ఈ హెయిర్‌మాస్క్‌తో పట్టు లాంటి జుట్టు..!
వర్షాకాలంలో హ్యుమిడిటీ వల్ల జుట్టు పొడిబారిపోయి గడ్డిలా మారడం మనలో చాలామందికి అనుభవమే! అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం అత్యవసరం. మరి, అందుకు చాలామందికి పగటి పూట సమయం దొరక్కపోవచ్చు.
వర్షాకాలంలో హ్యుమిడిటీ వల్ల జుట్టు పొడిబారిపోయి గడ్డిలా మారడం మనలో చాలామందికి అనుభవమే! అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం అత్యవసరం. మరి, అందుకు చాలామందికి పగటి పూట సమయం దొరక్కపోవచ్చు. అలాంటివారు రాత్రి పూట పడుకునే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. తద్వారా జుట్టుకు తేమనందించడంతో పాటు వివిధ రకాల జుట్టు సమస్యలకు చెక్ పెట్టచ్చని చెబుతున్నారు.
జుట్టుకో మాస్క్!
జుట్టు ఆరోగ్యానికి వివిధ రకాల హెయిర్‌మాస్క్‌లు/ప్యాక్‌లు ప్రయత్నిస్తుంటాం. అయితే తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే.. అది గుమ్మడికాయతో తయారుచేసిన హెయిర్ మాస్క్‌తోనే సాధ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్ని తీసుకొని.. అందులో రెండు టీస్పూన్ల తేనె వేసి ముద్దలాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. పడుకునే ముందు షవర్ క్యాప్ పెట్టుకొని.. ఉదయాన్నే గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే గడ్డిలా మారిన జుట్టు కాస్తా పట్టులా తయారవుతుంది. మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
ఈ నూనెతో మర్దన!
జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే ముందు కుదుళ్లు దృఢంగా ఉండాలి. అందుకోసం అప్పుడప్పుడూ కుదుళ్లను మృదువుగా మర్దన చేయడం అవసరం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రెండు టీస్పూన్ల ఆలివ్ నూనెలో, రెండు గుడ్లలోని పచ్చసొనలు, కొద్దిగా కలబంద గుజ్జు వేసి మృదువైన మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని కుదుళ్లకు పట్టించి పావుగంట పాటు మర్దన చేయాలి. పడుకునే ముందు జుట్టును పైకి ముడేసుకొని షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి. ఇక మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టుకు తేమనందించి.. మృదువుగా మార్చుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.