Updated : 10/02/2022 20:23 IST

కోరిక తీరాక కాదు పొమ్మన్నాడు.. ఇప్పుడు డబ్బు కోసం నువ్వే కావాలంటున్నాడు!

ప్రేమగా మాట్లాడుతూ అమ్మాయిల్ని లొంగదీసుకోవడం.. కోరిక తీరాక వదిలించుకోవడం.. ఇలాంటి సంఘటనల గురించి వింటూనే ఉంటాం. అయితే ఇలాంటి ఘటనల్లో శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్న ఆ అమ్మాయి పరిస్థితేంటి? అనుక్షణం ఆ చేదు జ్ఞాపకాలనే తలచుకుంటూ అంధకారంలో ఉండిపోవాల్సిందేనా? అంటే.. ఎంతమాత్రం అక్కర్లేదంటూ తన కథను పంచుకుంటోంది మైసూర్‌కు చెందిన ఆంచల్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి చేతిలో మోసపోయి ఎంతో మానసిక వ్యధను అనుభవించిన ఆమె.. ఆ దుఃఖంలో నుంచి తేరుకొని తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. సొంతంగా వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగింది. వ్యామోహం తీరాక ఒకప్పుడు కాదు పొమ్మన్నవాడే ఇప్పుడు తన సిరి చూసి మళ్లీ తన వెంట పడుతున్నాడని, అయితే ఇలాంటి వంకర బుద్ధి ఉన్న మగాళ్లను నమ్మడానికి వీల్లేదంటూ తన స్వీయానుభవాల్ని ఇలా మన ముందుంచింది.

ప్రేమంటే నాకు తెలిసింది ఒక్కటే.. ఒకరిపై మరొకరికి నమ్మకం. తన చేష్టలతో ఆ నమ్మకాన్నే కలిగించాడు విదుర్‌. తను ఇంటర్‌ నుంచి నాకు పరిచయం. ఒకే కాలేజీలో చదువుకున్నాం. వాళ్లిల్లు కూడా మా పక్క కాలనీలోనే ఉండేది. దాంతో కాలేజీకి వెళ్లేటప్పుడు, తిరిగి ఇంటికొచ్చేటప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్లం. అలా మా మధ్య స్నేహం క్రమంగా పెరిగింది.

తన మాటతీరు ఎంత సున్నితంగా ఉండేదో.. తను చూడ్డానికీ అంతే అందగాడు కూడా! అందం విషయం పక్కన పెడితే.. తను మాట్లాడే మాటలు, నా పట్ల తను చూపించే కేరింగ్ చూసి ఎప్పటికప్పుడు మురిసిపోయేదాన్ని. దీంతో మా మధ్య స్నేహానికి మించిన అనుబంధం మరేదో ఉందనిపించేది. విదుర్‌ కూడా నాపై ఉన్న ఇష్టాన్ని ఎప్పటికప్పుడు చెప్పాలని ప్రయత్నిస్తూ విరమించుకునేవాడు. ఇలా చూస్తుండగానే ఇంటర్‌ పూర్తయింది. ఇద్దరం మంచి మార్కులతో పాసయ్యాం.. ఒకే కాలేజీలో బీటెక్ లో చేరాం.. 

******

ఇలా ఒకే కాలేజీలో సీటొచ్చే సరికి మేము మరింత దగ్గరయ్యామనిపించింది. ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాడో ఏమో విదుర్‌ ఒక రోజు క్లాస్‌ పూర్తయ్యాక నా దగ్గరికొచ్చాడు. రోజూ తనను చూడడం, కలవడం, మాట్లాడడం నాకు కొత్త కాదు.. కానీ ఆ రోజు తను నాకు మరింత కొత్తగా కనిపించాడు. మాటల్లో వణుకు, తన మాటలకు నేనెలా స్పందిస్తానోనన్న బెరుకు ఆరోజు తనలో చూశాను. అంతలోనే.. ‘నీతో ఒక విషయం మాట్లాడాలి.. కానీ ఇక్కడ కాదు.. ఇద్దరం కలిసి గోవా వెళ్దాం.. అక్కడ చెప్తా..’ అన్నాడు. తనేం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలుసు.. నా మనసులో దాగుందీ అదే ఫీలింగ్‌.. కానీ ఎంత ఫ్రెండ్‌ అయితే మాత్రం ఒకబ్బాయితో గోవా అంటే అమ్మానాన్నలు పంపుతారా? అలాగని వాళ్లకు చెప్పకుండా వెళ్తే.. అక్కడ జరక్కూడనిదేదైనా జరిగితే.. వాళ్లకు ఏం సమాధానం చెప్పాలి.. ఇలాంటి ప్రశ్నలన్నీ ఒక్కసారిగా నా మనసుపై విరుచుకుపడ్డాయి. మరోవైపు.. విదుర్‌ను చూస్తే నో చెప్పాలనిపించలేదు. అందుకే ఏదైతే అదవుతుందని ధైర్యం చేశా. తనతో గోవా వెళ్లేందుకు ఒప్పుకున్నా. అయితే ఇంట్లో మాత్రం ఫ్రెండ్స్‌తో టూర్‌కి వెళ్తున్నానని అబద్ధమాడా!

గోవాలో ఒక హోటల్‌లో ముందుగానే ఒక గదిని బుక్‌ చేసి ఉంచాడు విదుర్. సరిగ్గా అదే రోజు వేలంటైన్స్‌ డే. ఫ్రెషప్ అయ్యాక దగ్గర్లోని బీచ్ కి వెళ్ళాం. చుట్టూ ఎటు చూసినా ప్రేమికులు, వాళ్లు చేసుకునే ప్రేమ ప్రతిపాదనలే దర్శనమిచ్చాయి. అంతలోనే విదుర్‌ నా ముందు నిల్చొని.. తన చేతిలోకి నా చేతుల్ని తీసుకొని.. ‘ఐ లవ్యూ.. నువ్వొప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా..’ అనేశాడు. ఆ మాటతో నా సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. వెంటనే నేనూ యస్‌ చెప్పేశా. అలా ప్రేమికుల దినోత్సవం రోజే అధికారికంగా మా ప్రేమ ప్రయాణం ప్రారంభమైంది. ఈ సంతోషాన్ని అర్ధరాత్రి దాకా బీచ్‌లోనే సెలబ్రేట్‌ చేసుకున్నాం. ఆ తర్వాత హోటల్‌కి వెళ్ళాం.  ఎంత ప్రేమికులమైనా పెళ్లి కాకుండా ఒకే గదిలో అంటే.. కాస్త ఇబ్బందిగానే అనిపించింది. కానీ తను అలాంటి వాడు కాదన్న నమ్మకంతో ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టా.

******

ఇంతలో- మన ప్రేమను సెలబ్రేట్ చేసుకుందామంటూ విదుర్ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు.. నేను వద్దన్నా 'వేలంటైన్స్ డే పార్టీ' అంటూ బలవంతం చేశాడు. కాదనలేకపోయాను.. ఆ సెలబ్రేషన్స్ లోనే మేమిద్దరం శారీరకంగా దగ్గరయ్యాం. చివరికి నేను భయపడ్డంతా జరిగిపోయింది. విదుర్ మాత్రం 'దీని గురించి పెద్దగా ఆలోచించకు... ఎలాగైనా మనం పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం కదా' అంటూ సర్దిచెప్పాడు.. నేనూ తన మాటలు నమ్మాను... మరో రెండు రోజులు గోవాలోనే ఉండి, ఇద్దరం తిరిగొచ్చేశాం..

అయితే ఆ తర్వాత నుంచీ విదుర్‌లో క్రమంగా మార్పు రావడం గమనించాను.. నా గురించి పట్టించుకోవడం మానేశాడు.. నేను మాట్లాడ్డానికి ప్రయత్నించినా తప్పించుకువెళ్లిపోయేవాడు.. మొహం చాటేసేవాడు.. ఒకవేళ నేనే బలవంతంగా మాట్లాడితే- నన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అన్నట్లుగా మాట్లాడేవాడు.. అప్పటిదాకా నేనే లోకం అన్నంత ప్రేమ చూపిన తాను.. తేనె పూసిన కత్తిలా ప్రవర్తించడం తట్టుకోలేకపోయా.. తన అవసరం తీరాక నన్ను ఒక్కసారిగా అలా దూరం పెట్టడం, నన్ను పట్టించుకోకపోవడం.. నా మనసుని చాలా బాధపెట్టేవి..

