ప్రేమించాడు.. పెళ్లంటే మొహం చాటేశాడు!

మేడం.. నేను ఒకబ్బాయిని ప్రేమించా. తనూ నన్ను ఇష్టపడ్డాడు. కానీ పెళ్లికి మాత్రం నిరాకరిస్తున్నాడు. కారణం అడిగితే - ‘మా ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయినే చేసుకుంటాను.. వేరే కులానికి చెందిన అమ్మాయితో పెళ్లికి మావాళ్లు ఒప్పుకోరు..’ అంటున్నాడు. నేను మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పా. అమ్మానాన్న కూడా మా పెళ్లిక...

Published : 27 Mar 2022 10:30 IST

మేడం.. నేను ఒకబ్బాయిని ప్రేమించా. తనూ నన్ను ఇష్టపడ్డాడు. కానీ పెళ్లికి మాత్రం నిరాకరిస్తున్నాడు. కారణం అడిగితే - ‘మా ఇంట్లో వాళ్లు చూసిన అమ్మాయినే చేసుకుంటాను.. వేరే కులానికి చెందిన అమ్మాయితో పెళ్లికి మావాళ్లు ఒప్పుకోరు..’ అంటున్నాడు. నేను మా ఇంట్లో మా ప్రేమ విషయం చెప్పా. అమ్మానాన్న కూడా మా పెళ్లికి అంగీకరించారు. కానీ అతడు పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరం విడిపోయాం. ఇది జరిగి దాదాపు 8 నెలలు అవుతోంది. ఇప్పటికీ నేను తనని మరచిపోలేకపోతున్నాను. నిరంతరం అతని ఆలోచనలే! ఎవరు ఎంత చెప్పినా.. వేరొకరిని నా జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు నా మనసు అంగీకరించట్లేదు. ఈ ఆలోచనలతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. నాకు చనిపోవాలని ఉంది. మావాళ్లు అతన్ని మరిచిపోయి వాళ్లు చూసిన సంబంధం చేసుకోమంటున్నారు. కానీ నా మనసు అందుకు ససేమిరా అంటోంది. అతన్ని ఎలా మార్చుకోవాలి. ప్రస్తుతం నేనున్న పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి? - ఓ సోదరి
జ. మీరు తక్షణం మానసిక నిపుణులను సంప్రదించి తగిన థెరపీ తీసుకోవాలి. ‘నాకే ఇలా ఎందుకు జరగాలి?’ అనే సమాధానం లేని ప్రశ్న మీ మనసును మరీ ఎక్కువగా వేధిస్తుంటే అది మిమ్మల్ని నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేస్తుంది.. మానసికంగానూ కుంగిపోయేలా చేస్తుంది. ఇలాంటి ఉద్వేగభరితమైన సమయంలో పెళ్లి లేదా మీ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. అలాగే అతన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి? అనే అంశం గురించి ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మీ పూర్తి ఏకాగ్రత నిపుణులు ఇచ్చే సలహాలు, సూచనలపైనే ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం మీకు మీరుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే స్థితిలో మీరు లేరు. ముందుగా ఆ మానసిక సంఘర్షణ నుంచి బయటపడాలి. ఇందుకోసం ప్రస్తుతం మీరున్న స్థితి గురించి మీ తల్లిదండ్రులకు వివరంగా చెప్పి, వారి సహాయంతోనే మానసిక నిపుణులను సంప్రదించండి. ఇక మీ పరిస్థితి బాగు పడ్డాక మీకున్న సమస్యల గురించి ఆలోచించి, భవిష్యత్తుకు ఉపయోగపడేలా సరైన నిర్ణయాలు తీసుకోండి. అంతేతప్ప ప్రస్తుతం మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని