లవ్ మ్యారేజే.. అయినా తన సంప్రదాయాలే పాటించాలంటున్నాడు!

నమస్తే మేడమ్‌.. నా వయసు 29 సంవత్సరాలు. మాకు పెళ్లై ఆరు సంవత్సరాలవుతోంది. మాది మతాంతర వివాహం. ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైన ఆరు నెలలకి మా అత్తింటివారితో జరిగిన గొడవ వల్ల బయటకు వచ్చేశాం. అప్పటినుంచి నా భర్త మత సంప్రదాయాలను నేను పాటించడం లేదు.

Published : 28 Aug 2021 19:23 IST

నమస్తే మేడమ్‌.. నా వయసు 29 సంవత్సరాలు. మాకు పెళ్లై ఆరు సంవత్సరాలవుతోంది. మాది మతాంతర వివాహం. ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైన ఆరు నెలలకి మా అత్తింటివారితో జరిగిన గొడవ వల్ల బయటకు వచ్చేశాం. అప్పటినుంచి నా భర్త మత సంప్రదాయాలను నేను పాటించడం లేదు. ఇప్పుడు నా భర్త వాటిని పాటించమని ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఆర్థికంగా అంత స్థితిమంతులం కాదు. నేనే చిన్న పిల్లల్ని చూసుకుంటాను. ఉద్యోగం చేస్తూ నా భర్తకి సహాయం చేస్తున్నాను. ఇన్ని రోజులూ లేని మత సంప్రదాయాలను ఇప్పుడు పాటించమంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఆయన కుటుంబం నుంచి నాకు ఎటువంటి సహాయం లేదు. మా కుటుంబ సభ్యులే నాకు చాలా సహాయం చేశారు. అయినా నా భర్త.. వాళ్ల సంప్రదాయాలను పాటించమని ఒత్తిడి చేస్తున్నాడు. లేకపోతే తనని వదిలేయమని అంటున్నారు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. పెళ్లి చేసుకునే ముందే మీ ఇద్దరికీ ఒకరి మతం గురించి మరొకరికి అవగాహన ఉందనే అనుకుంటున్నాను. పెళ్లైన ఆరు నెలలకే అతని కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ కారణంగా మీరిద్దరూ వాళ్లకు దూరంగా ఉంటున్నారని రాశారు. అలాగే మత సంప్రదాయాల విషయంలో కొంతకాలం పాటు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకపోయినా, ఇప్పుడు అదే సమస్యగా మారిందంటున్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి ఈ విషయంలో మీ భర్త మొండిగా వ్యవహరించడానికి కారణాలేంటో ఓసారి ఆలోచించండి. అతని తరఫువారు దూరం కావడం అతనికి బాధాకరంగా ఉందా? అందువల్ల మిమ్మల్ని ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నారా అన్నది తెలుసుకోండి.

కుటుంబ సభ్యులకు, మతాచారాలకు దూరంగా ఉండడం వల్ల మీ కోసం వాటిని త్యాగం చేయాల్సి వచ్చిందన్న భావన కూడా ఇప్పుడు మీ భర్త ప్రవర్తనకు కారణం కావచ్చు. ప్రత్యేకించి మతాంతర వివాహాల విషయంలో- ఆచారాలు, సంప్రదాయాలకు సంబంధించి ఇద్దరూ ముందుగానే ఒక అవగాహనకు వచ్చి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దాని ప్రకారమే నడుచుకోవడం అవసరం. లేదంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు.

ఈ క్రమంలో- విడిగా కాపురం పెట్టిన ఇన్నాళ్లకు ఇప్పుడు ఉన్నట్లుండి మీ భర్త సంప్రదాయాల విషయంలో ఒత్తిడి చేయడానికి అసలు కారణమేమిటో అతనితోనే వివరంగా మాట్లాడి తెలుసుకోండి. ఇలాంటి విషయాలకు సంబంధించి పెళ్లికి ముందు మీ ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, ఒప్పందాలు ఎలా ఉన్నాయో ఇద్దరూ కలిసి ఓసారి విశ్లేషించుకోండి. ఇప్పుడు మీ ఇద్దరూ వాటి మేరకే నడుచుకుంటున్నారో లేదో సమీక్షించుకోండి.

అలాగే ఆచారవ్యవహారాలను పక్కన పెడితే - మిగిలిన అంశాల్లో మీ భర్త ఎలా ఉంటున్నారో, మునుపటి ప్రేమ కనపరుస్తున్నారో లేదో కూడా పరిశీలించండి. కేవలం ఒక్క సంప్రదాయాల విషయంలో మాత్రమే అతను మొండిగా ఉంటున్నాడనుకుంటే- సామరస్యంగా చర్చించుకోవడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందేమో ఆలోచించండి. అవసరమైతే ఓసారి ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులను వ్యక్తిగతంగా సంప్రదించండి.

ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడంలో తప్పు లేదు. అయితే అది ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా ఉండాలే తప్ప బలవంతంగా కాదు. ఇదే విషయం అతనికి అర్ధమయ్యేలా చెప్పి చూడండి. అలాగే ఆచారాల విషయంలో మీరు కూడా మీకు ఇబ్బంది లేనంత వరకు అతని అభిప్రాయాలకు ఎంతవరకు మద్దతు ఇవ్వగలరో ఆలోచించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్