ఈ క్రమంలోనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.. ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదనుకున్నాడో ఏమో.. విదుర్ నాకు చెప్పా పెట్టకుండానే వేరే ఊరు వెళ్లిపోయాడు.. దాంతో మానసికంగా మరింత కుంగిపోయా.. ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరై, కోరిక తీరాక నన్ను వదిలేసి వెళ్లిపోయిన విదుర్ పైన చాలా కోపం వచ్చింది.. ఈ చేదు సంఘటనను తలచుకుంటూ కొన్ని నెలలు నాలుగ్గోడలకే పరిమితమయ్యా. మనసారా ప్రేమించాను కదా.. అందుకే విదుర్‌ని, తన జ్ఞాపకాల్ని నా మనసులో నుంచి తొలగించడం అంత సులభం కాలేదు. నా మానసిక వేదనను చూసి అమ్మానాన్నలు జరిగిన విషయం గురించి ఆరా తీశారు. అప్పుడు వాళ్లతో అసలు నిజం చెప్పక తప్పలేదు. ప్రేమించిన వాడు కాదనుకున్నా.. కన్న పేగు బంధం కదా.. నాకు జరిగిన మోసాన్ని వారు సహించలేకపోయారు.

******

సరిగ్గా ఇలాంటి మయంలోనే నా ఫ్రెండ్‌ నాకో మాట చెప్పింది. ‘నీకు జరిగింది అన్యాయమే కావచ్చు.. కానీ అందులో నీ తప్పు లేదు.. తనే నిన్ను ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని దగ్గరయ్యాడు.. మోసం చేసి వెళ్లిపోయాడు.. అలాంటప్పుడు ఎన్నాళ్లిలా చీకట్లోనే నిన్ను నువ్వు బంధించుకుంటావు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు సహజమే. వాటిని అధిగమించినప్పుడే మనల్ని మనం నిరూపించుకోగలం’ అని! నిజానికి ఆ మాటలే నా మనసును కదిలించాయి. ఆలోచిస్తే అదే నిజమనిపించింది. కాస్త సమయం తీసుకున్నా.. నేనేంటి? నా లక్ష్యాలేంటి? అన్న విషయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టా. అయినా ఒక్కోసారి ప్రతికూల ఆలోచనలతో నా వల్ల కాకపోయేది. అప్పుడు మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌ నాకు భరోసానిచ్చింది. నా జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోయి.. కొత్త ఉత్సాహంతో కెరీర్‌పై దృష్టి పెట్టా. గేమింగ్ అంటే నాకు చిన్నప్పట్నుంచే ఆసక్తి. చదువు పూర్తయ్యాక దాన్నే నా కెరీర్‌ లక్ష్యంగా చేసుకున్నా. సొంతంగా బిజినెస్ ప్రారంభించా.. కష్టకాలం ఎన్నో రోజులుండదన్నట్లు.. వ్యాపారంలో లాభాలొచ్చాయి. బోలెడంత డబ్బు సంపాదించా.

ఇలా నా జీవితానికంటూ ఓ అర్థాన్ని వెతుక్కొని సంతోషంగా ఉన్న నాకు విదుర్‌ మళ్లీ సమస్య అవుతాడని నేను ఊహించలేదు. వ్యసనాలకు బానిసై, చదువుని నిర్లక్ష్యం చేసి ఆవారాగా మారాడు విదుర్‌. లక్షల వ్యాపారంతో సక్సెసైన నన్ను చూసి.. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నానంటూ నాకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు.. క్షమించి పెళ్లికి ఒప్పుకోమంటూ ప్రాధేయపడ్డాడు. అయినా ఒకసారి మోసపోయినందుకే ఆ బాధ నుంచి బయటపడడానికి కొన్నేళ్లు పట్టింది. ఇప్పుడు తనను నమ్మి మరోసారి మోసపోదల్చుకోలేదు.. అందుకే ఈసారి నేనే కాదు పొమ్మన్నాను.. మళ్లీ జీవితంలో ఎప్పుడూ మొహం చూపించద్దన్నాను..

నేననే కాదు.. కొంతమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో ఇలా మోసపోవడం చూస్తూనే ఉన్నాం.. అలాంటి వారందరికీ స్వీయానుభవంతో నేను చెప్పేది ఒక్కటే.. మాటలు, చేతలతో నమ్మి మోసపోకండి.. పూర్వాపరాలు తెలుసుకొని పరిణతితో ముందడుగేయండి. ప్రత్యేకించి చదువుకునే సమయంలో ప్రేమ పేరుతో ఆకర్షణలకు లోనై జీవితాన్ని నాశనం చేసుకోకండి.. మనకంటూ ఓ జీవితం, కెరీర్‌ ఉంటాయి. వాటిపై దృష్టి పెట్టండి.. వ్యక్తిగా సక్సెసైతే.. ఎవరికీ తలవంచాల్సిన అవసరం రాదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని