Malala Wedding: నా జీవితంలో మరపురాని రోజిది
close
Updated : 10/11/2021 19:51 IST

Malala Wedding: నా జీవితంలో మరపురాని రోజిది!

(Photo: Twitter)

‘పెళ్లనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన ఘట్టం.. రెండు మనసుల్ని కలకాలం కలిసి నడిపించే విలువైన క్షణం.. అలాంటి అందమైన రోజిది’ అంటోంది నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌. అసర్‌ మాలిక్‌ అనే వ్యాపారవేత్తతో తాజాగా ఏడడుగులు నడిచి తన బ్యాచిలరెట్‌ లైఫ్‌కి గుడ్‌బై చెప్పిందీ పాక్‌ ఉద్యమకారిణి. ఈ క్రమంలో తమ పెళ్లికి సంబంధించిన ఫొటోల్ని మలాలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అవి విపరీతంగా వైరలవుతున్నాయి. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ఈ కొత్త జంటను శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తుతున్నారు. మరి, ఈ లవ్లీ కపుల్‌ పెళ్లి ముచ్చట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కట్టుబాట్లను కాదని చదువుకునే క్రమంలో 13 ఏళ్ల ప్రాయంలోనే తాలిబన్ల తూటాలకు గురైంది మలాలా యూసఫ్‌ జాయ్‌. ఈ దాడిలో చావు అంచుల దాకా వెళ్లొచ్చినా తన చదువును మాత్రం ఆపలేదామె. చికిత్స కోసం బ్రిటన్‌ వెళ్లి తన కుటుంబంతో కలిసి అక్కడే స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా బాలికా విద్యను ప్రోత్సహించే నేపథ్యంలో ‘మలాలా ఫండ్‌’ పేరుతో నిధులు సేకరిస్తూ ఎంతోమంది ఆడపిల్లలకు విద్యా దానం చేస్తోంది. గతేడాది ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌ విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకున్న ఈ టీన్‌ సంచలనం.. ఆడపిల్లలకు చదువెంత ముఖ్యమో వివరిస్తూ వివిధ వేదికల పైనా తన గళాన్ని వినిపిస్తుంటుంది. ‘I Am Malala’ పేరుతో ఆత్మకథ కూడా రాసుకుంది.

నిరాడంబరంగా ‘నిఖా’!

ఇలా ఓ ఉద్యమ కారిణిగా, మానవ హక్కుల కార్యకర్తగా ప్రపంచవ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న మలాలా తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అసర్‌ మాలిక్‌ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొన్న ఆమె.. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంది. బ్రిటన్ బర్మింగ్‌హామ్‌లోని తన నివాసంలో ఇరు కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ‘నిఖా’ చేసుకుందీ అందాల జంట. పెళ్లి వేడుకలో భాగంగా.. మలాలా సంప్రదాయబద్ధమైన పీచ్‌ పింక్‌ కుర్తా సూట్‌లో మెరిసిపోగా.. అసర్‌ నలుపు-తెలుపు రంగు సూట్‌లో ముస్తాబయ్యాడు. ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఓ లవ్లీ క్యాప్షన్‌ జోడించిందీ కొత్త పెళ్లి కూతురు.

‘నేను, అసర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టాం. ఈ రోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో నిఖా వేడుక జరిగింది. జీవితాంతం కలిసి నడవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇందుకు మీ ఆశీర్వాదాలు కావాలి..’ అంటూ క్యాప్షన్‌ పెట్టిందామె. ఈ నేపథ్యంలో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌, లిల్లీ సింగ్‌.. వంటి ప్రముఖులతో పాటు నెటిజన్లు ఈ అందాల జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఒకరికొకరు ముందే తెలుసా?

మలాలా ఒక్కసారిగా తన పెళ్లి ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. అందరూ ఒకింత షాక్‌కి గురయ్యారు. ఇంతకీ ఆమెది ప్రేమ పెళ్లా?, పెద్దలు కుదిర్చిన వివాహమా?, వరుడెవరు?, ఏం చేస్తాడు?.. వంటి విషయాల గురించి వెతుకులాట మొదలుపెట్టారు చాలామంది నెటిజన్లు.

ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ విభాగాల్లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన అసర్‌.. ప్రస్తుతం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డులో General Manager High Performance పదవిలో కొనసాగుతున్నారు. గతంలో పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా ముల్తాన్‌ సుల్తాన్‌ జట్టుకు ఆపరేషనల్‌ మేనేజర్‌గా, ఫ్రాంఛైజీ యజమానిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే చదువును బట్టి చూస్తే పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌పై ఇద్దరికీ ఉన్న ఇష్టమే.. వీళ్లను కలిపిందని, అదే ప్రేమగా చిగురించి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేలా చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. 2019లో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్టాండ్స్‌లో కూర్చొని తన జట్టును ఛీర్‌ చేస్తోన్న ఓ గ్రూప్‌ సెల్ఫీని అప్పట్లో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు అసర్‌. అందులో మలాలా కూడా ఉండడంతో అప్పట్నుంచే వీళ్లిద్దరికి పరిచయం ఉందన్న ఊహాగానాలు కూడా వినవస్తున్నాయి. ఏదేమైనా ఇంతకాలం వీళ్లు తమ ప్రేమబంధాన్ని రహస్యంగా ఉంచారని ఈ విషయాలను బట్టి అర్థమవుతోంది.

హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ స్వీట్‌ కపుల్!

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని