ఆన్‌లైన్‌ గేమ్స్‌తో లక్షలు సంపాదిస్తోంది!

ఆన్‌లైన్ గేమింగ్.. సాధారణంగా ఈ రంగంలో యువతే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే రీతూ స్లాథియా మాత్రం 40 దాటాకే.. తనకు ఆసక్తి ఉన్న గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ రంగంలో రాణించడమే కాదు.. లక్షల కొద్దీ ఫాలోవర్లను కూడా సంపాదించుకుంది.

Published : 13 Mar 2024 12:51 IST

(Photo: Twitter)

ఆన్‌లైన్ గేమింగ్.. సాధారణంగా ఈ రంగంలో యువతే ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే రీతూ స్లాథియా మాత్రం 40 దాటాకే.. తనకు ఆసక్తి ఉన్న గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ రంగంలో రాణించడమే కాదు.. లక్షల కొద్దీ ఫాలోవర్లను కూడా సంపాదించుకుంది. మరోవైపు లక్షల కొద్దీ ఆదాయాన్నీ గడిస్తోంది. మరి, అసలు ఈ వయసులో గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టాలన్న ఆలోచన రీతూకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి..

రీతూది జమ్మూ-కశ్మీర్‌. మధ్య తరగతి కుటుంబం కావడంతో ఇంటర్‌తోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. 20 ఏళ్లకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తన చదువుకు ముగింపు పలికినా ఓ మంచి భార్యగా, ఇల్లాలిగా, తల్లిగా.. పాతికేళ్లుగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నానంటోందామె.

20 ఏళ్లకే పెళ్లి!

‘ఆడపిల్లనైనందుకు చిన్న వయసులోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. ఇంకా చదువుకుంటానంటే ‘ఆడపిల్లను అలా ఒంటరిగా బయటికి పంపితే ఎలా?’ అన్నారంతా. దాంతో ఇంటర్‌ పూర్తికాగానే నాకు పెళ్లి చేసేసి మా అమ్మానాన్నలు తమ బాధ్యత తీర్చుకున్నారు. 20 ఏళ్లకే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నాకు.. పుట్టింటికి మించిన సంతోషం మెట్టినింట్లో దక్కింది. ఓ మంచి భార్యగా, ఇల్లాలిగా, నా కొడుక్కి మంచి తల్లిగా పాతికేళ్ల నుంచి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నా. అయినా నాకంటూ ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. కానీ ఇంటి బాధ్యతలు, కొడుకు ఆలనా పాలనతోనే రోజులు గడిచిపోయేవి. ఇంతలోనే కరోనా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో నా కొడుకు ఇంటి నుంచే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేవాడు. అయితే అప్పుడప్పుడూ ఖాళీ సమయాల్లో వాడు మొబైల్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ ఎంజాయ్‌ చేయడం చూశా. నాలోనూ ఆ ఆటలాడాలన్న ఆసక్తి మొదలైంది. కానీ ఈ వయసులో ఆటలేంటని అనుకుంటారేమో అన్న మొహమాటంతో అడగలేకపోయా..’ అంటోంది రీతూ.

‘నువ్వేమైనా చిన్న పిల్లవా?’ అన్నారు!

కానీ ఒకరోజు తన సంశయాలన్నిటినీ పక్కన పెట్టి ఆన్‌లైన్‌ గేమ్స్‌ గురించి తన కొడుకుని అడిగేసింది రీతూ.

‘నా కొడుకు నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. నా కోసం ఏదైనా చేసేస్తాడు. ఓ రోజు ఆన్‌లైన్‌ గేమ్స్‌పై నాకున్న మక్కువను వాడి ముందు బయటపెట్టా. నాకూ ఆడాలనుంది నేర్పిస్తావా అని అడిగాను. వాడు మరింత ఉత్సాహంతో సరేనన్నాడు. అలా ఆన్‌లైన్‌ గేమ్స్‌ వైపు నా ప్రయాణం మొదలైంది. ఆటల్లోని మెలకువలు, ఆడే విధానం నేర్చుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఈ క్రమంలోనే కొత్త ఆటలు కూడా ప్రయత్నించేదాన్ని. ఇలా ఆన్‌లైన్‌ ఆటలపై మరింత పట్టు పెరిగింది. ఆపై లైవ్‌ స్ట్రీమింగ్‌ గేమ్స్‌ కూడా ఆడడం ప్రారంభించా. ఈ క్రమంలోనే కొంతమంది ఆన్‌లైన్‌ గేమర్స్‌ నాతో కనెక్ట్‌ అవుతూ నాతో ఆడేవారు. మరికొందరు నన్ను ఫాలో అయ్యేవారు. ఫాలోవర్లు పెరిగే కొద్దీ డబ్బు సంపాదన కూడా మొదలవడంతో.. ఇరుగుపొరుగు మహిళలకు ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ గురించి వివరించా. ‘ఇవన్నీ పిల్లలు ఆడుకునే ఆటలు.. మనలాంటి పెద్దల కోసం కాదు..’ అనేవారు. అయినా వాళ్ల మాటలు పట్టించుకోకుండా నా అభిరుచి పైనే దృష్టి పెట్టా..’ అంటోన్న రీతూ.. ‘Black Bird YT’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి తాను ఆడిన ఆన్‌లైన్‌ గేమ్స్‌కి సంబంధించిన వీడియోల్ని పోస్ట్‌ చేస్తుంటుంది.

వాళ్లే నా ఛీర్‌లీడర్స్!

ప్రస్తుతం తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా కొత్త కొత్త ఆన్‌లైన్‌ గేమ్స్‌ని వీక్షకులకు పరిచయం చేస్తోన్న రీతూ.. మరోవైపు ‘రూటర్‌’ అనే ప్రముఖ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రొఫెషనల్‌ గేమర్‌గా కొనసాగుతోంది. ఈ వేదికపై ‘బ్లాక్‌బర్డ్‌’ పేరుతో ఆమె ఎంతోమందికి సుపరిచితం. ఈ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వేదికగా ఆమెను 3.8 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇలా ప్రొఫెషనల్‌ గేమర్‌గా ఏడాది తిరిగేసరికి లక్షల రూపాయల్ని ఆర్జిస్తోందీ గేమ్‌ లవర్.

‘ఉదయాన్నే 8 గంటల కల్లా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుంటా.. పూజ కూడా పూర్తవుతుంది. ఆపై కంప్యూటర్‌ ముందు వాలిపోతా. ఓ ప్రొఫెషనల్‌ గేమర్‌గా గేమ్‌ చాట్‌ రూమ్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల్ని కలిసే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. వాళ్లతో నా అనుభవాలు పంచుకోవడం, వాళ్ల మాటలు వినడం భలే సరదాగా అనిపిస్తుంది. ఇలా రోజులో మూడు నాలుగ్గంటలు ఆన్‌లైన్‌ గేమ్స్‌తో గడిపేస్తా. మిగతా సమయమంతా ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తా. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లే నా ఛీర్‌లీడర్స్‌. గేమింగ్‌ రంగంలో నాకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు వాళ్లే నన్ను ప్రోత్సహించారు. ఒకప్పుడు ‘ఈ వయసులో ఆటలేంటి’ అన్నవాళ్లు కూడా ఇప్పుడు మనసు మార్చుకొని ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు.. మరింతమంది మహిళలు ఈ రంగంలోకి రావాలని కోరుకుంటున్నా. అలాగే భవిష్యత్తులో ఆన్‌లైన్‌ గేమ్స్‌కి సంబంధించిన కంటెంట్‌ని రూపొందించాలనుకుంటున్నా..’ అంటోంది రీతూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్