్రసరించడంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని పేర్కొన్నారట. మరో ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు సైతం తాను రూపొందించిన పంచాంగాన్ని చైత్ర శుద్ధ పాడ్యమినాడే ప్రజలకు అంకితం ఇచ్చారు.

ప్రకృతి పరంగా..

మనం రుతువులను అనుసరించి పండగలను జరుపుకొంటాం. ఉగాది కూడా అలాంటిదే. ఆకురాలే కాలం అయిన శిశిర రుతువు నుంచి వసంతంలోకి అడుగుపెట్టే రోజున మనం ఉగాది జరుపుకొంటాం. అప్పటి వరకు ఎండిన మోడుల్లా కనిపించిన మొక్కలు చిగురు తొడగడం ప్రారంభిస్తాయి. ప్రకృతి కాంత పచ్చదనాల చీరను కట్టుకొంటుంది. పక్షుల కిలకిలారావాలు.. లేలేత చిగుళ్లు.. ప్రకృతికి మరింత శోభను చేకూర్చుతాయి. రుతువులు మారడం వల్ల వ్యాధులు విజృంభిస్తాయి. కాబట్టి వాటిని తట్టుకొనే శక్తిని పొందడానికి షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని సేవిస్తారు.

వేర్వేరు రోజుల్లో..

ఉగాదిని వేర్వేరు యుగాల్లో వేర్వేరు రోజుల్లో జరుపుకొన్నారు. కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి రోజు ఉగాదిని జరుపుకొన్నారు. త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియ, ద్వాపర యుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజు జరుపుకొన్న ఉగాది.. కలియుగానికి వచ్చే సరికి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకొంటున్నారు.

ఇష్టదైవ ప్రార్థనతో..

ఈ పర్వదినాన వేకువజామునే లేచి తలస్నానం చేసి, నూతన వస్త్రాలు ధరిస్తారు. గుమ్మానికి మామిడాకు తోరణాలను కట్టి.. వాకిలిని రంగురంగుల రంగవల్లులతో అలంకరిస్తారు. ఉగాది రోజున ప్రత్యేకించి ఫలానా దేవుడినే పూజించాలనే నియమం ఏమీ లేదు. కనుక ఎవరి ఇష్టదైవాన్ని వారు ప్రార్థిస్తారు. అనంతరం ఉగాది పచ్చడిని ఆరగిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను, సుఖదుఃఖాలను, ఇలా అన్నింటినీ సమానంగా చూడాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు అందిస్తుంది. అలాగే దేనికీ అతిగా స్పందించకుండా సమతుల్యం పాటించాలని సూచిస్తుంది.

పంచాంగ శ్రవణం..

ఉగాది పర్వదినాన కచ్చితంగా అందరూ ఆచరించేది పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాలను దీని ద్వారా తెలుసుకుంటారు. ఉత్తరాభిముఖంగా కూర్చొని పంచాంగ శ్రవణం చేయడం శ్రేయస్కరమని పండితుల అభిప్రాయం.

రోజంతా ఉల్లాసంగా..

ఉగాది రోజు మనం ఎలా గడిపితే ఏడాదంతా అలాగే గడిచిపోతుందని చాలామంది విశ్వసిస్తారు. అందుకే ఎన్ని కష్టాలున్నా రోజంతా ఆనందంగా, ఉత్సాహంగా గడపడానికే ప్రయత్నిస్తారు. గతేడాది తాము అనుభవించిన కష్టాలు ఈ సంవత్సరం మళ్లీ ఎదురు కాకూడదనే ఉద్దేశంతో వీలైనంత సంతోషంగా గడపడానికే మొగ్గు చూపుతారు.

పూర్ణకుంభ దానం..

సంవత్సరాది పర్వదినాన కచ్చితంగా చేయాల్సిన పనుల్లో మరొకటి పూర్ణకుంభ దానం. దీనినే ధర్మఘట దానం, ప్రపాదానం అనే పేర్లతో పిలుస్తారు. ఇలా ఎవరి శక్తిమేరకు వారు రాగి, వెండి, పంచలోహాలు, మట్టితో చేసిన పాత్రను పూర్ణకుంభంలా తయారు చేసి దానం ఇస్తే కోరికలు నెరవేరతాయని ఒక నమ్మకం.

కవిపండితులకూ పండగే..

ఉగాది రోజున తెలుగు రాష్ట్రాల్లో కనిపించే మరో విశేషం.. కవి సమ్మేళనం. ఇది కూడా షడ్రుచుల సమ్మేళనంగా సాగుతుంది. వర్తమాన వ్యవహారాలపై తమదైన రీతిలో స్పందిస్తారు కవులు. కొన్ని చోట్ల కవిపండితులకు సన్మాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్