నేను చేసింది తప్పా?? ఒప్పా??

నేను చదువుకొనే రోజుల్లో మా దగ్గరి బంధువు ఒకర్ని నాలుగేళ్లు ప్రేమించాను. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ మా ఇంట్లో ఈ విషయం చెప్పినప్పుడు ఒప్పుకోలేదు. అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులెవరూ మా అమ్మానాన్నకి ఇష్టం లేకపోవడంతో ఆ సంబంధం వద్దని గొడవ పెట్టారు.

Published : 13 Jan 2022 21:52 IST

నేను చదువుకొనే రోజుల్లో మా దగ్గరి బంధువు ఒకర్ని నాలుగేళ్లు ప్రేమించాను. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ మా ఇంట్లో ఈ విషయం చెప్పినప్పుడు ఒప్పుకోలేదు. అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులెవరూ మా అమ్మానాన్నకి ఇష్టం లేకపోవడంతో ఆ సంబంధం వద్దని గొడవ పెట్టారు. అతడు కూడా మా ఇంట్లో వాళ్లతో మాట్లాడే ప్రయత్నమేమీ చేయలేదు. మా నాన్న అతనితో ఫోన్‌లో మాట్లాడిన మాటలకి కోపం వచ్చి వదిలి వెళ్లిపోయాడు. అప్పుడు నేను చాలా కుంగిపోయా. ఆ సమయంలో మా అమ్మానాన్నకి తెలిసిన సిద్ధాంతికి నా జాతకం చూపించి మా ఇద్దరి జాతకాలూ కలవలేదు కాబట్టి పెళ్లికి ఒప్పుకోలేదని అన్నారు. కొన్ని రోజుల తర్వాత అతడు తిరిగి వచ్చి మళ్లీ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మానాన్నకి తెలియకుండా అలా మాట్లాడడం వారిని మోసం చేసినట్లే అవుతుందని నేనే అతన్ని వెళ్లిపోమన్నా. నా తల్లిదండ్రులు అంత చెప్పిన తర్వాత కూడా మరోసారి ప్రయత్నిస్తే వాళ్లు నన్ను బయటికి పంపించేస్తారు. అదీకాక కన్నవారిని బాధపెట్టి నేను ఏం సుఖపడగలను అనే ఉద్దేశంతో అలా చేశా. కానీ ఇప్పుడు నాకు అంతా అయోమయంగా ఉంది. మా అమ్మానాన్నని నేను గుడ్డిగా నమ్మి, అతనికి అన్యాయం చేశానేమో అని బాధగా ఉంది. ఈ విషయమై నా మనసులో నేనే చాలా మథనపడుతున్నాను. నేను చేసింది తప్పా? ఒప్పా?? దయచేసి తెలుపగలరు.. - ఓ సోదరి

జ: మీ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం వరకూ బాగానే ఉంది.. కానీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కుటుంబాలు కూడా అందులో భాగం అవుతాయన్నది చదువుకున్న వారిగా మీ ఇద్దరికీ తెలిసిన విషయమే. అయితే మీ కుటుంబ సభ్యులు అతనితో ప్రవర్తించిన తీరు, వారి మాటలకు ఆత్మాభిమానం దెబ్బతిన్న అతను.. ఇరువైపులా వారి అభిమతాల ప్రకారమే ప్రవర్తించినట్లు స్పష్టమవుతోంది. అతని తరఫు వాళ్లు ఇష్టం లేదు కాబట్టి వారి ప్రవర్తన నచ్చలేదని మీ వాళ్లు, అలాగే మీ వాళ్ల మాటతీరు నచ్చలేదని అతను.. ఇలా ఎవరి గురించి వారు ఆలోచించుకున్నారే తప్ప వ్యక్తిగతంగా మీకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ మీ వాళ్లకు తెలియకుండా మీతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరుచుకోవాలని ప్రయత్నించడం అతనిలోని నిలకడ లేమిని సూచిస్తోంది.

కాబట్టి అతను జీవితాంతం మీకు తోడుగా నిలబడగలుగుతాడా? మీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వగలుగుతాడా?? మీ అమ్మానాన్నని గుడ్డిగా నమ్మి అతన్ని వదులుకుంటున్నా అని మీరు సంశయిస్తున్నారా? అతడిని గుడ్డిగా నమ్మి నా తల్లిదండ్రులను వదులుకోవాల్సి వచ్చిందన్న భావనకి లోనవుతున్నారా?.. ఇలా ఇన్ని కోణాల్లో ఓసారి ఆలోచించి చూడండి. కాబట్టి అతడు మీ వ్యక్తిత్వాన్ని గౌరవించి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి అని మీకు అనిపిస్తే, అతడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే ఇలా చాటుమాటుగా కాకుండా.. సూటిగా తన ప్రేమని వ్యక్తపరుస్తూ మీ తల్లిదండ్రులతో మాట్లాడడం, మాట పట్టింపులకు తావివ్వకుండా తను మీ పెళ్లి కోసం ప్రయత్నించడం, అలాగే వాళ్లు పరస్పరం ఒకరినొకరు అంగీకరించి మాట్లాడుకోవడం.. ఇవన్నీ జరుగుతాయేమో ఆలోచించండి. మీ ఇద్దరికీ పెళ్త్లెన తర్వాత అతని గురించి మీ తల్లిదండ్రులు కానీ లేదా వారి గురించి అతను కానీ మిమ్మల్ని దెప్పిపొడుస్తుంటే భరించడం కష్టం. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించుకున్నాకే తుది నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్