కొత్త కాపురంలో ఈ పొరపాట్లు వద్దు!

ప్రేమ, అనురాగం, రొమాన్స్‌, అర్థం చేసుకునే తత్వం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే భార్యాభర్తల నిండు నూరేళ్ల అనుబంధానికి పునాది వేసే అంశాలు బోలెడుంటాయి. అయితే కొత్తగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన జంటల్లో చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తూ.. తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి వారి కలల కాపురంలో కలతలు....

Updated : 24 Nov 2022 15:05 IST

ప్రేమ, అనురాగం, రొమాన్స్‌, అర్థం చేసుకునే తత్వం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే భార్యాభర్తల నిండు నూరేళ్ల అనుబంధానికి పునాది వేసే అంశాలు బోలెడుంటాయి. అయితే కొత్తగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన జంటల్లో చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తూ.. తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి వారి కలల కాపురంలో కలతలు రేపుతుంటాయి. మరి, అలా కాకూడదంటే ఆయా పొరపాట్లు జరగకుండా ముందే జాగ్రత్తపడాలంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఇంతకీ, కొత్త జంటలు చేసే ఆ పొరపాట్లేంటి? అవి దొర్లకుండా ఎలా జాగ్రత్తపడాలో తెలుసుకుందాం రండి..

అన్నింటికీ అదే పరిష్కారం!

ఎంత అన్యోన్యంగా ఉన్నా.. దంపతుల మధ్య ఏదో ఒక చిన్న గొడవ జరక్కపోదు. మరీ ముఖ్యంగా నవ దంపతులు.. ఒకరితో ఒకరు సర్దుకుపోవడానికి కాస్త సమయం పట్టచ్చు. ఈ క్రమంలో ప్రతి చిన్న విషయానికీ చిర్రుబుర్రులాడడం, నాదే కరక్ట్‌ అన్న మొండి పట్టుదల వల్ల ఇద్దరికీ మానసిక ప్రశాంతత కొరవడుతుంది. ఇలాంటప్పుడు.. ‘ఓ ముద్దు - ఓ హగ్గు’తో తమ భాగస్వామిని కూల్‌ చేయాలనుకుంటారు కొంతమంది. అయితే అన్ని సమస్యలకూ ఇది పరిష్కారం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలాంటి సాన్నిహిత్యం అప్పటికప్పుడు కోపాన్ని తగ్గించినా.. ఆ తర్వాత మళ్లీ గొడవ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఇద్దరి మధ్య ఎడం పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. అందుకే అది చిన్న గొడవైనా, పెద్ద సమస్యైనా.. ఇద్దరూ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటేనే పరిష్కారమవుతుందని చెబుతున్నారు. కాపురం తొలినాళ్ల నుంచి దంపతులు దీన్ని అలవర్చుకుంటే.. ఎంత పెద్ద సమస్యైనా పరిష్కరించుకోగలుగుతారు.. తద్వారా వాళ్ల అనుబంధమూ దృఢమవుతుంది.

అది నా బాధ్యత కాదు!

‘ఉద్యోగం పురుష లక్షణం.. కుటుంబ బాధ్యతలు చూసుకోవడం ఆడవారి పని!’ ఇప్పటికీ దీన్ని ఫాలో అయ్యేవారు లేకపోలేదు. అయితే ఇది ముమ్మాటికీ పొరపాటే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఫలానా పని భార్యే చేయాలని, భర్తకు అవసరం లేదని.. ఇలాంటి నియమాలు ఎక్కడా లేవని చెబుతున్నారు. పైగా ప్రస్తుతం వృత్తిఉద్యోగాల్ని, కుటుంబ బాధ్యతల్ని చాలామంది దంపతులు సరిసమానంగా పంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి కొత్త జంటలు అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని.. అటు ఇంటి పనుల్ని, ఇటు వృత్తిఉద్యోగ బాధ్యతల్ని సమానంగా పంచుకోవాలి. ఫలితంగా పని భారం తగ్గుతుంది.. ఒకరితో ఒకరు గడిపే సమయం పెరుగుతుంది.. ఆర్థికంగానూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.. ఈ మానసిక సంతృప్తే చక్కటి దాంపత్య బంధానికి బాటలు వేస్తుంది.

మూడో వ్యక్తి వద్దు..

కొత్త కాపురంలో ఒకరితో ఒకరు సర్దుకుపోవడానికి, పరిస్థితులు ఇద్దరికీ అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టచ్చు. అయితే ఆ ఓపిక కూడా లేని కొన్ని జంటలు.. తమ మధ్య సమస్య వచ్చినా, తాము తీసుకున్న నిర్ణయం సరైందా? కాదా? అని నిర్ధరించుకోవడానికైనా.. పుట్టింటి వారిని/అత్తింటి వారిని/స్నేహితుల్ని.. ఇలా మూడో వ్యక్తి సలహా కోసం ప్రయత్నిస్తుంటారు. నిజానికి దీనివల్ల చాలా సందర్భాల్లో సమస్య జటిలమవడం తప్ప మరే ఉపయోగం లేదంటున్నారు నిపుణులు. అందుకే దంపతుల సమస్యలను దంపతులే పరిష్కరించుకోవాలని చెబుతున్నారు.. అలాగే ఏ నిర్ణయమైనా ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, విశ్లేషించుకుంటేనే చక్కటి సమాధానం దొరుకుతుంది. ఒకవేళ ఇదీ సాధ్యం కాకపోతే.. కుటుంబ సభ్యులు/స్నేహితులు/నిపుణుల సలహా తీసుకున్నప్పటికీ.. అంతిమంగా అది మీ ఇద్దరికీ నచ్చడం, ఆమోదయోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. అప్పుడే జంటల మధ్య అవగాహన పెరుగుతుంది.

పిల్లల విషయంలో..

కొత్తగా పెళ్లైన జంటలకు అన్నింటికంటే ముందు ఎదురయ్యే ప్రశ్న ‘పిల్లలెప్పుడు?’ అని! ఇటు కుటుంబ సభ్యుల నుంచి, అటు సమాజం నుంచి చాలామందికి ఈ ప్రశ్న ఎదురవుతుంటుంది. ఈ ఒత్తిడిని భరించలేక.. తాము మానసికంగా సిద్ధపడకముందే పిల్లల కోసం ప్లాన్‌ చేసుకుంటుంటారు చాలామంది దంపతులు. అయితే ఈ తొందరపాటే పనికిరాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితులు, మీకున్న ఇతర బాధ్యతల గురించి వాళ్ల కంటే మీకే ఎక్కువగా తెలిసుంటుంది. మీ సమస్యేంటో వారికి అర్థం కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. మీరు ఎప్పుడు పిల్లల్ని కనాలనుకుంటున్నారో ఇద్దరూ కలిసి చర్చించుకొని ఓ నిర్ణయానికి రావాలి. మరోసారి అవతలి వారి నుంచి ఈ ప్రశ్న తలెత్తకుండా ఉండాలంటే మీ అంతిమ నిర్ణయాన్ని వారితో చెప్పచ్చు. అయితే ఈ క్రమంలో మీ వయసు, ఇతర సంతాన సమస్యల్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ భార్యాభర్తలిద్దరిలో ఎవరికైనా ఇలాంటి ఆరోగ్య సమస్యలుంటే.. మరొకరు అండగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

రొమాన్స్ కావాల్సిందే!

నిండు నూరేళ్ల దాంపత్య బంధంలో రొమాన్స్‌, సాన్నిహిత్యం, శృంగారం.. వీటిదే కీలకపాత్ర! అయితే వీటి గురించి ఇద్దరూ ఎంతగా ఊసులాడుకుంటే ఇద్దరి మధ్య దగ్గరితనం అంతగా పెరుగుతుంది. కానీ కొన్ని కొత్త జంటలు ఇందుకు మొహమాటపడుతుంటాయి. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కొంతమంది దంపతుల్లో ఈ చనువు ఉండదనే చెప్పాలి. నిండు నూరేళ్లు కలతల్లేకుండా కలిసుండాలంటే ఈ మొహమాటం వదిలేయాలంటున్నారు నిపుణులు. సిగ్గు, బిడియం పక్కన పెట్టి.. మీ భాగస్వామికి మీరు ఎలా ఉంటే నచ్చుతుందో తెలుసుకోవాలి. ఫాంటసీలు పంచుకోవాలి. శృంగారానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి.. సినిమాలు చూడాలి. ఇద్దరి మధ్య చనువు పెరగాలంటే రొమాన్స్‌ కీలకం! ఎవరి పనుల్లో వారు ఎంత బిజీగా ఉన్నా.. నిత్యం శృంగార జీవితాన్ని ఆస్వాదించాలి. నిజానికి ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే కాపురాన్ని కడదాకా నడిపిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

ఇవన్నీ చదువుంటే.. మీ పెళ్లైన కొత్తలో మీ భాగస్వామి విషయంలో మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్లు గుర్తొస్తున్నాయా? అవన్నీ తలచుకొని మీలో మీరే నవ్వుకుంటున్నారా? మరి, ఆ జ్ఞాపకాలేవో Contactus@vasundhara.net ద్వారా మాతో పంచుకోండి! ఇలా మీరిచ్చే చిట్కాలు ఎన్నో జంటలకు రిలేషన్‌షిప్‌ పాఠాలుగా ఉపయోగపడచ్చు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్