SS Rajamouli: వాళ్లే నా జీవితానికి డిజైనర్లు!

ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. కానీ తన విజయం వెనుక ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు మహిళలున్నారంటున్నాడు టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి. అడుగడుగునా వాళ్లు అందించిన ప్రోత్సాహమే తననీ స్థాయికి చేర్చిందంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు.

Updated : 16 Mar 2024 15:00 IST

ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. కానీ తన విజయం వెనుక ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు మహిళలున్నారంటున్నాడు టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి. అడుగడుగునా వాళ్లు అందించిన ప్రోత్సాహమే తననీ స్థాయికి చేర్చిందంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు. మరి, ఇంతకీ ఈ దర్శక ధీరుడి జీవితంలో ఉన్న ఆ ముగ్గురు మహిళలెవరు? వాళ్ల గురించి ఆయనేమంటున్నారో తెలుసుకుందాం రండి..

నా ఇష్టాల్ని తెలుసుకుంది!

జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, జీవితాన్నిచ్చిన వ్యక్తుల్ని మర్చిపోవద్దంటారు. ఈ మాటకొస్తే తన తల్లి రుణం ఈ జన్మలో తీర్చుకోలేనంటున్నారు జక్కన్న.

‘నాకు చిన్నతనం నుంచే సినిమాలంటే పిచ్చి. చదువుకునే రోజుల్లోనే బోలెడన్ని సినిమాలు చూసేవాడిని. చాలామంది తల్లులు తమ పిల్లల్ని సినిమాలకు దూరంగా ఉంచుతూ చదువుపై దృష్టి పెట్టమంటుంటారు. కానీ మా అమ్మ రాజానందిని ఇందుకు భిన్నం. తనే స్వయంగా నన్ను సినిమాలకు తీసుకెళ్లేది. ఎక్కువగా ఇంగ్లిష్‌ సినిమాలు చూపించేది. నేను స్కూలింగ్‌లో ఉన్నప్పుడు చదువుకోమని, హోమ్‌వర్క్‌ చేయమని ఏనాడూ నాపై ఒత్తిడి తెచ్చేది కాదు. సబ్జెక్ట్‌ చదువుకోమనీ ఎప్పుడూ నన్ను బలవంతం చేయలేదు. సినిమాలపై నాకున్న ఆసక్తిని గ్రహించి ఇటువైపుగా నన్ను ప్రోత్సహించింది. అమ్మ ఎప్పుడూ నాతో రెండు విషయాలు చెప్పేది. కామిక్స్‌, కథల పుస్తకాలు చదవమని.. బయటికి వెళ్లి ఆడుకోమని నన్ను ప్రోత్సహించేది. నాలో ఉన్న సృజనాత్మకతను తట్టి లేపేది. ఇలా అమ్మ నాలో ఉన్న ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని వెన్ను తట్టడం వల్లే ఇప్పుడు నేనీ స్థాయిలో ఉన్నా..’ అంటున్నారీ దర్శక ధీరుడు.


తను నా జీవితానికి డిజైనర్!

జీవిత భాగస్వామిగా, అర్ధాంగిగా తన భార్య రమకు తన గుండెల్లో ప్రత్యేక స్థానమిచ్చే రాజమౌళి.. తన ఎదుగుదలలో ఆమె పాత్ర గురించి ఇలా చెప్పుకొచ్చారు.

‘పైసా సంపాదన కూడా లేని సమయంలో నా భార్య రమ నన్ను పోషించింది. ఈ మాట చెప్పడానికి నేను సిగ్గుపడను. ఓవైపు తను ఇంటి పనులు చేస్తూనే మరోవైపు కెరీర్‌నీ కొనసాగించింది. రోజూ నా పనేంటంటే ఉదయాన్నే తనను ఆఫీస్‌లో దింపడం, తిరిగి ఇంటికెళ్లి కథలు రాసుకోవడం, డైలాగ్స్‌ రాసుకోవడం, మళ్లీ సాయంత్రం తనను ఆఫీస్‌ నుంచి ఇంటికి తీసుకురావడం.. ఇలా చాలా కాలం నా జీవితం కొనసాగింది. నేను పెద్దగా చదువుకోలేదు.. నాకు సినిమాలు తప్ప మరే లోకం తెలియదు. ఇలాంటి తరుణంలో నా భార్యే నాకు అండగా నిలిచింది.. నా వెన్నుతట్టింది. నేను దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు రమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది.. అంతేకాదు.. నా జీవితానికీ తనే డిజైనర్‌! తనే లేకపోతే ఇలా నేను మీ అందరి ముందూ ఉండేవాడినే కాదు..’ అంటూ తన భార్యను ఆకాశానికెత్తేస్తారు ఈ స్టార్‌ డైరెక్టర్.

ఇక తన జీవితాన్ని మలిచిన మూడో వ్యక్తిగా తన వదిన శ్రీవల్లి (ఎంఎం కీరవాణి భార్య, రమ చెల్లెలు)కి క్రెడిట్‌ ఇచ్చేస్తారు రాజమౌళి. ‘మా వదిన శ్రీవల్లి నాకు తల్లితో సమానం. ఓ కొడుకులా నన్ను ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తుంటారామె..’ అని చెబుతారాయన!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్