ఒత్తిళ్లను తగ్గించి.. సంతోషాన్ని పెంచే ఆహారం!

ఒక్కోసారి చిన్న విషయానికే చిరాకు పడుతుంటాం.. పని ఒత్తిడి కాస్త ఎక్కువైతే ఎదుటివారిపై అరుస్తుంటాం. నిజానికి ఇలాంటి మూడ్‌ స్వింగ్స్‌కి మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలే కారణమనుకుంటాం.. కానీ మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తుతుందంటున్నారు నిపుణులు.

Updated : 06 Jan 2024 19:35 IST

ఒక్కోసారి చిన్న విషయానికే చిరాకు పడుతుంటాం.. పని ఒత్తిడి కాస్త ఎక్కువైతే ఎదుటివారిపై అరుస్తుంటాం. నిజానికి ఇలాంటి మూడ్‌ స్వింగ్స్‌కి మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలే కారణమనుకుంటాం.. కానీ మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తుతుందంటున్నారు నిపుణులు. ఇది ఇటు ఆరోగ్యాన్ని, అటు మనసును దెబ్బతీస్తుందంటున్నారు. మరి, ఇలా జరగకూడదంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

మన ఆనందానికి కారణమయ్యే అంశాల్లో ఆహారం కూడా ఒకటి. ఇందులోని కొన్ని రకాల పోషకాలు మన శరీరంలో సెరటోనిన్‌, డోపమైన్‌, ఎండార్ఫిన్లు.. వంటి హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. ఇవన్నీ సంతోషాన్ని పెంచే హార్మోన్లే.. కాబట్టి హ్యాపీగా ఉండగలుగుతాం. అలాగే కొన్ని రకాల పోషకాలు.. మనసుపై సానుకూల ప్రభావం చూపే రసాయనాల్ని విడుదల చేసేలా మెదడును ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు.. వంటి పోషకాలు మానసిక ఒత్తిళ్లను దూరం చేసి సంతోషాన్ని దరిచేరుస్తాయంటున్నారు నిపుణులు.

ఈ పోషకాలు తప్పనిసరి!

మానసిక ఒత్తిళ్లు, మూడ్‌ స్వింగ్స్కు దూరంగా ఉండాలంటే.. రోజువారీ తీసుకునే ఆహారంలో కొన్ని పోషకాలుండేలా చూసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

⚛ ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిద్ర పట్టదు.. ఫలితంగా మరుసటి రోజు తలనొప్పి, చిరాగ్గా అనిపించడం, ఒత్తిడి.. వంటివి వేధిస్తాయి. అయితే ఇందుకు కారణం మెగ్నీషియం లోపమే అంటున్నారు నిపుణులు. దీనివల్ల నిద్రలేమి, ఆందోళన స్థాయులు పెరిగిపోవడం, యాంగ్జైటీ.. వంటి వాటి వల్ల మనసు మనసులో ఉండదు. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించాలంటే రోజూ మెగ్నీషియం ఎక్కువగా లభించే ఆకుకూరలు, పప్పులు, నట్స్‌, గింజలు.. వంటి పదార్థాలు ఆహారంలో చేర్చుకోవాలి.

⚛ నాడీ వ్యవస్థ పనితీరులో జింక్‌ పాత్ర కీలకం. ముఖ్యంగా మెదడులోని ‘హిప్పోక్యాంపస్‌’ పనితీరుని ఇది ప్రేరేపిస్తుంది. ఈ వ్యవస్థ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, భావోద్వేగాల్ని నియంత్రించడంలో సహకరిస్తుంది. అయితే జింక్‌ లోపం వల్ల ఈ వ్యవస్థ దెబ్బతిని.. మతిమరుపు, డిప్రెషన్‌, ADHD (Attention Deficit Disorder).. వంటి సమస్యలొస్తాయట! ఇలా జరగకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో జింక్‌ అధికంగా ఉండే కోడిగుడ్లు, పప్పులు, కాయధాన్యాలు, పుట్టగొడుగులు, కొకోవా, పెరుగు.. వంటివి తప్పనిసరిగా చేర్చుకోమంటున్నారు నిపుణులు.

⚛ శరీరంలో మెదడు, గుండె, కండరాలు, రోగనిరోధక వ్యవస్థ.. పనితీరులో విటమిన్‌ ‘డి’ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ విటమిన్‌ లోపించడం వల్ల ఆయా అవయవాలు/వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో ఆందోళనలు, యాంగ్జైటీ.. వంటివి పెరిగిపోయి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే విటమిన్‌ ‘డి’ కోసం రోజూ కాసేపు లేలేత ఎండలో గడపడంతో పాటు ఈ పోషకం అధికంగా లభించే ఆలివ్‌ నూనె, సాల్మన్‌, కమలాఫలం, పాలు-పాల పదార్థాలు.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

⚛ విటమిన్‌ బి-12 లోపించడం వల్ల మన శరీరంలోని కణజాల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. ఫలితంగా డీఎన్‌ఏ ఏర్పడడంలో లోపాలు తలెత్తి నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఇదీ మతిమరుపు, ఇతర మానసిక సమస్యల్ని తెచ్చిపెడుతుంది. అందుకే బి-12 లోపం లేకుండా రోజువారీ ఆహారంలో పాలు, కోడిగుడ్లు, చేపలు, మాంసం.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

⚛ రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ ‘సి’ సహజసిద్ధమైన మూడ్‌ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇది మెదడులో న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ అనే రసాయనాల్ని విడుదల చేసి మనసును ఆహ్లాదంగా ఉంచుతుంది. అదే ఈ విటమిన్‌ లోపిస్తే డోపమైన్‌ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్స్‌ స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా మానసిక సమస్యలు తలెత్తుతాయి. అందుకే విటమిన్‌ ‘సి’ ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు, క్యాప్సికం, స్ట్రాబెర్రీ, లిచీ, బొప్పాయి.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

⚛ ఐరన్‌ మన శరీరంలోని ప్రతి అవయవానికీ ఆక్సిజన్‌ని మోసుకెళ్తుంది. ఈ పోషకం లోపిస్తే మెదడుకు ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోయి.. ఆందోళన, నీరసం, చిరాకు.. వంటి సమస్యలొస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఐరన్‌ ఎక్కువగా ఉండే పాలకూర, మాంసం, పప్పులు, బీన్స్‌.. వంటివి తరచూ ఆహారంలో చేర్చుకోవాలి.

⚛ మనసులోని భావోద్వేగాల్ని అదుపు చేయడంలో ఫ్యాటీ ఆమ్లాల పాత్ర కీలకం. అలాగే ఇవి శారీరక నొప్పుల్ని నివారించడంలోనూ సహకరిస్తాయి. కాబట్టి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు, వాల్‌నట్స్‌, అవిసె గింజలు, నట్స్‌.. వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మూడ్‌ స్వింగ్స్‌ బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ ప్రసవానంతర ఒత్తిళ్లకు ముఖ్య కారణం కాపర్‌ లోపమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కాపర్‌ మెదడు పనితీరును ప్రేరేపించడంలో సహకరిస్తుందట! కాబట్టి ఈ పోషకం విరివిగా లభించే బంగాళాదుంపలు, బీన్స్‌, తృణధాన్యాలు.. వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.

ఈ ఆహార పదార్థాలతో పాటు నిపుణుల సలహాలు కూడా పాటిస్తే మానసిక సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్